Ap Rain Alert
AP Rain Alert : వాతావరణ శాఖ ఏపీకి వర్ష సూచన ఇచ్చింది. నైరుతి రుతుపవనాల మందగమనంతో గత నెలలో వర్షాలు తగ్గినా.. మళ్లీ జోరందుకోనున్నాయని చెప్పింది. రుతుపవనాల కదలికతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. కాగా, రానున్న 14 రోజులు రాష్ట్రంలో మరింత విస్తారంగా వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు తీరప్రాంతం, రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
వాయవ్య ప్రాంతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. కాగా, శుక్రవారం ఉత్తరాంధ్ర, యానాం, రాయలసీమలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురవొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 10న కోస్తా తీరంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చన్నారు.