Allu Arjun : అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. కారణం ఏంటంటే
అల్లు అర్జున్ ఇవాళ నంద్యాలలో పర్యటించగా.. చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

Allu Arjun : స్టార్ హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. నంద్యాల పోలీసులు ఆయనపై కేసు బుక్ చేశారు. నంద్యాల టూటౌన్ పోలీసు స్టేషన్ లో అల్లు అర్జున్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా జనసమీకరణ చేశారని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించారని రిటర్నింగ్ ఆఫీసర్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఐపీసీ సెక్షన్ 188 కింద పోలీసులు కేసు నమోదు చేయగా క్రైమ్ నెంబర్ 71/2024గా కేసు రిజిస్టర్ చేశారు. కాగా, తన స్నేహితుడు అయిన శిల్పారవికి మద్దతుగా ప్రచారం చేసేందుకు అల్లు అర్జున్ ఇవాళ నంద్యాలలో పర్యటించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డికి సపోర్ట్ గా ప్రచారం చేయడానికి బన్నీ వెళ్లారు. శిల్పా రవి, అల్లు అర్జున్ మంచి స్నేహితులు. దీంతో శిల్పా రవి కోసం అల్లు అర్జున్, తన భార్యతో కలిసి ఎన్నికల ప్రచారానికి నంద్యాల వెళ్లారు. అల్లు అర్జున్ ను చూసేందుకు ఫ్యాన్స్ పోటెత్తారు. భారీ ర్యాలీతో గజమాల వేసి బన్నీని ఆహ్వానించారు. మొదట శిల్పా రవి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
శిల్పా రవి తనకు మంచి మిత్రుడని, రవి పాలిటిక్స్ లోకి రాకముందు వారానికొకసారి కలిసే వాళ్ళమని బన్నీ తెలిపారు. గత ఐదేళ్లుగా 6 నెలలకొకసారే కలుస్తున్నామని తెలిపారు. నాకు పార్టీలతో సంబంధం లేదన్న బన్నీ.. కేవలం శిల్పా రవితో ఉన్న వ్యక్తిగత స్నేహంతోనే నంద్యాలకు రావడం జరిగిందని వివరించారు. శిల్పా రవి వద్దన్నా నేనే తనను అభినందించడానికి, విషెస్ చెప్పడానికి నంద్యాల వచ్చానని తెలిపారు. అతనితో నాకు, నా కుటుంబానికి ఉన్న అనుబంధమే నన్ను నంద్యాలకు వచ్చేలా చేసిందన్నారు. ప్రజల కోసం కష్టపడుతున్న మనిషికి అండగా నిలవడానికి వచ్చానన్నారు. రవికి గతంలో మాట ఇచ్చాను. అతని మంచితనమే నన్ను ఇక్కడికి వచ్చి ప్రచారం చేసేలా చేసింది. శిల్పా రవి మంచి మెజార్టీతో గెలుపొందాలని కోరుకుంటున్నా అని అల్లు అర్జున్ ఆకాంక్షించారు.