ఏపీ, తెలంగాణ రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు, దోపిడి చేస్తున్న ప్రైవేటు బస్సులు

No Rtc Bus Between Ap and Telangana : దసరా వస్తుందంటే చాలామంది హైదరాబాదీలు సొంతూళ్ల బాట పడుతుంటారు. ప్రతి ఏడాదీ.. పండగ మూడు రోజుల ముందు నుంచీ నగరంలో ఏ బస్టాప్స్ చూసినా.. ఊరికి వెళ్లే ప్రయాణికులతో రద్దీగా కనిపిస్తాయి. అయితే ఆర్టీసీ బస్సుల వ్యవహారంలో రెండు రాష్ట్రాల మధ్య కుదరని సయోధ్యతో .. నగరవాసులకు ఇక్కట్లు మొదలయ్యాయి. అసలే కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే సందిట్లో సడేమియాలా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఈ గోల్డెన్ చాన్స్‌ను అందిపుచ్చుకున్నాయి.
సాధారణ రోజుల్లోనే పండుగ బాదుడు మొదలెట్టే ప్రైవేట్ ట్రావెల్స్ .. ఏ మాత్రం ఛాన్స్ మిస్ అవకుండా ప్రయాణికులను నిలువునా దోపిడీ చేసేస్తున్నాయి. కరోనాతో ఈమధ్య నష్టాలను ఫేస్ చేసిన యాజమాన్యాలు.. ఈ డబుల్ ఢమాకాతో అసలు, వడ్డీలను ప్రయాణికులు నుంచి రాబడుతున్నాయి. మొత్తంగా తెలంగాణ, ఏపీ మధ్య ఆర్టీసీ బస్సులు వ్యవహారంపై నెలకొన్న ప్రతిష్టంభన ప్రైవేట్ ట్రావెల్స్‌కు కాసులు కురిపిస్తోంది.
https://10tv.in/private-bus-operators-collecting-high-fares-for-journey/
తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే అతి పెద్ద పండుగలలో దసరా ఒకటి . హైదరాబాదులో ఉద్యోగం కోసం వచ్చిన వాళ్లు.. మిగతా పనుల మీద వచ్చిన వాళ్లూ.. దసరా పండక్కి సొంతూర్లకి వెళ్లి ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలనుకుంటారు. అందుకే దసరా పండుగ వచ్చిందంటే చాలు నగరాల నుంచి తమ సొంతూళ్లకు వెళ్లడానికి బారులు తీరుతారు. ప్రతి ఏడాది రైళ్లు, బస్సులు అన్ని ప్రయాణీకులతో కిటకిటలాడుతుంటాయి.
కానీ కరోనా కారణంగా చాలామంది, ఎవరికి వారే సొంతంగా ప్రయాణాలు చేస్తున్నారు. మరికొందరు తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈసారి రెండు రాష్ట్రాల మధ్య ఇంటర్ స్టేట్ సర్వీసుల వ్యవహారం తేలకపోవడంతో .. ప్రైవేటు ఆపరేటర్లు పండగ సీజన్‌ను సొమ్ము చేసుకుంటున్నారు. డబుల్, ట్రిఫుల్ చార్జీలు వసూలు చేస్తూ అందిన కాడికి ప్రయాణికుల నుంచి దోచుకుంటున్నారు.
లాక్‌డౌన్ నుంచి ట్రావెల్స్ బస్సుల టాక్స్ మినహాయింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో.. కేవలం 1500 ప్రైవేట్ ట్రావెల్ బస్సులే రెండు రాష్ట్రాల మధ్య తిరుగుతున్నాయి. అందులో ఎక్కువగా ఏపీకి చెందిన బస్సులే ఉన్నాయి. హైదరాబాద్ జనాలంతా దసరా కోసం సొంతూళ్లకు వెళ్తున్నారు. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది. దీన్ని ప్రైవేట్ ట్రావెల్స్ అదనుగా తీసుకుని చార్జీలు అమాంతం పెంచేశాయి. ప్రైవేటు ఆపరేటర్లు నిన్న మొన్నటి వరకు ఉన్న చార్జీలపై 200 నుంచి 300 శాతం పెంచి మరీ వసూలు చేస్తున్నారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ, తిరుపతి, విశాఖ రూట్లలో ప్రైవేటు ఆపరేటర్లు ఆలైన్ రిజర్వేషన్లు ప్రారంభించారు. టికెట్ల ధరలను పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. బెంగుళూరు నుంచి విజయవాడకు ఏసీ బస్ టికెట్ ధర మామూలు రోజుల్లో 13 వందల రూపాయలు ఉంటే ఇపుడు దానిని 3 వేలకు పెంచేశారు. విజయవాడ, హైదరాబాద్‌ల మధ్య ఏసీ బస్ టికెట్ 600 రూపాయలు ఉంటే .. డిమాండ్ బట్టి 1000 నుంచి 1500లకు వసూలు చేస్తున్నారు. ఇలా అన్ని రూట్స్‌లో ఇష్టానుసారం రేట్లు పెంచేశారు.
ఒకవైపు ఆర్టీసీ ఇంటర్ స్టేట్ బస్సులు లేకపోవడం. మరోవైపు కరోనా కారణంతో రైళ్ల సదుపాయం కూడా పెద్దగా లేదు. దీంతో ప్రైవేటు బస్సుల్లోనే సొంత ఊర్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా రెండు రాష్ట్రాల అధికారులు తమకు దసరా బాదుడు నుంచి విముక్తి కలిగించాలని ప్రజలు కోరుతున్నారు.
మరోవైపు అంతర్రాష్ట్ర ఆర్టీసీ బస్సు సేవల ప్రారంభానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య జరిగిన చర్చల్లో పురోగతి కనిపిస్తోంది. తెలంగాణలో తమ బస్సుసర్వీసులకు సంబంధించి కిలోమీటర్లను తగ్గించుకోవడానికి ఏపీ అధికారులు అంగీకరించారు. దీంతో దసరా తర్వాత రెండు రాష్ట్రాల అధికారుల మధ్య ఒప్పందం కుదిరే అవకాశముంది. ఆ వెంటనే తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను ప్రారంభించే చాన్స్ ఉంది.
లాక్‌డౌన్‌కు ముందు వరకు ఏపీ బస్సులు తెలంగాణలో 2.64 కిలోమీటర్ల మేర తిరిగేవి. తెలంగాణ బస్సులు ఏపీలో 1.61 లక్షల కిలోమీటర్ల మేర సేవలందించేవి. అన్‌లాక్ నిబంధనల తర్వాత.. ఇరు రాష్ట్రాలు అంతర్రాష్ట్ర సేవలపై కొత్తగా ఒప్పందాలు చేసుకోవాల్సి ఉండగా.. అవి ఎంతకూ ఒక కొలిక్కి రాలేదు. కిలోమీటర్లు తగ్గించుకోవాలని తెలంగాణ.. మీరే కిలోమీటర్లు పెంచుకోండంటూ ఏపీ వాదించుకుంటూ వచ్చాయి. దీంతో.. ఎప్పటికప్పుడు ఫలితం లేకుండానే చర్చలు ముగిశాయి.
అయితే శుక్రవారం జరిగిన చర్చల్లో.. ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తెలంగాణలో తమ బస్సులను 1.61 లక్షల కిలోమీటర్లు తిప్పేందుకు అంగీకరించారు. దీంతో.. ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సేవలకు మార్గం సుగమమైంది. ఈ చర్చల వివరాలను తెలంగాణ అధికారులు.. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు వివరించారు. వారు సీఎం కేసీఆర్‌కు ఓ నివేదికను సమర్పించినట్లు తెలిసింది.
ముఖ్యమంత్రి ఆ నివేదికలో కొన్ని మార్పులను సూచించినట్లు సమాచారం. అదే విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ అధికారులు.. ఏపీ అధికారులకు తెలియజేశారని తెలిసింది. దీనికి ఏపీ సర్కారు అంగీకరిస్తే.. రానున్న మంగళవారం లేదా బుధవారం ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య ఒప్పందం కుదిరే అవకాశముంది.