Dhulipalla Narendra Support Ktr
Dhulipalla Narendra Support KTR : ఏపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. వైసీపీ మంత్రులు, నేతలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కేటీఆర్ అలా మాట్లాడారని మండిపడుతున్నారు. ఏపీలో మౌలిక వసతుల గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పపడుతున్నారు. మరోవైపు ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రియాక్షన్ మరోలా ఉంది.
ఏపీపై కేటీఆర్ వ్యాఖ్యలను టీడీపీ నేతలు సమర్థిస్తున్నారు. కేటీఆర్ కామెంట్స్ కు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర మద్దతు పలికారు. కేటీఆర్ వ్యాఖ్యలను చూస్తే ఏపీ పరిస్థితి ఏంటో అర్థమవుతుందన్నారు. ఏపీలో విద్యుత్ కోతల కారణంగా విద్యార్థులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పలు ప్రధాన పట్టణాల్లో ఐదు రోజులకు ఒకసారి తాగునీరు ఇచ్చే పరిస్థితి ఏపీలో ఉందని ఆయన వాపోయారు. ఇక రోడ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అంటూ కేటీఆర్ వ్యాఖ్యలకు మద్దతు తెలిపారాయన.(Dhulipalla Narendra Support KTR)
KTR Vs AppalaRaju: ఏపీలో రోడ్లపై కేటీఆర్ సెటైర్: కౌంటర్ ఇచ్చిన మంత్రి సీదిరి అప్పలరాజు
”మేం అద్భుతాలు చేస్తున్నాం అన్నారు. చాలా పనులు చేశాము అన్నారు. మా ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు ఇచ్చిందని చెప్పుకున్నారు. ఇవాళ కేటీఆర్ వ్యాఖ్యలను చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితి ఏంటి అనేది స్పష్టమవుతోంది. పరీక్షలు రాసే పిల్లలు విద్యుత్ కోతల మూలాన చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మళ్లీ కరెంటు కోతలను ప్రజలు అనుభవిస్తున్నారు. తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానమైన పట్టణాల్లో నాలుగైదు రోజులకు నీరు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇక రోడ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. గ్రామీణ, ప్రధానమైన నగరాల్లో రోడ్లు ఏ విధంగా విధ్వంసం అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ ప్రభుత్వం వాటిని కనీసం బాగు చేసే పరిస్థితి లేకపోవడం బాధాకరం. కేటీఆర్ వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిగ్గుపడే పరిస్థితిని జగన్ తీసుకొచ్చారు” అని ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు.
కేటీఆర్ ఏమన్నారంటే..
ఏపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించిన క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో కరెంట్ సరిగ్గా లేదని, నీళ్లు కూడా లేవని, అభివృద్ధి జరగడం లేదని, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని తన మిత్రులు చెప్పారంటూ వ్యాఖ్యానించారు.
Peddireddy Counter To KTR : ఓట్ల కోసమే ఏపీపై విమర్శలు – కేటీఆర్‌కు మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్
”ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ లేదు. నీళ్లు లేవు. రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయి. ఏపీలోని సొంతూళ్లకు వెళ్లొచ్చిన నా మిత్రులు ఈ విషయాన్ని నాతో చెప్పారు. ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్టు ఉందంటున్నారు. బెంగళూరులోని కంపెనీలు కూడా ఏపీలోని అధ్వాన్నపు రోడ్ల గురించి మాట్లాడుతున్నాయి. అదే తెలంగాణ విషయానికి వస్తే.. చాలా ప్రశాంతమైన రాష్ట్రం. దేశంలోనే హైదరాబాద్ బెస్ట్ సిటీ. తెలంగాణలో అభివృద్ధి ఎలా ఉందో ఏపీ ప్రజలకు అర్థమైంది. నగరాల్లో మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయకపోతే వెనుకపడిపోతాం. ఏపీతో పోలిస్తే తెలంగాణలో మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నాయి” అని కేటీఆర్ అన్నారు. ఏపీని ఉద్దేశించి కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపాయి.