సంపద సృష్టిస్తా, పేదరికం నిర్మూలిస్తా.. అదే నా లక్ష్యం- నిమ్మకూరులో చంద్రబాబు
నిమ్మకూరులో ప్రయోగాత్మకంగా ప్రారంభించే పేదరిక నిర్మూలన కార్యక్రమం అందరికీ మార్గదర్శకం కానుంది. సమాజం వల్ల బాగుపడిన వాళ్లు తమ ఊరిలో ఒక కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకునేలా కార్యక్రమాలు చేపడతాం.

Chandrababu Naidu On Poverty Elimination In Nimmakuru
Chandrababu Naidu : ఎన్టీ రామారావుపై ప్రశంసల వర్షం కురిపించారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కృషి, పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు. రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని కీర్తించారు.
నిమ్మకూరులో ఎన్టీఆర్, బసవతారకం దంపతుల విగ్రహాలకు నివాళి అర్పించారు చంద్రబాబు. నందమూరి వంశీకులు, బంధువుల ఇళ్లకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. చంద్రబాబు తమ ఇళ్ళకు రావడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. పేదరిక నిర్మూలనకు తెలుగుదేశం మినీ మేనిఫెస్టోలో పెట్టిన పూర్ టు రిచ్ లక్ష్యాలను ఆవిష్కరించారు.
”సంపద సృష్టించి, అది పేదలు అనుభవించేలా చేయటమే పేదరిక నిర్మూలన ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. మన ఊరి పిల్లలు ప్రపంచానికి పని చేసి డబ్బులు సంపాదించే విధానం ఈ ప్రాజెక్ట్ లో ఓ భాగం. పేదరిక నిర్మూలనే అసలు సిసలైన రాజకీయంగా ఎన్టీఆర్ ప్రజాసేవ చేశారు. ఎన్టీఆర్ స్ఫూతోనే పేదరిక నిర్మూలన ప్రాజెక్టును ఆయన స్వగ్రామం నిమ్మకూరులో ప్రారంభిస్తున్నాం.
Also Read : మాగుంట విషయంపై బాలినేనికి తేల్చి చెప్పిన సీఎం జగన్.. వైసీపీలో ఇంకా తేలని ఒంగోలు సీటు పంచాయితీ
పూర్ టు రిచ్.. అదే నా లక్ష్యం- చంద్రబాబు
మన గ్రామాలను ప్రపంచానికి అనుసంధానం చేసే వినూత్న కార్యక్రమమే ఈ పూర్ టు రిచ్. నిమ్మకూరులో ప్రయోగాత్మకంగా ప్రారంభించే పేదరిక నిర్మూలన కార్యక్రమం అందరికీ మార్గదర్శకం కానుంది. సమాజం వల్ల బాగుపడిన వాళ్లు తమ ఊరిలో ఒక కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకునేలా కార్యక్రమాలు చేపడతాం. ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేట్ భాగస్వామ్యంతో మన ఊరిలో పుట్టిన వారు మనతో సమానంగా పైకి తీసుకొచ్చే విధంగా ఈ ప్రాజెక్టు పనిచేస్తుంది. ఇది ప్రారంభం మాత్రమే. ఆచరణలో విజయవంతం కావటానికి కాస్త సమయం పడుతుంది” అని చంద్రబాబు అన్నారు.
అధికారం అంటే ఎంజాయ్ చేయటం కాదు..
”కృషి, పట్టుదలతో ఎదిగిన మహనీయుడు ఎన్టీఆర్. మళ్లీ ఎన్టీ రామారావు పుడితే తప్ప ఆయన పాత్రలు ఎవరూ పోషించలేరు. పోషించబోరు. ఎన్టీఆర్ రాజకీయాల్లో 13 ఏళ్లే ఉన్నారు. కానీ ఎంతో సేవ చేశారు. రాజకీయాలకు నూతన నిర్వచనం ఇచ్చారు. రాజకీయాలకు దశ దిశ నిర్దేశించారు. ప్రభుత్వం అంటే పెత్తనం చేయటం, అధికారం అంటే ఎంజాయ్ చేయటం, కాలం గడపడం అనే పరిస్థితి ఉండేది. ఎన్టీఆర్ అలాంటి వ్యక్తి కాదు. పేదలను ఆదుకోవడమే రాజకీయం, పేదలకు అండగా ఉండటమే నిజమైన సేవ అని భావించిన ఏకైక వ్యక్తి నందమూరి తారకరామారావు. ఆయనకు ఒక కల ఉండేది. పేదరికం లేని సమాజం చూడాలన్నదే ఆయన కల. స్వాతంత్ర్య వచ్చి 75ఏళ్లు అయిపోయింది. ఇంకా పేదరికం సమస్య ఉంది. రాముడు ఎలా ఉంటాడో తెలియదు కానీ, ఎన్టీఆర్ రూపంలో రాముడిని చూశాం. రాముడు అంటే ఎన్టీఆర్ రూపంలో ఉండే రాముడే గుర్తుకు వస్తారు” అని చంద్రబాబు చెప్పారు.
నాడు ప్రధానిగా ఉన్న వాజ్ పేయితో చెప్పా..
” నాడు మలేషియా ఓ చిన్న దేశం. 2కోట్ల జనాభా. కానీ, అక్కడ అద్భుతమైన రోడ్లు ఉన్నాయి. మన దేశంలో మాత్రం రోడ్లు సరిగా ఉండేవి కావు. నాడు ప్రధాని గా ఉన్న వాజ్ పేయికి ఈ విషయం చెప్పాను. డబ్బులు ఎక్కడున్నాయని అన్నారు. ఆలోచన ఉంటే డబ్బులు వస్తాయి, రోడ్లు అవుతాయని చెప్పాను. మనం వేద్దాం అని చెప్పాను. అంతే.. రోడ్లు వచ్చాయి. ఫస్ట్ బిట్ వేసింది నెల్లూరు నుంచి చెన్నై వరకు రోడ్డు వేశాం. ఇప్పుడు ప్రతి ఊరికి నేషనల్ హైవేస్ వచ్చాయి. 10 లేన్, ఎక్స్ ప్రెస్ వేస్ వచ్చాయి.
Also Read : టీడీపీ రేసుగుర్రాలు రెడీ..! 72మందితో లిస్ట్..!
హైదరాబాద్‌కు బ్రహ్మాండంగా సంపద వస్తోందంటే కారణమదే..
డబ్బు సంపాదించడం పెద్ద కష్టం కాదు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కట్టాం. ఒక పాలసీ ఇచ్చాం. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్ షిప్. వాళ్లు డబ్బులు తెచ్చారు. ఎయిర్ పోర్టు కట్టారు. ఇప్పుడు హైదరాబాద్ కు బ్రహ్మాండంగా సంపద వస్తోంది అంటే ఆ ఎయిర్ పోర్టే కారణం. ప్రతి ఒక కుటుంబానికి ఒక విజన్ తయారు చేసుకోవాలి. వాళ్లు ఆస్తులు ఏమున్నాయి. మనుషులు ఎంతమంది? ఏ వయసులో ఉన్నారు? వాళ్లు ఏం పని చేస్తున్నారు? ఆదాయం ఎంత? మరో పని చేస్తే ఆదాయం ఎంత పెరుగుతుంది? దానికి అవసరమైన స్కిల్స్ ఏం కావాలి? అవి మీరు నేర్పిస్తే ఆటోమేటిక్ గా ఆదాయం పెరుగుతుంది” అని చంద్రబాబు అన్నారు.