Peddireddy Counter To KTR : ఓట్ల కోస‌మే ఏపీపై విమర్శలు – కేటీఆర్‌కు మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్

రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే కేటీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశారని అన్నారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో రోడ్లు బాగుపడ్డాయన్నారు.

Peddireddy Counter To KTR : ఓట్ల కోస‌మే ఏపీపై విమర్శలు – కేటీఆర్‌కు మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్

Peddireddy Counter To Ktr

Peddireddy Counter To KTR : ఏపీలో మౌలిక వ‌స‌తులు అధ్వాన్నంగా ఉన్నాయంటూ తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. కేటీఆర్ కామెంట్స్ తెలుగు రాష్ట్రాల రాజకీయాలను వేడెక్కించాయి. కేటీఆర్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు ఘాటుగా బదులిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు కేటీఆర్ కు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా సీనియర్ నేత, ఏపీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేటీఆర్ కామెంట్స్ పై స్పందించారు.

తెలంగాణలో సింగ‌రేణి బొగ్గు గ‌నులు ఉన్నాయని, అందుకే తెలంగాణ‌లో క‌రెంట్ కోత‌లు లేవని మంత్రి అన్నారు. ఏపీలో కూడా విద్యుత్ కోత‌లు లేవని చెప్పారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే కేటీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశారని అన్నారు. బొగ్గును ఎక్కువ‌ ధ‌ర‌కు కొన‌డానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. పంచాయ‌తీరాజ్‌లోనే 10 వేల కిలోమీట‌ర్ల‌కు పైగా రోడ్లు నిర్మించామని తెలిపారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో రోడ్లు బాగుపడ్డాయన్నారు. తెలంగాణ‌లో త్వ‌ర‌లో ఎన్నిక‌లు రానున్నాయని, ఏపీలో పరిస్థితి బాగోలేదు.. తెలంగాణలో అంతా బాగుందంటే ఓట్లు పడొచ్చని కేటీఆర్ భావించారేమోనని, అందుకే ఇలాంటి విమర్శలు చేసి ఉండొచ్చని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.(Peddireddy Counter To KTR)

KTR Vs AppalaRaju: ఏపీలో రోడ్లపై కేటీఆర్ సెటైర్: కౌంటర్ ఇచ్చిన మంత్రి సీదిరి అప్పలరాజు

మరో మంత్రి జోగి రమేశ్ కూడా కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఏపీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, జరిగిన అభివృద్ధి ఏంటో కళ్లారా చూసి తెలుసుకోవాలని కేటీఆర్ కు సూచించారు. ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేకే కేటీఆర్ అలాంటి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ లాగానే కేటీఆర్ కూడా కాకమ్మ, పిట్ట కథలు చెబుతున్నారని విమర్శించారు. విజయవాడ వచ్చి చూస్తే అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుందన్నారు. ఏపీ అభివృద్ధిని చూసేందుకు అందరినీ ఆహ్వానిస్తున్నానంటూ చెప్పారు. వాలంటీర్లతో గడపగడపకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ఏపీలో తాగు, సాగు నీటి సమస్య లేనే లేదన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం విరాజిల్లుతోందన్నారు. దేశంలోని ఏ సీఎం కూడా చేయని అభివృద్ధి పనులను జగన్ చేశారుని మంత్రి చెప్పారు. అన్ని రాష్ట్రాల సీఎంలు జగన్ లా అభివృద్ధి పనులను చేయాలనుకుంటున్నారని తెలిపారు. మేం కేబినెట్ లోనూ సామాజిక న్యాయం పాటించామన్నారు.

కేటీఆర్ ఏమన్నారంటే..
ఏపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించిన క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో కరెంట్ సరిగ్గా లేదని, నీళ్లు కూడా లేవని, అభివృద్ధి జరగడం లేదని, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని తన మిత్రులు చెప్పారంటూ వ్యాఖ్యానించారు.

”ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ లేదు. నీళ్లు లేవు. రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయి. ఏపీలోని సొంతూళ్లకు వెళ్లొచ్చిన నా మిత్రులు ఈ విషయాన్ని నాతో చెప్పారు. ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్టు ఉందంటున్నారు. బెంగళూరులోని కంపెనీలు కూడా ఏపీలోని అధ్వాన్నపు రోడ్ల గురించి మాట్లాడుతున్నాయి. అదే తెలంగాణ విషయానికి వస్తే.. చాలా ప్రశాంతమైన రాష్ట్రం. దేశంలోనే హైదరాబాద్ బెస్ట్ సిటీ. తెలంగాణలో అభివృద్ధి ఎలా ఉందో ఏపీ ప్రజలకు అర్థమైంది. నగరాల్లో మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయకపోతే వెనుకపడిపోతాం. ఏపీతో పోలిస్తే తెలంగాణలో మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నాయి” అని కేటీఆర్ అన్నారు. ఏపీని ఉద్దేశించి కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపాయి.