నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ ప్రభుత్వం, తొలి నుంచి వివాదమే

Nimmagadda vs.AP government : నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు, ఏపీ ప్రభుత్వ పెద్దలకు మధ్య వివాదం తలెత్తడానికి కారణం ఏమిటి? నిమ్మగడ్డపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం, పదవి నుంచి తొలగించే వరకు పరిస్థితి ఎందుకు వెళ్లింది? ఎస్‌ఈసీగా నిమ్మగడ్డకే అధికారాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా జగన్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు? ప్రభుత్వంపై నిమ్మగడ్డకు పంతం ఎందుకు? నిమ్మగడ్డ వెనుక చంద్రబాబు ఉన్నారన్న ఆరోపణల్లో వాస్తవం ఎంత?
మొదటి నుంచి వివాదమే : –
ఏపీ పంచాయతీ ఎన్నికలపై మొదటి నుంచి వివాదం నడుస్తోంది. గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచి ప్రభుత్వానికి, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మధ్య విబేధాలు ప్రారంభమయ్యాయి. ఎంపీపీ, జెడ్పీటీసీ ఏకగ్రీవాల్లో అక్రమాలు జరిగాయని టీడీపీ ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో పలుచోట్ల ఏకగ్రీవాలు చెల్లవని నిమ్మగడ్డ తేల్చిచెప్పారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉన్నారన్న అభిప్రాయానికి సీఎం జగన్ వచ్చారు.
ఎన్నికలు వాయిదా : –
కరోనా కేసులు నమోదవుతున్న సమయంలో ఎన్నికలు వాయిదా వేస్తూ నిమ్మగడ్డ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం నిమ్మగడ్డ, సీఎం జగన్ మధ్య మరింత చిచ్చురేపింది. నిమ్మగడ్డపై సీఎం జగన్ నేరుగా గవర్నర్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం నిమ్మగడ్డ, చంద్రబాబు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని…. చంద్రబాబు చెప్పడంతోనే నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారని జగన్ ఆరోపణలు చేశారు. ఆరోగ్యశాఖ నివేదిక తీసుకోకుండా, ప్రభుత్వంతో సంప్రదించకుండానే ఏకపక్షంగా ఎన్నికలను ఎలా వాయిదా వేస్తారని ప్రశ్నించారు.
నిమ్మగడ్డ నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీం : –
జగన్ ప్రభుత్వం అక్కడితో ఆగలేదు. ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. నిమ్మగడ్డ నిర్ణయాన్ని సుప్రీంకూడా సమర్థించింది. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. చెప్పాపెట్టకుండా హైకోర్టు న్యాయమూర్తి స్థాయి వ్యక్తి ఎస్‌ఈసీగా ఉండాలని జీవో తీసుకొచ్చింది. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పదవిని కోల్పోయారు. ఆయన స్థానంలో తమిళనాడుకు చెందిన హైకోర్టు రిటైడ్ జడ్జి కనగరాజును జగన్ సర్కార్ నియమించింది.
నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు : –
తనను పదవి నుంచి తప్పించడంపై నిమ్మగడ్డ రమేష్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో దీనిపై కొన్నాళ్లపాటు సాగిన విచారణ… చివరికి నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తిరిగి ఎస్‌ఈసీ బాధ్యతలు అప్పగించాలని సూచించింది. అయినా జగన్ ప్రభుత్వం మాత్రం హైకోర్టు తీర్పును అమలు చేయకపోవడంతో నిమ్మగడ్డ మరోసారి హైకోర్టు మెట్లెక్కారు. సుప్రీంకోర్టులోనూ ఈ కేసు విచారణలో ఉందని హైకోర్టుకు ప్రభుత్వం చెప్పినా… తమ తీర్పు అమలు చేయాల్సిందేని ధర్మాసనం ఆదేశించింది. దీంతో కనగరాజును తొలగించి.. మళ్లీ ఎస్‌ఈసీ పీఠంపై నిమ్మగడ్డనే కూర్చోబెట్టాల్సిన పరిస్థితి జగన్ సర్కార్‌కు ఏర్పడింది.
చర్చలు : –
ఎస్‌ఈసీ బాధ్యతలు తిరగి చేపట్టిన తర్వాత నిమ్మగడ్డ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని అనేక ప్రయత్నాలు చేసినా… ప్రభుత్వం మాత్రం సహకరించలేదు. ఎన్నికల నిర్వహణకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌కు ప్రయత్నిస్తే.. ప్రభుత్వం సహకరించలేదు. దీంతో నిమ్మగడ్డ మళ్లీ హైకోర్టు దృష్టికి తన సమస్యను తీసుకెళ్లారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా..న్యాయస్థానం ముగ్గురు చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు… ఎస్‌ఈసీతో చర్చించి ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. దీంతో శుక్రవారం సీఎస్, మరో ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎస్‌ఈతో భేటీ అయి.. వివరించిన కొద్ది గంటల్లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.
పదవిలో ఉండగానే ఎన్నికలు : –
నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మార్చి నెలాఖరు వరకు ఎస్‌ఈసీ పదవిలో ఉంటారు. ఆయన పదవీ విరమణ చేయగానే ఎన్నికలకు వెళతామని మంత్రులు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో తాను పదవిలో ఉండగానే ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ మరింత పట్టుదలకు వచ్చారు. అందుకే పట్టుబట్టి కోర్టుల్లో పోరాడి తన పదవి దక్కించుకున్నారు. ముచ్చటగా మూడోసారి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో ఆయన నిర్ణయం మరోసారి వివాదాస్పదమవుతోంది.