Chandrababu Naidu
Chandrababu Naidu : ఏపీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాజకీయ వ్యవస్థనే అపవిత్రం చేసిన వ్యక్తి జగన్ అని విరుచుకుపడ్డారు చంద్రబాబు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదనటానికి ఎన్నో ఘటనలు ఉదాహరణలుగా ఉన్నాయన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల కోసం కష్టపడకుండా ఐదేళ్ళు ఎంజాయ్ చేశారని ధ్వజమెత్తారు చంద్రబాబు. విద్యార్థులను తీర్చిదిద్దటం మాని, పాఠశాలలకు రంగులు కొట్టడమే అభివృద్ధి అంటున్నారు అని జగన్ సర్కార్ పై మండిపడ్డారు చంద్రబాబు. నిజమైన విద్యాభివృద్ధి ఏంటో తెలుగుదేశం ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. జగన్ తో లాభం లేదని ప్రజా సర్వే చెబుతుంటే, ఇక ఎమ్మెల్యేలను బదిలీ చేసి ఏం లాభం? అని చంద్రబాబు ప్రశ్నించారు.
Also Read : షర్మిల నిర్ణయంతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
ఐదేళ్లుగా జగన్ కి అందింది తాను దోచుకుంటే, ఎమ్మెల్యేలకు అందింది వాళ్లు దోచుకున్నారు అని చంద్రబాబు ఆరోపించారు. ప్రజా మద్దతు కోల్పోయిన ఎమ్మెల్యేలకు ఇప్పుడు బదిలీ అంటున్నారు అని విమర్శించారు. అసాధ్యమని తెలిసి కూడా ప్రజా రాజధాని అమరావతిని విశాఖకు మార్చాలని జగన్ చూశారని చంద్రబాబు మండిపడ్డారు. అమరావతిపై నిర్ణయం తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్నట్లుగా నేడు సుప్రీంకోర్టు నిర్ణయం ఉందన్నారు చంద్రబాబు.
టీడీపీలో చేరికల జోష్ నెలకొంది. అనంతపురం, చీరాల, బాపట్ల, పార్వతీపురం నియోజకవర్గాల నుంచి వైసీపీకి చెందిన వారు భారీగా తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి బావమరిది ద్వారాకానాథ్ రెడ్డి, సీనియర్ నేత దాడి వీరభద్రరావు, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, బాపట్ల జెడ్పీటీసీ వేణుగోపాల్ రెడ్డి తదితరులు చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు.
”రాష్ట్రంలో రాజకీయ నాయకులు, ప్రజలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఏ మాత్రం ఈ రాష్ట్రం మీద అభిమానం ఉన్నా, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుపై ఏ మాత్రం ఆశ ఉన్నా మీరంతా ఇలాంటి దుర్మార్గమైన పార్టీకి సహకరించడం కరెక్ట్ కాదని మరోసారి పిలుపునిస్తున్నా. అలాంటి వ్యక్తులు ఇవాళ టీడీపీలోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నా. వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. బాధ్యత కలిగిన రాజకీయ నాయకులు అందరూ కూడా ఆలోచన చేయాలి. సీట్ల కోసం రావడం కాదు. రామచంద్రయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలి.
2027 వరకు ఎమ్మెల్సీ పదవి ఉన్నా. ఆ పదవి పోయినా పర్వాలేదని, నాకు పదవి ముఖ్యం కాదని, రాష్ట్రం నష్టపోయే పరిస్థితుల్లో నా బాధ్యత నెరవేర్చాలని రామచంద్రయ్య వచ్చారు. ఆయనను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది అందరి బాధ్యత కావాలి. ప్రజల బాధ్యత కావాలి. చంద్రబాబు ఒక్కడిదే బాధ్యత, ఆయనే పోరాటం చేస్తాడు. మనం చూద్దాం అంటే కరెక్ట్ కాదు. అలా అనుకుంటే రాష్ట్రంలో ఇంకేమీ మిగలదు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలి రా అనే స్లోగన్ తో రాబోచే రోజుల్లో ఏం చేయబోతున్నా అనేది చెప్పడానికి మీ దగ్గరికి వస్తున్నా.
Also Read : పవన్ ఫ్యాక్టర్ ను తగ్గించేందుకు వైసీపీ భారీ వ్యూహం.. ఆ ఇద్దరు నేతలపై ఫోకస్
25 పార్లమెంటు నియోజకవర్గాల్లో 25 మీటింగ్ లు పెట్టి ప్రజా చైతన్యం తీసుకొస్తా. ప్రజలను సమైక్యం చేస్తా. అందరినీ ముందుకు నడిపిస్తా. వ్యక్తులు శాశ్వతం కాదు సమాజం శాశ్వతం. రాష్ట్రం శాశ్వతం. అలాంటి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ఇలాంటి వ్యక్తుల పట్ల మనం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మనందరపైన ఉంది. అందరం కలిసి ఆలోచన చేద్దాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం” అని పిలుపునిచ్చారు చంద్రబాబు.