విమానంలో వస్తారు, ఏటీఎంలో చోరీ చేస్తారు, మళ్లీ విమానంలోనే చెక్కేస్తారు.. లగ్జరీ దొంగలు దొరికారు

Visakhapatnam ATM Loot Case: విమానంలో వచ్చారు. హోటల్‌లో దిగి పక్కా ప్లాన్ వేశారు. సినీ ఫక్కీలో చోరీ చేసి చెక్కేశారు. దొంగ సొమ్ముతో జల్సా చేసేందుకు రెడీ అయిపోయారు. సీన్ కట్ చేస్తే.. అన్నీ పోయి చేరాల్సిన చోటుకు చేరారు. మనది కానీ డబ్బుతో సంతోషంగా ఉండలేమన్న లాజిక్‌ను మిస్సయ్యారు.
వాళ్లిద్దరూ జల్సాల కోసం చోరీ బాట పట్టారు. అయితే ఈ ఇద్దరు అందరిలాంటోళ్లు కాదు. చాలా డిఫరెంట్. విమానంలో వస్తారు.. చోరీ చేశాక మళ్లీ విమానంలోనే చెక్కేస్తారు. అంతేకాదు వాళ్లకు సంబంధించిన ప్రతీ వస్తువు బ్రాండెడ్‌దే. ఒక రకంగా చెప్పాలంటే.. సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది అనేలా ఉంటుంది వీళ్ల జల్సా.
విమానంలో విశాఖకు వచ్చిన కేటుగాళ్లు, ఏటీఎంపై కన్ను:
పంజాబ్‌లోని ఫిరోజ్‌సిటీకి చెందిన సమర్ జ్యోతిసింగ్, కేరళలో కేసరగుడ్ జిల్లాకు చెందిన జాఫర్ సాదిక్ పాత నేరస్థులు. బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ తర్వాత చోరీలకు ప్లాన్ చేశారు. ఏటీఎంలో చోరీకి అక్టోబర్ 16న హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖపట్నం వచ్చారు. ముందుగా బుక్ చేసుకున్న హోటల్‌లో దిగారు. ఓ బైక్‌ను అద్దెకు తీసుకొని.. దోపిడీకి అనువుగా ఉండే ఏటీఎం కోసం నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. సుందరనగర్ ఎస్‌బీఐ ఏటీఎంను చోరీ చేయాలని ప్లాన్ చేసుకున్నారు.
గ్యాస్ సిలిండర్ దొంగతనం చేసి, సీసీ కెమెరా కనెక్షన్ కట్ చేసి, ఏటీఎం నుంచి 9లక్షలకు పైగా నగదు చోరీ:
అక్టోబర్ 20వ తేదీన గ్యాస్ సిలిండర్ కోసం అల్లిపురంలోని ఓ గ్యాస్ సిలిండర్ షాపులో సంప్రదించగా వారు నిరాకరించారు. దీంతో అదే రోజు రాత్రి ఆ షాప్‌లోనే గ్యాస్ సిలిండర్లు దొంగిలించారు ఈ మాయగాళ్లు. గ్యాస్ సిలిండర్లతో పాటు గుణపం, గ్యాస్ కట్టర్‌తో పలు వస్తువులను సుందర్‌నగర్ ఏటీఎం ప్రాంతంలో పార్కు దగ్గర ఉంచారు. 21వ తేదీ అర్థరాత్రి సమయంలో సమర్ జ్యోత్ సింగ్ ఏటీఎం లోపలకి వెళ్లి సీసీ కెమెరా కనెక్షన్ కట్ చేశాడు. తరువాత గ్యాస్ కట్టర్‌తో నగదు బాక్స్‌ని కట్ చేసి 9లక్షల రూపాయలకు పైగా నగదును బ్యాగ్‌లో సర్దుకున్నాడు. జాఫర్ సాధిక్ బయటే ఉండి ఎవరైనా వస్తున్నారా? అని పరిశీలించాడు. అనంతరం వారు నగదుతో హోటల్‌కు చేరుకున్నారు. మరుసటి రోజు బైక్‌ను యజమానికి అప్పజెప్పి.. విశాఖ విమానాశ్రయం నుంచి బెంగళూరు పరారయ్యారు.
గ్యాస్ సిలిండర్‌పై వేలిముద్రల సేకరణ, బెంగళూరులో నిందితులు అరెస్ట్:
ఏటీఎం చోరీ విషయం తెలుసుకున్న క్రైం డీసీపీ సురేష్‌బాబు, క్రైం ఏసీపీ పెంటారావు, పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. క్లూస్ టీమ్‌ను రప్పించి, గ్యాస్ సిలిండర్‌పై ఉన్న వేలిముద్రలను గుర్తించారు. అల్లిపురంలోని గ్యాస్ షాపు యజమాని దగ్గర సమాచారం తీసుకున్నారు. అక్కడ నుంచి సీసీ ఫుటేజ్ సేకరించి, దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులు బెంగళూరు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. ఆరు బృందాలుగా ఏర్పడి అక్కడికి వెళ్లారు. బెంగళూరు పోలీసుల సహకారంతో నిందితులు ఒక హోటల్ దగ్గర ఉన్నట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు.
దొంగిలించిన సొమ్ముతో జల్సాలు, అన్నీ బ్రాండెడ్ వస్తువులే:
నిందితుల దగ్గరున్న వస్తువులను చూసి పోలీసులు షాకయ్యారు. దొంగిలించిన సొమ్ముతో కేటుగాళ్లు ఖరీదైన బ్రాండెడ్ వస్తువులను కొనుగోలు చేసి మరీ జల్సా చేస్తున్నట్లు గుర్తించారు. లక్ష రూపాయల విలువ చేసే రెండు మొబైల్ ఫోన్లు, లక్షా 32వేల నగదుతో పాటు సమర జ్యోతిసింగ్ సోదరుడికి ట్రాన్స్‌ఫర్ చేసిన రూ.3 లక్షల విలువైన రశీదులను స్వాధీనం చేసుకున్నారు. సమర్ జ్యోతిసింగ్ గతంలో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, బెంగళూరుల్లోనూ ఏటీఎంలలో చోరీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
విశాఖలో ఈ తరహాలో ఏటీఎం దొంగతనం జరగడం మొదటిసారి జరగడంతో ఈ కేసును పోలీసులు ప్రత్యేకంగా తీసుకున్నారు. చోరీ జరిగిన 35 గంటల్లో నిందితులను పట్టుకున్న సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.