Atchannaidu
Atchannaidu Yuvagalam Vijayotsava Sabha : యువగళం విజయోత్సవ సభకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు హాజరుకానున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. యువగళం విజయోత్సవ సభలో టీడీపీ – జనసేన ఉమ్మడి సందేశం ఇవ్వబోతున్నాయని పేర్కొన్నారు. తరువాత నిర్వహించే రెండు సభల్లో మ్యానిఫెస్టో ప్రకటిస్తామని చెప్పారు. యువగళం పాదయాత్ర నిర్వహించని ప్రాంతాల్లో 20 రోజులపాటు లోకేష్ పర్యటించనున్నారని వెల్లడించారు. అందుకు కార్యాచరణ కూడా సిద్ధం చేశామని తెలిపారు. బుధవారం యువగళం విజయోత్సవ సభ నిర్వహించాలని నిర్ణయించామని పేర్కొన్నారు.
రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు ఈ సభకు రాబోతున్నారని వెల్లడించారు. విశాఖ ఏయూ మైదానంలో ఈ సభ నిర్వహణకు అనుమతి కోరామని, రిక్వెస్ట్ లెటర్ కూడా ఇచ్చామని తెలిపారు. కానీ, ప్రభుత్వం వీసీపై ఒత్తిడి తెచ్చి అనుమతి ఇవ్వకుండా చేశారని ఆరోపించారు. ఆర్టీసీ బస్సులు ఎవ్వరికైనా అద్దెకు ఇవ్వొచ్చని, దానికి చార్జీలు కూడా తీసుకుంటారని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇవ్వాలని స్వయంగా తానే అభ్యర్థించానని తెలిపారు.
ప్రైవేట్ కాలేజీల వాహనాలు ఇస్తామన్నారని, వారందరినీ ప్రభుత్వం బెదిరిస్తుందన్నారు. జగన్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆయన పతనం ఆగదన్నారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా పెద్ద ఎత్తున 5 లక్షల మంది ప్రజలు సభకు రాబోతున్నారని తెలిపారు. కార్యకర్తలు స్వచ్ఛందంగా రైళ్లల్లో రాయలసీమ నుంచి కూడా వస్తున్నారని పేర్కొన్నారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.