ఏపీ చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల రీపోలింగ్

ఏపీలోని చంద్రగిరి నియోజకవర్గంలో మరోసారి పోలింగ్ జరుగనుంది. (మే 19, 2019)వ తేదీన నియోజకవర్గ పరిధిలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. ఈమేరకు బుధవారం (మే15, 2019)న కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ కే రుడోలా నోట్ విడుదల చేశారు.
ఎన్ఆర్ కమ్మపల్లి, పులివర్తిపల్లి, కొత్త కండ్రిగ, కమ్మపల్లి, వెంకట్రామాపురంలో రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 6 గంటల లోపు క్యూలైన్ లో ఉన్నవారందరికీ ఓటు వేసేందకు అవకాశం కల్పించనున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని ఈసీ తెలిపింది.
తన నియోజకవర్గంలోని ఓ వర్గాన్ని ఓట్లు వేయకుండా చేశారని చంద్రగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక తెప్పించుకుంది. దీన్ని పరిశీలించిన ఎన్నికల అధికారులు రీపోలింగ్ ను అనుమతించారు.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదుచోట్ల రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఇదే అంశంపై టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఈసీని కలిసి తన నివేదికను అందజేశారు. 49 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికలు జరిగిన మరుసటి రోజే విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే వైసీపీ అడిగిన చోట రీపోలింగ్ కు ఈసీ ఆదేశించింది. దీనిపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు టీడీపీ నేతలు.