హీరోలని సినిమాల్లో నటించేవారిలో కాదు.. వీరిలో చూసుకోవాలి: పవన్ ఆసక్తికర కామెంట్స్
"సింహం గడ్డం గీసుకోదు.. నేను గీసుకుంటాను అని డైలాగులు చెబితే వెనక రీరికార్డింగులు వస్తాయి" అని పవన్ అన్నారు.

Pawan Kalyan
కడప కార్పొరేషన్ హైస్కూల్ తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. “హీరోలని సినిమాల్లో నటించేవారిలో కాదు, మీ అధ్యాపకుల్లో చూసుకోండి. సినీ నటుడిగా చెబుతున్నా. సింహం గడ్డం గీసుకోదు.. నేను గీసుకుంటాను అని డైలాగులు చెబితే వెనక రీరికార్డింగులు వస్తాయి. సినీ హీరోలు నడిస్తే రీరికార్డింగులు. కార్గిల్ లో చనిపోయిన వారికి, ఉపాధ్యాయులకు రీరికార్డింగులు ఉండవు.. కానీ వారే నిజమైన హీరోలు.. వారిని గౌరవించండి” అని అన్నారు.
సొంత ట్రస్ట్ నుంచి కడప మున్సిపల్ మెయిన్ పాఠశాలకు నిధులు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల భవనాల్లో ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం లేకుండా చూడాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
“తల్లిదండ్రులకు ఉపాద్యాయుల మధ్య సమన్వయం పెరగాలి. దేశం బాగుండాలంటే అధ్యాపకులపై పెట్టుబడులు పెట్టాలి. అందరికంటే ఉపాధ్యాయులకు ఎక్కువ జీతం ఉండాలనేది నా కోరిక. కేబినెట్ లో విద్యార్థుల పోషకాహారం పై చర్చిస్తా. సమాజంలో సైబర్ క్రైం రోజురోజుకూ పెరుగుతోంది. సోషల్ మీడియాపై అదనపు ఆంక్షలు ఉండేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరతాం.
హీరోలు సినిమాలలో కాదు ఉపాధ్యాయుల్లోనూ ఉన్నారు. నేటి సమాజానికి విలువలతో కూడిన విద్య అవసరం. సోషల్ మీడియాలో ఏమి చూస్తే భవిష్యత్ లో అలాగే తయారవుతారు. విలువలు పాటించే వ్యక్తులను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి. నిజమైన హీరోలకు రీరికార్డింగ్ ఉండదు. విద్యార్థులు చిన్నప్పటి నుంచి సహాయ గుణాన్ని అలవాటు చేసుకోవాలి” అని పవన్ చెప్పారు.
రేవంత్ అన్నకి హృదయ పూర్వక అభినందనలు: వైఎస్ షర్మిల