Nara lokesh-Punarvika : మృత్యువుపై విజయం సాధించిన చిన్నారి పునర్విక.. ప్రామిస్ నిలబెట్టుకున్నానంటూ లోకేష్ పోస్ట్
Nara lokesh-Punarvika : అరుదైన వ్యాధి బారిని పడి రూ.16 కోట్ల ఇంజెక్షన్ కోసం ఎదురు చూస్తోన్న పునర్వికకు నేడు విజయవంతంగా ఇంజెక్షన్ చేశారు.
- Dharani Pilli
- Updated on- April 18, 2026 / 03:40 PM IST
Punarvika suffering from SMA Type 1 successfully received rs 16 cr Zolgensma gene therapy injection
- చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్
- మాట నిలబెట్టుకున్నానంటూ
- నారా లోకేష్ పోస్ట్
Nara lokesh-Punarvika : చిన్నారి పునర్విక పేరు నెల రోజుల క్రితం వరకు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కారణం చిన్నారిని కబళించేందుకు దూసుకొచ్చిన అరుదైన అనారోగ్యం. అయితే ఇప్పుడు పునర్విక మృత్యువును జయించింది. ఆ చిట్టితల్లి మరోసారి బోసి నవ్వులు చిందిస్తోంది. అసలేం జరిగిందంటే.. తల్లి గర్భం నుంచి భూమి మీదకు వచ్చిన ఆరు నెలలకే చిన్నారికి ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA Type-1)’ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు తేలింది. దీనికి చికిత్స కోసం రూ.16 కోట్ల విలువైన జోల్ జెన్ స్మా ఇంజెక్షన్ ని అమెరికా నుంచి తీసుకురావాల్సి ఉంది. చిన్నారి పునర్విక తండ్రి కర్నూలు జిల్లా, వెల్దుర్తికి చెందిన జంపాల మంగళ సురేష్ కుమార్ కాగా తల్లి పుష్పవతి. వృత్తిరీత్యా వీరు నాయి బ్రాహ్మణులు. దీంతో కుమార్తె కోసం రూ.16 కోట్ల విలువ చేసే ఇంజెక్షన్ తీసుకురావడం వీరికి తలకు మించిన భారంగా నిలిచింది. తమ బిడ్డకు చికిత్స దాదాపు అసాధ్యమనిపించి.. దేవుడిపై భారం వేశారు.
అయితే చిన్నారి పరిస్థితి తెలుసుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు మానవత్వం చాటుకున్నారు. పసిబిడ్డను రక్షించడం కోసం తరలి వచ్చారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సమస్యపై వెంటనే స్పందించడంతో చిన్నారి విషయంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాయి. తాజాగా శనివారం ఉదయం హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో చిన్నారి పునర్విక చికిత్సలో భాగంగా రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ ని చిట్టితల్లికి వేశారు. చికిత్స సమయంలో మినిస్టర్ నారా లోకేష్ అక్కడే ఉన్నారు. ఇంజెక్షన్ వేయడంతో పాప ఏడుస్తుంటే.. లోకేష్ ఆ పాపను ఎత్తుకుని లాలించడం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలని నారా లోకేష్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రమాణాన్ని నిలబెట్టుకున్నాను. చిన్నారి పునర్వికకు ఇవాళే ఇంజెక్షన్ చేశారు. నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లు తల్లి అని ఆశీర్వదిస్తూ.. ఫోటోలను పోస్ట్ చేశారు.
Promise Kept.
Punarvika’s injection done today.
Live a 100 years Chitti Talli! pic.twitter.com/UnAxkAfChs— Lokesh Nara (@naralokesh) April 18, 2026
సోషల్ మీడియాలో వైరల్.. స్పందించిన లోకేష్
పునర్విక దీనగాథ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో లక్షలాది మంది దాతలు కదిలివచ్చారు. ఫిబ్రవరి నాటికి సుమారు రూ. 10 కోట్లు పోగయ్యాయి. అయితే మిగిలిన రూ. 6 కోట్లు సేకరించడం సవాలుగా మారింది. పాప ఆరోగ్యం క్షీణిస్తుండటంతో తల్లిదండ్రులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను ఆశ్రయించారు. దీనిపై వెంటనే స్పందించిన లోకేష్.. నిధుల సమీకరణలో పాలుపంచుకున్నారు. అమెరికా నుండి మందు రప్పించేందుకు తన వ్యక్తిగత సిబ్బందిని సమన్వయకర్తలుగా నియమించారు. నోవార్టీస్ కంపెనీ, రెయిన్‌బో ఆసుపత్రి మరియు ప్రభుత్వ విభాగాల మధ్య ఉన్న అడ్డంకులను తొలగించి, అనుమతులను వేగవంతం చేశారు.
నేడు చిన్నారి పునర్వికకు విజయవంతంగా ఇంజెక్షన్ వేయడంతో పాప తల్లిదండ్రుల సంతోషం అంతా ఇంతా కాదు. పునర్వికకు మేము జన్మనిస్తే.. లోకేష్ బాబు మా బిడ్డకు పునర్జన్మనిచ్చారు అంటూ ఆ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతుంటే ఆసుపత్రి ప్రాంగణమంతా భావోద్వేగంతో నిండిపోయింది.
