విజయవాడలో అన్నదమ్ముల పోటీ.. తమ్ముడిపై కేశినేని నాని పోటీ చేస్తారా?

కేశినేని నానికి వైసీపీ ఎంపీ టిక్కెట్ ఇస్తే విజయవాడలో అన్నదమ్ముల మధ్య పోటీ ఉంటుందని.. ప్రత్యర్థిగా తమ్ముడి కేశినేని చిన్నితో ముఖాముఖి తలపడతారని..

విజయవాడలో అన్నదమ్ముల పోటీ.. తమ్ముడిపై కేశినేని నాని పోటీ చేస్తారా?

Kesineni Nani may contest on Kesineni Chinni as YSRCP Candidate

Updated On : January 10, 2024 / 1:00 PM IST

Kesineni Nani vs Kesineni Chini: విజయవాడ లోక్‌స‌భ‌ ఎన్నికల్లో ఈసారి అన్నదమ్ముల పోరు తప్పదా? అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి అన్నదమ్ములు బరిలోకి దిగే అవకాశముందా? తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే అన్నదమ్ముల మధ్య పోటీ ఉండేట్టు కనబడుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈరోజు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలో కలవనున్నారు. తెలుగు దేశం పార్టీ నుంచి బయటకు వస్తానని ప్రకటించిన ఎంపీ కేశినేని, సీఎం జగన్ తో భేటీ కానుండడం రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది. విజయవాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా కేశినేని నాని బరిలోకి దిగుతారని ప్రచారం మొదలయింది.

ఈసారి తనకు విజయవాడ ఎంపీ టిక్కెట్ ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా లేరని కేశినేని నాని స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఎంపీ పదవికి రాజీనామా చేసి టీడీపీకి గుడ్ బై చెప్పనున్నట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఆయన కుమార్తె కేశినేని శ్వేత కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. టీడీపీ నుంచి కూడా వైదొలగనున్నట్టు ఆమె తెలిపారు. కాగా, ఆదివారం తిరువూరులో జరిగిన చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు కేశినేని నాని గైర్హాజరయ్యారు. అయితే ఈ సభకు తనను దూరంగా ఉండమన్నారని అంతకుముందు ఆయన ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. స్థానిక ఎంపీగా పోటోకాల్ ప్రకారం ఆయనను ఆహ్వానించినట్టు టీడీపీ నేత కేశినేని చిన్ని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ తో ఎంపీ కేశినేని భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అన్నదమ్ములు బరిలోకి దిగితే..?
కేశినేని నానికి వైసీపీ ఎంపీ టిక్కెట్ ఇస్తే విజయవాడలో అన్నదమ్ముల మధ్య పోటీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. టీడీపీ తరపున నాని సోదరుడు చిన్నికి టిక్కెట్ ఖరారయిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే చిన్ని కూడా టీడీపీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తనను తప్పించి తన సోదరుడికి టిక్కెట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారన్న విషయాన్ని గ్రహించే కేశినేని నాని టీడీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారన్నది బహిరంగ రహస్యం. ఫలితంగా చంద్రబాబుపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి జగన్ తో భేటీకి సిద్దమయ్యారు కేశినేని నాని. ఒకవేళ విజయవాడ లోక్‌స‌భ‌ ఎన్నికల్లో అన్నదమ్ములు బరిలోకి దిగితే హోరాహోరీ తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: గెలుస్తున్నాం.. గెలిచేస్తున్నాం.. ఇప్పుడిదే విజయ రహస్యం, ఎన్నికల ఫలితాలను శాసిస్తున్న ఫీల్ ఫ్యాక్టర్