Sai Kalyani Mulpuri : మూల్పూరి కళ్యాణి అరెస్ట్.. ట్విటర్ లో ఖండించిన చంద్రబాబు, లోకేశ్

తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణిని హనుమాన్ జంక్షన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Sai Kalyani Mulpuri : మూల్పూరి కళ్యాణి అరెస్ట్.. ట్విటర్ లో ఖండించిన చంద్రబాబు, లోకేశ్

Sai Kalyani Mulpuri Arrest

Updated On : April 10, 2023 / 1:01 PM IST

Sai Kalyani Mulpuri Arrest: టీడీపీకి చెందిన తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణిని సోమవారం హనుమాన్ జంక్షన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఫిబ్రవరి 20న టీడీపీ, వైసీపీ మధ్య జరిగిన గొడవలకు సంబంధించి నమోదైన రెండు కేసుల్లో నిందితురాలిగా కళ్యాణి ఉన్నారు. ముందస్తు బెయిల్ రాకపోవడంతో అప్పట్నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హనుమాన్ జంక్షన్ లోని తన నివాసంలో ఉన్నట్లు సమాచారం రావడంతో తెల్లవారుజామునే ఇంటిని ముట్టడించి హనుమాన్ జంక్షన్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Sai Kalyani Mulpuri, Chandrababu Naidu

చంద్రబాబుతో మూల్పూరి సాయి కళ్యాణి (FB Image)

ఉగ్రవాదిలా అరెస్టు చేస్తారా?
తెలుగు మహిళా నేత మూల్పూరి సాయి కళ్యాణి అరెస్ట్ ను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. కళ్యాణిపై తప్పుడు కేసు పెట్టిందే కాక.. బెడ్ రూంలోకి చొరబడి ఆమెను ఏదో ఉగ్రవాదిలా అరెస్టు చేసిన విధానం దారుణమని దుయ్యబట్టారు. ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నించిన మహిళపై హత్య కేసు పెట్టి ప్రతాపం చూపడం సిగ్గుచేటని ట్విటర్ లో విమర్శించారు.

Also Read: నాపై అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదు.. నారా లోకేష్ కు ఎమ్మెల్యే కేతిరెడ్డి అల్టిమేటం

Sai Kalyani Mulpuri, Nara Lokesh

నారా లోకేశ్ తో మూల్పూరి సాయి కళ్యాణి (FB Image)

వైసీపీ నేతల మెప్పు కోసం తప్పుడు కేసులు
తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి అరెస్టు అక్రమమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ లో ఖండించారు. ఒక మహిళ పట్ల ఇంత దారుణంగా వ్యవహరించి పోలీసు వ్యవస్థకే కళంకం తెచ్చారని మండిపడ్డారు. వైసీపీ నేతల మెప్పు కోసం తప్పుడు కేసులు బనాయిస్తూ, మహిళలని చూడకుండా వేధిస్తున్న ప్రతీ ఒక్కరూ చట్టం ముందు నిలబడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. కళ్యాణికి టీడీపీ అండగా ఉందని, పోలీసులకు మద్దతు వస్తారో చూస్తామంటూ హెచ్చరించారు.

Yarlagadda Sucharita

Yarlagadda Sucharita (Pic: Google)

కళ్యాణి అరెస్ట్ దారుణం: సుచరిత
మూల్పురి సాయి కళ్యాణిని పోలీసులు అరెస్టు చేసిన తీరును టీడీపీ రాష్ట్ర మహిళ అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచరిత తప్పుబట్టారు. బెడ్ రూమ్ లోకి వెళ్లి డ్రెస్ మార్చుకుంటున్నాను చెప్పిన వినకుండా అక్కడే ఉన్న పోలీసులు అరెస్టు చేయడం దారుణమని అన్నారు. అధికార వైసీపీకి కొమ్ముకాపేలా పోలీసుల పనితీరు ఉందని ఆరోపించారు. ప్రజల పక్షాన పోరాటం చేసినందుకు అక్రమ అరెస్టులు చేస్తారా, మహిళా కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. మూల్పూరి సాయి కళ్యాణి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.