వైసీపీలోకి గంటా?.. అయినా కేకే రాజుపైనే వైసీపీ కన్ను

వైసీపీలోకి గంటా?.. అయినా కేకే రాజుపైనే వైసీపీ కన్ను

Updated On : August 20, 2020 / 5:35 PM IST

విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గత ఎన్నిక హోరాహోరిగా సాగింది. బీజేపీ నుంచి అప్పటి శాసన సభా పక్షా నేత సిట్టింగ్ ఎమ్మేల్యే విష్ణుకుమార్ రాజు పోటీ చేయగా టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు లాంటి ఉద్దండులు ఉండడంతో ఎన్నికల్లో వైవిధ్యం సంతరించుకుంది. వైసీపీ తరఫున అనూహ్యంగా రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని రియల్ ఎస్టేట్ వ్యాపారి కేకే రాజును బరిలోకి దిగారు. రాజకీయంగా కాకలు తీరిన వారి వ్యూహాలను తట్టుకుంటూ తనదైన శైలిలో ప్రచారం చేశారు కేకే రాజు. ఎంతో ఉత్కంఠగా సాగిన ఆ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావును దాదాపుగా ఓడించినంత పని చేశారు రాజు.

రీ కౌంటింగ్ వెళ్లిన ఆ ఫలితంలో కేవలం 1944 ఓట్ల ఆధిక్యత మాత్రమే సాధించారు గంటా. ఎన్నికల్లో ఓడిపోయినా కేకే రాజు ఎక్కడా అధైర్యపడిన సందర్భాలు లేవు. సీఎం జగన్‌ ప్రోత్సాహంతో తిరిగి కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు. ఓ రకంగా విశాఖలో వైసీపీ నుంచి ఏదైనా కార్యక్రమం జరగాలంటే అది కేకే రాజు ఉత్తర నియోజకవర్గంలోనే జరుగుతుందన్న పేరు సంపాదించారు. అంతే కాకుండా ఒక సొంత టీంను పెట్టుకొని ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు.

అంతా బాగానే ఉన్నా ఇప్పుడు ఆయనకు కొత్త టెన్షన్‌ పట్టుకుందంట. ఆయన అభిమానులు, కార్యకర్తలు మీమాంసలో పడ్డారని అంటున్నారు. ప్రస్తుతం విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం విపరీతంగా సాగుతోంది. కొంతమంది వైసీపీ నేతలు కూడా ఆఫ్ ద రికార్డ్ సమావేశాల్లో ఈ విషయాన్ని ఖరారు చేస్తున్నారు. త్వరలో ముఖ్యమంత్రి సమక్షంలో గంటా శ్రీనివాసరావు తన అనుచరులతో టీడీపీనీ వీడి వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటి వరకూ టీడీపీ నుంచి వైసీపీలోకి ఏ ఎమ్మేల్యే అధికారికంగా రాలేదు. వేరే పార్టీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిందేనని జగన్‌ చెప్పడంతో ఎలాంటి చేరికలు జరగలేదు. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం లాంటి వాళ్లు బయట నుంచి వైసీపీకి మద్దతు పలుకుతున్నారే తప్ప పార్టీలో చేరలేదు.

ఒకవేళ గంటా పార్టీలోకి చేరినా కేకే రాజుకు వచ్చిన ఇబ్బందేమీ లేదని అధిష్టానం ఇప్పటికే స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఇటీవల ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను ప్రకటించిన వెంటనే పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు కూడా. భవిష్యత్‌లో కూడా కేకే రాజుకు జగన్‌ ప్రాధాన్యం ఇస్తారనంటున్నారు. గంటా వైసీపీలోకి వచ్చినా రాజుకే విశాఖ ఉత్తర బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ పార్టీలో సాగుతోంది.

ఇదే జరిగితే కేకే రాజుకు వచ్చిన ఇబ్బందేమీ ఉండదు. కానీ, కేడర్‌లో మాత్రం ఇంకా గందరగోళ పరిస్థితులే ఉన్నాయంటున్నారు. ఇప్పుడు గంటా రాజీనామా చేసి వస్తే.. కేకే రాజుకు ఆ సీటు కేటాయిస్తారా? మళ్లీ గంటాతోనే పోటీ చేయిస్తారా అన్న ఆలోచనలో ఉన్నారట. ఈ విషయాలన్నీ తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.