Peddireddy
అధినేత చుట్టూ ఉన్న నేతలు ఒక్కొక్కరు సైలెంట్ అయిపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అంతా తామేనని ఊరేగిన లీడర్లంతా ఇప్పుడు చాప చుట్టేస్తున్నారు. విజయ సాయిరెడ్డి లాంటి నేత ఎంపీ పదవికి, పార్టీకి, పాలిటిక్స్‌కు బైబై చెప్పేశారు. ఇప్పుడు మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంతు వచ్చింది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా స్యాండ్, ల్యాండ్, మైనింగ్ దందాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డికి ఉచ్చు బిగిస్తోంది కూటమి సర్కార్. ఆ మాజీ మంత్రి అరాచకం ఫైల్స్ రెడీ అయ్యాయని..అసలు ఎపిసోడ్ ముందుందని లీకులు ఇస్తోంది కూటమి ప్రభుత్వం. అధికారంలో ఉన్నప్పుడు తన మాటే శాసనంగా..చెప్పిందే వేదంగా నడిపించి..అక్రమాలకు పాల్పడ్డారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద తీవ్ర అలిగేషన్స్ ఉన్నాయి.
మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూకబ్జా చేశారన్న అలిగేషన్స్ నేపథ్యంలో విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విచారణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్, జిల్లా ఎస్పీ మణికంఠ, ఐఎఫ్‌ఎస్ అధికారి యశోద బాయ్‌తో ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ భూకబ్జా, అక్రమాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో కబ్జా అయినట్లు ఆరోపణలు ఉన్నాయి.
నివేదికలు సిద్ధం?
ఈ భూ అక్రమాలపై అధికారులు నివేదికలు కూడా సిద్ధం చేశారట. 75 ఎకరాల అటవీ భూములు అక్రమంగా పెద్దిరెడ్డి కుటుంబం పరిధిలో చేర్చినట్లు సీఎం దగ్గరకు ఇప్పటికే ప్రైమరీ రిపోర్ట్ వెళ్లిందంటున్నారు. అంతేకాదు పుంగనూరు, తంబళ్లపల్లి, రేణిగుంట మండలాల్లో రికార్డుల తారుమారు, బినామీ పేర్లతో వందల ఎకరాలను ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై పక్కా ఆధారాలు సేకరించి సీరియస్ యాక్షన్ తీసుకోవాలని రెడీ అవుతోంది ప్రభుత్వం. రెవెన్యూ శాఖపై సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు..పెద్దిరెడ్డి ఆక్రమించారని ఆరోపిస్తున్న భూములపై ఆరా తీశారు.
జగన్‌కు చెందిన కంపెనీ కోసం అటవీ భూములు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో రెండు నెలల కిందే విచారణ జరిపించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఇప్పుడు పెద్దిరెడ్డి మీద వచ్చిన ఆరోపణలపై కూడా విచారణకు ఆదేశించారు డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్. పుంగనూరు నియోజకవర్గంలోని మంగళంపేట దగ్గరలోని అడవుల్లో భూములు ఆక్రమించినట్లు వస్తున్న అలిగేషన్స్‌పై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆర్డర్స్ ఇచ్చారు.
అటవీ భూముల రికార్డులను తారుమారు చేశారా..ఒకవేళ రికార్డుల తారుమారు చేస్తే లబ్ధిపొందిందెవరో తేల్చాలని పవన్ ఆదేశించారు. మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో పెద్దిరెడ్డి అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. ఎకరాల కొద్దీ భూములను కబ్జా చేసి..అందులో విలాసవంతమైన భవనంతో పాటు వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడని అంటున్నారు. తన ఫాంహౌస్‌కు వెళ్లేందుకు ప్రభుత్వ సొమ్ముతో రోడ్డును కూడా వేయించుకున్నారని ఆరోపిస్తున్నారు.
అయితే ఏపీలో వైసీపీ ఓడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం మారింది. విలువైన రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు కాలిపోయాయి. 25 అంశాలకు సంబంధించిన ఫైళ్లు దగ్ధమయ్యాయని, వాటిలో అసైన్డ్, 22 ఏ, కోర్టు కేసుల ఫైల్స్, భూముల రీ సర్వే రికార్డులు ఉన్నాయని అప్పట్లో అధికారులు చెప్పారు. దీనిపై చాలా అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
ఫైళ్లను దగ్ధం అందుకేనా?
అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తూ జరిగింది కాదని, పెద్దిరెడ్డి అక్రమాలకు సంబంధించిన ఫైళ్లను దగ్ధం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. భూరికార్డులు మాయం చేసేందుకే అగ్నిప్రమాదం సృష్టించారని అనుమానాలు చేశారు. ఈ విషయంపై అప్పుడే సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. అగ్నిప్రమాదమా..కుట్రపూరితమా అని తేల్చేందుకు డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. అది ప్రమాదవశాత్తూ జరిగింది కాదని విచారణ తర్వాత డీజీపీ స్పష్టం చేశారు. ఫైళ్ల దగ్ధం ఘటనకు సంబంధించి పెద్దిరెడ్డిపైనే అనుమానాలున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా చెప్పారు.
అప్పటి అగ్నిప్రమాదానికి కారణాలేంటో ఇంటర్నల్ ఎంక్వైరీలో తేలిందట. ఆఫీస్‌లోని అధికారులు, సిబ్బందిని విచారించిన తర్వాత..ఫైల్స్ దగ్ధం వెనుక ఏదో కుట్ర ఉందని నిర్ధారణకు వచ్చారట. ఆ తర్వాతే పుంగనూరులో అటవీ భూముల వివరాలను మొత్తం బయటికి తీయాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం.
పూర్తి నివేదిక వస్తే పెద్దిరెడ్డి కార్నర్ అయిపోవడం పక్కా అంటున్నారు టీడీపీ నేతలు. పెద్దిరెడ్డి మాత్రం ఎలాంటి భూకబ్జాలు చేయలేదని..తాను టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకే ఇరికించాలని చూస్తున్నారని చెప్పుకొస్తున్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం అటవీ భూముల వ్యవహారంలో ఇన్ అండ్ ఔట్ మొత్తం బయటికి తీసి..భూఆక్రమణ వెనుకున్న తెర వెనుక భాగోతాన్ని ఎక్స్‌పోజ్ చేయాలని డిసైడ్ అయిందట. ఈ కబ్జాల కహాని ఎటువైపు దారి తీస్తుందో చూడాలి మరి.