సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ సస్పెన్షన్ వేటు
తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తెలుగుదేశం పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.
Koneti Adimulam: తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తెలుగుదేశం పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఫిర్యాదు రావడంతో స్పందించిన టీడీపీ హైకమాండ్ ఈ మేరకు చర్య తీసుకుంది. ఓ మహిళను కోనేటి ఆదిమూలం లైంగికంగా వేధించారనే ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తూ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.
కాగా, ఎమ్మెల్యే ఆదిమూలం ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో బయటకు రావడంతో కలకలం రేపింది. ఆయనపై బాధితురాలు, ఆమె భర్త సంచలన ఆరోపణలు చేశారు. దీంతో వెంటనే స్పందించిన టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆయనపై చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం.
సత్యవేడు ఎమ్మెల్యే కామాంధుడు: బాధితురాలు
”ఒకే పార్టీకి చెందిన వాళ్లం కావడంతో పలు కార్యక్రమాల్లో ఆదిమూలం కలిసేవారు. అలా పరిచయమై ఆ తరువాత నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. నామొబైల్‌కు పదేపదే కాల్స్ చేసేవాడు. తిరుపతిలోని భీమాస్ హోటల్లో రూమ్ నెంబర్ 109కి రమ్మని చెప్పాడు. అక్కడ నన్ను బెదిరించి నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే నాతో పాటు కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. అలా నాపై మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
చివరకు ఎమ్మెల్యే ఆదిమూలం నిజరూపాన్ని బట్టబయలు చేయడానికి పెన్ కెమెరా పెట్టుకున్నాను. లైంగికంగా తన కోరిక తీర్చకుంటే నా కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని ఎమ్మెల్యే బెదిరించాడు. కోనేటి ఆదిమూలం లాంటి కామాంధుడు టీడీపీలో ఉండకూడదు. ఎమ్మెల్యే ఆదిమూలం గురించి అందరికీ తెలియాలి అనే పెన్ కెమెరాలో రికార్డు చేశాను. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని తెలిసి నాకు 100 సార్లు కాల్ చేశాడు.
Also Read: వరద తగ్గగానే.. ఆ ఆరుగురు పోలీసు అధికారులపై సీఎం చంద్రబాబు చర్యలు.. ఎందుకో తెలుసా?
రాత్రులు మెసేజ్‌లు చేసి వేధించేవాడు. రోజుకో అమ్మాయితో ఎమ్మెల్యే ఎంజాయ్ చేసేవాడు. అందమైన అమ్మాయి కనబడితే చాలు తను నాతో ఉండాల్సిందేనన్న కోరికతో ఎంతో మందిని టార్చర్ చేశాడు. తిరుపతి భీమా ప్యారడైజ్ హోటల్ అతడి నీచ చర్యలకు అడ్డా. ఇలాంటి వాళ్లన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. సత్యవేడు ఎమ్మెల్యేను ఎలాంటి కార్యక్రమాలకు పిలువకండి. ఇంటికి వచ్చాడని సంబరపడి పోకండి . ఇంటికి వస్తే మీ భార్య, మీ పిల్లలపై కన్నేస్తాడు. ఆది మూలం కామాంధుడు, రాక్షసుడు.. ఇతడి నుండి సత్యవేడులోని టీడీపీ మహిళా కార్యకర్తలను కాపాడాల”ని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.