Buddha Venkanna Slams Kesineni Nani
Buddha Venkanna : విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న నిప్పులు చెరిగారు. ఇవాళ్టి నుంచి ఆట మొదలైంది, నీకు సినిమా చూపిస్తా అంటూ కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బుద్ధా వెంకన్న. సీఎం జగన్ ను కలిశాక చంద్రబాబును ఉద్దేశించి మోసగాడు అంటూ కేశినేని చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు బుద్ధా వెంకన్న. క్యారెక్టర్ లెస్ కేశినేని నాని ఏదేదో మాట్లాడాడు అని మండిపడ్డారు. చంద్రబాబు రెండుసార్లు కేశినేని నానిని ఎంపీ చేశారని గుర్తు చేశారు.
”కేశినేని నానిపై ప్రెస్ మీట్ పెట్టమని చంద్రబాబు చెప్పలేదంటూ తన మనవళ్లపై ప్రమాణం చేశారు బుద్దా వెంకన్న. కేశినేని నానిని తిట్టమని నన్ను చంద్రబాబు ఆదేశించ లేదు. నిజానికి నేను నానిపై విమర్శలు చేస్తే చంద్రబాబు మందలించారు. చంద్రబాబు చెప్పారు కాబట్టే నేను ఇన్నాళ్లూ ఆగాను.
విజయసాయి రెడ్డితో కేశినేని నానికి ఎప్పటి నుంచో పరిచయం ఉంది. కేశినేని నాని వైసీపీ కోవర్టు. కేశినేని నానికి ఇకపై సినిమా ఉంది. తమ్ముడు కేశినేని చిన్ని భార్య జానకి మీద కేసు పెట్టిన శాడిస్ట్ కేశినేని నాని. వచ్చే ఎన్నికల్లో కేశినేని నాని గెలుస్తాడా..? కేశినేని నాని గెలిస్తే.. నా బుద్దా భవన్ ఇచ్చేస్తా. ఓడితే కేశినేని భవన్ నాకిచ్చేస్తారా..?
Also Read : గెలుస్తున్నాం.. గెలిచేస్తున్నాం.. ఇప్పుడిదే విజయ రహస్యం, ఎన్నికల ఫలితాలను శాసిస్తున్న ఫీల్ ఫ్యాక్టర్
కేశినేని నాని.. వల్లభనేని వంశీ, కొడాలి నాని మీద ఒక్క మాటైనా మాట్లాడవా..? బీసీల గురించి ఏదో అంటున్నావ్. బీసీలు సంపాదిస్తే అక్రమార్జనా..? నువ్వు సంపాదిస్తే సక్రమార్జనా..? 91లో దుర్గ గుడి మీద షాపుల కోసం లక్ష 15వేలు నెలకు రెంట్ కట్టాను. ఆ రోజు లక్ష 15వేలు అంటే కోట్ల రూపాయలతో సమానం. మీలాగా అప్పులు ఎగ్గొట్టలేదు. ఏదైనా సెంటర్ చూసుకుని కొట్టుకుందామా..? చంద్రబాబుకు చెప్పకుండానే శ్వేతను కేశినేని నాని మేయర్ పదవికి నిలబెట్టారు. చంద్రబాబు ఆనాడే సస్పెండ్ చేసి ఉండాల్సింది. కేశినేని నానికి వచ్చిన ప్రొటోకాల్ ఇచ్చిందే చంద్రబాబు.
చంద్రబాబు మోసగాడా? నీలాంటోడికి టికెట్ ఇచ్చినందుకు మోసగాడే చంద్రబాబు. కొడాలి నాని రెండుసార్లు టికెట్ ఇచ్చాడు. అతడు కూడా ఇదే మాట అంటాడు. వంశీకి మూడుసార్లు టికెట్ ఇచ్చాడు. అతడూ ఇదే మాట అంటాడు. నీకు రెండుసార్లు టికెట్ ఇచ్చాడు. నువ్వు కూడా అదే మాట అంటున్నావు. మీ అందరికీ సిగ్గు అన్నది ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో 60శాతం ఖాళీ చేస్తావా? నీ కేశినేని భవన్ లో పని చేస్తున్న వారి లిస్టు వదులు. కార్యకర్తలను కూడా ఏమీ చేయలేవు. ఇది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం జెండా భుజాన ఉన్నంతవరకే మనకు విలువ. ఆ కండువా తీసేస్తే ఎవరికీ విలువ ఉండదు. ఎన్టీ రామారావు పార్టీ పెడితే చంద్రబాబు బతికించారు. చంద్రబాబు దయతో ఇవాళ మనమంతా నడుస్తున్నాం.
Also Read : విజయవాడలో అన్నదమ్ముల పోటీ.. తమ్ముడిపై కేశినేని నాని పోటీ చేస్తారా?
చంద్రబాబు బీ-ఫామ్ ఇస్తేనే కదా నానికి ప్రొటోకాల్ వచ్చింది. పార్టీ శత్రువుల మీద కేశినేని నాని ఎప్పుడూ మాట్లాడరు. వారం రోజుల క్రితం జగన్ మటాష్ అన్నారు. ఇప్పుడు అదే జగన్ దేవుడయ్యారా..? నాని పేర్లతోనే మాకు ఇబ్బంది వచ్చింది. కొడాలి నాని, కేశినేని నానిలతోనే మాకు ఇన్నాళ్లూ ఇబ్బంది. ఇవాళ్టితో మాకు ఆ ఇబ్బంది పోయింది. ఇవాళ్టి నుంచి ఆట మొదలైంది. కేశినేని నానికి ద ఎండ్ కార్డు పడడం ఖాయం. పీఆర్పీలో చేరి చిరంజీవిని విమర్శించారు. ఇప్పుడు చంద్రబాబును విమర్శిస్తున్నారు. కేశినేని నాని చిట్టా నా దగ్గర ఉంది” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు బుద్ధా వెంకన్న.