Gaddar Death : ప్రజా ఉద్యమాలు, పౌరహక్కుల పోరాటాల్లో ఒక శకం ముగిసింది- గద్దర్ మృతికి చంద్రబాబు సంతాపం

గద్దర్ ఓ విప్లవశక్తి. ప్రజా ఉద్యమాల్లో గద్దర్ లేని లోటును ఎవరూ తీర్చలేరు. Gaddar Death Condolence

Gaddar Death : ప్రజా ఉద్యమాలు, పౌరహక్కుల పోరాటాల్లో ఒక శకం ముగిసింది- గద్దర్ మృతికి చంద్రబాబు సంతాపం

Gaddar Death Condolence - N Chandrababu Naidu(Photo : Google)

Gaddar Death Condolence : ”ప్రజా గాయకుడు” గద్దర్ మృతి పట్ల చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు. తన పాటలతో ప్రజా చైతన్యానికి ఎనలేని కృషి చేసిన “ప్రజా యుద్ధనౌక” గద్దర్ అని కీర్తించారు. తన గళంతో ప్రజలను కదిలించిన గద్దర్ మృతితో ప్రజా ఉద్యమాల్లో, పౌరహక్కుల పోరాటాల్లో ఒక శకం ముగిసినట్లు అయ్యిందన్నారు. గద్దర్ కుటుంబసభ్యులకు తన సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు చంద్రబాబు.

Also Read..Gaddar: నీ పాటనై వస్తున్నానమ్మో అంటూ పలకరించే గద్దరన్న ఇకలేరు

గద్దర్ మృతికి టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు. ” తన ఆటపాటలతో ప్రజా ఉద్యమాలు నడిపించిన విప్లవకారుడు, ప్రజా ఉద్యమ నాయకుడు గద్దర్ మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నా. గద్దర్ ఓ విప్లవశక్తి. ప్రజా ఉద్యమ పాటలంటే తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశవ్యాప్తంగానూ మన గద్దర్ గుర్తుకొస్తారు. ప్రజా ఉద్యమాల్లో గద్దర్ లేని లోటును ఎవరూ తీర్చలేరు. గద్దర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. గద్దర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను”.

ప్రజా గాయకుడు గద్దర్(74) మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఆగస్టు 6,2023) మరణించారు. గద్దర్‌కు 10 రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితమే గద్దర్ కు గుండె ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా చేశారు డాక్టర్లు. అయితే, ఇవాళ ఉదయం బీపీ పెరగడంతో పాటు షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోవడంతో చికిత్స అందించారు. అయితే మధ్యాహ్నం మల్టిపుల్ ఆర్గాన్స్ దెబ్బతినడంతో గద్దర్ కన్నుమూసినట్లు డాక్టర్లు వెల్లడించారు.

మెదక్ జిల్లాలోని తూప్రాన్ లో లచ్చమ్మ, శేషమ్మ దంపతులకు 1949లో జన్మించిన గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. తన పాటలతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడటంలో గద్దర్ కీలక పాత్ర పోషించారు. సమాజంలోని అన్యాయాలను పాటల రూపంలో ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించడంలో గద్దర్ ది అందెవేసిన చేయి. 1984లో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ప్రజల్లో చైతన్యం నింపారు. దళితులు, పేదల కోసం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లోనూ నాటకాలు వేశారు. కింద ధోతి, పైన గొంగళి ధరించే వారు గద్దర్.