Milk Adulteration: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో పెరుగుతున్న మరణాలు.. చికిత్స పొందుతూ ఐదేళ్ల బాలుడు మృతి
ఈ సమస్యకు మూలాలు తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలు సైతం రంగంలోకి దిగాయి. 64 కుటుంబాల నుంచి రక్త నమూనాలు సేకరించారు.
Milk Representative Image (Image Credit To Original Source)
Milk Adulteration: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. వైజాగ్ లో చికిత్స పొందుతూ ఐదేళ్ల బాలుడు ప్రాణాలు విడిచాడు. మృతుడు రాజమండ్రి స్వరూప్ నగర్ కు చెందిన వెంకట్ గా గుర్తించారు. దీంతో కల్లీ పాట కాటుకు ఇప్పటివరకు ఐదుగురు మరణించగా.. మరో ఏడుగురు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కల్తీ పాల ఘటనలో 12మంది ఆసుపత్రి పాలయ్యారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఐదేళ్ల బాలుడు మరణించాడు. కల్తీ పాల ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దర్యాఫ్తును వేగవంతం చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
బాధిత కుటుంబాలకు పాలు పోసిన వ్యక్తిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆయన అనధికారికంగా నిర్వహిస్తున్న పాల కేంద్రంలో ఇధలిన్ గ్లైకాల్ అనే కూలెంట్ రసాయనం పాలలో కలవడం వల్లే ఈ ఘోరం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించింది. బాధితుల వైద్యం ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపింది. 12 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 8మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. 20వ తేదీన ఇద్దరు చనిపోయారు.
ఇప్పటివరకు కల్తీ పాల ఘటనలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఈ సమస్యకు మూలాలు తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలు సైతం రంగంలోకి దిగాయి. 64 కుటుంబాల నుంచి రక్త నమూనాలు సేకరించారు. కిడ్నీ, కాలేయ పరీక్షలకు పంపారు.
ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి పాల నమూనాలు సేకరించిన అధికారులు.. నమూనాలను విశాఖ, విజయవాడ, హైదరాబాద్ లోని ల్యాబ్స్ కు పంపారు. ఫలితాలు వచ్చేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపు చికిత్స పొందుతున్న బాధితులు అందరికీ మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. చికిత్స ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించనుంది. కల్తీ పాల ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఐదుగురు చనిపోవడం అందరిలోనూ ఆందోళన నింపింది.
కల్తీ పాల కేసులో నిందితుడికి రిమాండ్ విధించింది కోర్టు. నిందితుడు గణేష్ కి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గణేష్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు పోలీసులు.
Also Read: ఎంతకు తెగించార్రా.. హైదరాబాద్లో కల్తీ టీ పొడి తయారీ ముఠా అరెస్ట్.. తాగితే చావే..
