10 Rupees Coins : ఇప్పటికైనా నమ్ముతారా రూ.10 కాయిన్స్ చెల్లుతాయని.. రూ.లక్షా 65వేల ఖరీదైన బైక్ కొన్న యువకుడు

పది రూపాయల నాణేలు సేకరించి ఏకంగా బైక్ కొని ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడంతో పాటు తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. లక్ష 65వేల రూపాయలకు సరిపడ 10 రూపాయల కాయిన్స్ ఇచ్చి సిబ్బందిని ఆశ్చర్యపరిచాడు.(10 Rupees Coins)

10 Rupees Coins : పది రూపాయల కాయిన్స్ చెల్లుబాటుపై ప్రజల్లో అనేక సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. 10 రూపాయల నాణేలు చెల్లవని కొందరు, చెల్లుతాయని మరికొందరు.. ఇలా ఎవరికి తోచినట్టుగా వారు అనుకుంటున్నారు. కొన్ని చోట్ల కొంతమంది దుకాణదారులు రూ.10 నాణేలు తీసుకోవడం లేదు. అదేమిటంటే.. అవి చెల్లవు అంటున్నారు. ఎవరైనా కస్టమర్ రూ.10 నాణెం ఇస్తే తీసుకోవడం లేదు. వెనక్కి ఇచ్చేస్తున్నారు.

అదేమిటి అని అడిగితే.. మీరిస్తే మేము తీసుకుంటాము, కానీ మేమిస్తుంటే ఎవరూ తీసుకోవడం లేదని చెబుతున్నారు. దీంతో 10 రూపాయల కాయిన్స్ చెల్లుబాటుపై సందేహాలు ఏర్పడ్డాయి. అయితే, దీనిపై స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులే క్లారిటీ ఇచ్చారు. రూ.10 కాయిన్స్ చెల్లుతాయని స్పష్టం చేశారు. అవి చెల్లవని తీసుకోకపోవడం నేరం అని కూడా చెప్పారు. అయినా ఇంకా వాటి చెల్లుబాటుపై అస్పష్టత ఉంది.

ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన బొబ్బిలి రాఘవేంద్ర వెరైటీగా ఆలోచన చేశాడు. రూ.10 కాయిన్స్ చెల్లుబాటుపై సందేహాలకు తెర దించాడు. 10 రూపాయల నాణేలు చెల్లుతాయని నిరూపించాడు.(10 Rupees Coins)

Also Read..Savings in coins: రూ.50,000 కాయిన్స్ తీసుకువచ్చి బైక్ కొనుక్కున్న వ్యక్తి

రాఘవేంద్ర తన కల నేరవేర్చుకున్నాడు. తన పుట్టిన రోజుకు తానే అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. పది రూపాయల కాయిన్స్ చెల్లుబాటు కావడం లేదన్న అపోహలు తొలగించేందుకు అతడు నడుం బిగించాడు. పది రూపాయల నాణేలు సేకరించి ఏకంగా బైక్ కొని ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడంతో పాటు తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు రాఘవేంద్ర. స్థానిక హీరో షో రూమ్ కి వెళ్లిన రాఘవేంద్ర లక్ష 65వేల రూపాయలకు సరిపడ 10 రూపాయల కాయిన్స్ ఇచ్చి బైక్ కొని సిబ్బందిని ఆశ్చర్యపరిచాడు.

కాగా.. ప్రభుత్వం, బ్యాంకులు మాత్రం రూ.10 నాణెం చెల్లుంతుందని చెబుతున్నాయి. పది రూపాయల నాణెం చెల్లుబాటుపై ఆర్బీఐ కూడా ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ముద్రించి.. ఆర్బీఐ ద్వారా పంపిణీ అయిన వివిధ రకాల పది రూపాయల నాణేలు చట్ట బద్ధమైనవని ఆ మధ్యన కేంద్ర ప్రభుత్వం కూడా తేల్చి చెప్పింది.

10 రూపాయల నాణేలను వివిధ సైజుల్లో, డిజైన్స్‌లలో ప్రభుత్వం ముద్రిస్తోంది. డబ్బు పరంగా జరిగే అన్ని లావాదేవీల్లో వీటిని ఉపయోగించవచ్చని వివరణ ఇచ్చింది. పది రూపాయల నాణేలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆర్బీఐ ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూనే ఉందని కేంద్రం వివరించింది. నిజానికి RBI రిలీజ్ చేసిన నోటు కానీ కాయిన్స్ అన్నీ చట్టపరంగా చెల్లుతాయి. అంతేకాదు.. బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల్లో కూడా ఈ కాయిన్స్‌తో లావాదేవీలు చేయొచ్చంది కేంద్రం.

Also Read.. Tamil Nadu : పది రూపాయల కాయిన్స్ తో రూ.6 లక్షల కారు కొన్న తమిళ తంబి

ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం అన్ని పోస్టాఫీసులు కాయిన్స్ స్వీకరిస్తాయి. పోస్ట్ ఆఫీసులో స్టాంప్స్, ఎన్వలప్స్ కొనడానికి కాయిన్స్ ఉపయోగించవచ్చు. ఇండియా పోస్ట్ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చింది. అన్ని రకాల కాయిన్స్, నోట్స్… పోస్ట్ ఆఫీసులో తీసుకుంటామంది.

పాత నోట్లు, నాణేలు చెల్లవంటూ చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై అనేకసార్లు ఆర్‌బీఐ స్పష్టత ఇచ్చింది. ఇలాంటి ప్రచారాన్ని నమ్మకూడదని, అన్ని లావాదేవీలకు అన్ని రకాల కాయిన్స్ చట్టబద్ధంగా చెల్లుతాయని తెలిపింది. భారత ప్రభుత్వం ముద్రించిన కాయిన్స్‌ను ఆర్‌బీఐ సర్క్యులేషన్‌లోకి తీసుకొచ్చిందని, ఈ కాయిన్స్‌లో ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయని, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వేర్వేరు థీమ్స్‌తో కాయిన్స్ రూపొందించా
మని ఆర్‌బీఐ తెలిపింది.

ప్రస్తుతం వేర్వేరు సైజుల్లో ఒక్క రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, పది రూపాయల నాణేలు చెల్లుతాయని ఆర్బీఐ పలు సందర్భాల్లో తెలిపింది. అయితే రూ.10 కాయిన్స్ విషయంలో మాత్రం ప్రజల్లో ఇంకా అయోమయం నెలకొని ఉంది. నకిలీ నాణేలు అన్న భయంతో వ్యాపారులు రూ.10 కాయిన్స్ తీసుకోవడం లేదు. ఈ విషయం చివరకు పార్లమెంట్ వరకు వెళ్లింది. రూ.10 కాయిన్స్ వేర్వేరు సైజులు, డిజైన్లు, థీమ్స్‌తో ముద్రించామని, అవన్నీ చెల్లుతాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వివరణ కూడా ఇచ్చింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అటు కేంద్రం ఇటు ఆర్బీఐ పూర్తి క్లారిటీ ఇచ్చినా, పదే పదే ఇస్తున్నా.. ఎందుకో కానీ, పది రూపాయల నాణేల చెల్లుబాటుపై ఇంకా ప్రజల్లో అనేక అనుమానాలు, సందేహాలు, భయాలు అలానే ఉండిపోయాయి.