Case On Chandrababu : చంద్రబాబుపై కేసు నమోదు చేసి పోలీసులు.. డీఎస్పీ ఫిర్యాదుతో

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. చంద్రబాబు సహా ఏడుగురు టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Case On Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదుతో చంద్రబాబు సహా ఏడుగురు టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ సెక్షన్లు 143, 353, 149, 188 కింద కేసు బుక్ చేశారు. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా రోడ్ షో నిర్వహించడమే కాకుండా డ్యూటీలో ఉన్న పోలీసులను దూషించారని డీఎస్పీ చేసిన ఫిర్యాదుతో చంద్రబాబుపై కేసు నమోదైంది.

చంద్రబాబు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా నిన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. చంద్రబాబు రోడ్ షోకి అనుమతి లేదంటూ పోలీసులు బలభద్రపురం దగ్గర అడ్డుకున్నారు. చంద్రబాబు కాన్వాయ్ కి అడ్డంగా పోలీసులు రోడ్డుపై బైఠాయించారు. దాంతో చంద్రబాబు వాహనం దిగి కాలినడకన 7 కిలోమీటర్లు ప్రయాణించి అనపర్తి చేరుకున్నారు. అక్కడ కూడా పోలీసులు తన మైక్ లాక్కునేందుకు ప్రయత్నించారంటూ చంద్రబాబు మండిపడ్డారు.

Also Read..Chandrababu Naidu : జగన్ ఓటమి ఖాయం, ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

శుక్రవారం అనపర్తిలో చంద్రబాబు రోడ్‌షో, బహిరంగ సభకు పోలీసులు సడెన్ గా అనుమతి రద్దు చేశారు. పోలీసుల తీరుపై చంద్రబాబు, టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ చంద్రబాబు టూర్ సాగింది.

అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించి చంద్రబాబును, టీడీపీ నాయకులను, కార్యకర్తలను అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన బారికేడ్లను టీడీపీ కార్యకర్తలు తోసుకుంటూ ముందుకు వెళ్లారు. చంద్రబాబు కాన్వాయ్ కి అడ్డంగా పోలీస్ వ్యాన్ పెట్టారు. కాన్వాయ్ ముందుకెళ్లే దారి లేకుండా పోయింది.

Also Read..AP Early Elections : 75మంది తిరుగుబాటుకు సిద్ధం, నవంబర్‌లోపే ముందస్తు ఎన్నికలు..! అచ్చెన్న సంచలనం

దీంతో చంద్రబాబు తన కాన్వాయ్ దిగి కాలినడకన వెళ్లారు. పోలీసుల ఆంక్షల మధ్య చంద్రబాబు 7 కిలోమీటర్లు నడిచి వెళ్లారు. చంద్రబాబు పాదయాత్రగా వెళ్తున్న సమయంలో అడుగడుగునా పోలీసులు అడ్డుతగలడంతో పాటు చంద్రబాబు ప్రసంగించిన వాహనాన్ని ముందుకు కదలనీయకపోవడంతో మరో వాహనంపై నుంచి ప్రసంగించారు. పోలీసుల తీరుపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. డీఎస్పీని ఉద్దేశించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో చంద్రబాబుపై డీఎస్పీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

శుక్రవారం అనపర్తిలో పోలీసులతో తోపులాటలో గాయపడిన పార్టీ కార్యకర్తలను చంద్రబాబు పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అక్రమంగా నమోదు చేసిన కేసులపై న్యాయబద్ధంగా పోరాడదామని వారికి పిలుపునిచ్చారు చంద్రబాబు. ప్రజల్లో వ్యతిరేకతను గమనించిన వైసీపీ ప్రభుత్వం.. అరాచకాలకు పాల్పడుతోందని చంద్రబాబు మండిపడ్డారు. అనపర్తిలో పోలీసులను పురిగొల్పి పంపారని ఆరోపించారు. సభ నిర్వహణకు ముందురోజు అనుమతి ఇచ్చారని, కానీ అప్పటికప్పుడు అనుమతి లేదంటూ అరాచకం సృష్టించారని నిప్పులు చెరిగారు.

జగ్గంపేట, పెద్దాపురంలో లేని ఆంక్షలు అనపర్తిలో ఎందుకు వచ్చాయని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రతిపక్షాల సభలను అడ్డుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. చట్టవ్యతిరేకంగా పని చేయాలని పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పారు.