Sankranti Festival Celebrations : ఏపీలో మొదలైన సంక్రాంతి సంబురం..

బస్సుల గురించి సమాచారం తెలుసుకోవడంలో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ అధికారులు బస్టాండ్ లో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Sankranti Festival Celebrations : ఏపీలో సంక్రాంతి సంబురం మొదలైంది. భాగ్యనగర వాసులు పల్లెలకు చేరుకుంటున్నారు. దీంతో టోల్ ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. టోల్ ట్యాక్స్ ఎత్తివేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో ఇప్పటికే సందడి షురూ అయ్యింది.

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. ఎప్పుడు సొంతూళ్లకు వెళ్దామా, బంధు మిత్రులతో సంతోషంగా గడుపుదామా అని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. పండక్కి ఒక రోజు ముందే గ్రామాలకు వెళ్లి కుటుంబసభ్యులు, బంధు మిత్రులతో పండగ జరుపుకోవాలని ఆరాటపడుతున్నారు.

తమ ఊళ్లకు వెళ్లేందుకు ప్రజలు పయనం అయ్యారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఉదయం నుంచి బస్టాండ్ రద్దీగా ఉంది. ప్రయాణికుల కోసం ఏపీ ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసింది. 1370 స్పెషల్ బస్సులను తిప్పుతోంది. విజయవాడ నుంచి రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేకంగా 100 బస్సులు ఏర్పాటు చేశారు ఆర్టీసీ అధికారులు.

బస్సుల గురించి సమాచారం తెలుసుకోవడంలో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ అధికారులు ఎన్నడూ లేని విధంగా బస్టాండ్ లో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేశారు. మీరు ఎక్కడికి వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి? ఏయే బస్సులు అందుబాటులో ఉన్నాయి? తదితర వివరాలను ప్రయాణికులకు తెలియజేస్తున్నారు సిబ్బంది.

అటు, పోలీసులు సైతం భద్రత కల్పించారు. బస్ స్టేషన్ లో పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి నాలుగు ప్లాట్ ఫామ్ లకు ఒక పోలీస్ ను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారులు ప్రణాళికబద్ధంగా బస్సులు నడుపుతున్నారు. రద్దీకి అనుగుణంగా బస్సులను అందుబాటులో ఉంచారు. అవసరమైతే అదనపు సర్వీసులు అందుబాటులో ఉంచుతామన్నారు.

 

Also Read : ఆ రూట్లలో స్కూళ్లు, కాలేజీల బస్సులు నడపండి.. రవాణశాఖకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..