తెలంగాణలో రిలీవ్.. ఏపీలో రిపోర్ట్‌.. నలుగురు ఐఏఎస్‌లు.. వాట్‌ నెక్ట్స్‌?

అర్బన్ ప్లానింగ్‌లో ఆమ్రపాలి నైపుణ్యం, అనుభవాన్ని లెక్కలోకి తీసుకొని.. ఆమెకు జీవీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించాలని సర్కార్ భావిస్తుందని తెలుస్తోంది.

తెలంగాణలో రిలీవ్.. ఏపీలో రిపోర్ట్‌.. నలుగురు ఐఏఎస్‌లు.. వాట్‌ నెక్ట్స్‌?

Updated On : October 18, 2024 / 8:52 PM IST

అయిష్టంగానే తెలంగాణ నుంచి రిలీవ్ అయి వెళ్లిపోయిన నలుగురు ఐఏఎస్‌లు.. ఏపీలో రిపోర్టు చేశారు. తెలంగాణలో ఉండేందుకు చివరి వరకు ప్రయత్నాలు చేసినా.. కోర్టు వరకు వెళ్లినా.. ఫలితం లేకుండా పోయింది. మరి ఇప్పుడు ఆ నలుగురి పరిస్థితి ఏంటి.. ఏపీలో ఎలాంటి బాధ్యతలు దక్కబోతున్నాయ్‌.. తెలంగాణలో మూడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆమ్రపాలికి.. ఏపీలో ఎలాంటి ప్రాధాన్యం దక్కబోతోంది..

ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, రొనాల్డ్ రాస్, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్.. ఏపీ సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నలుగురు అధికారులు తెలంగాణలోనే కొనసాగాలని భావించినా.. ఎలాంటి ఫలితం లేకపోయింది. తెలంగాణ హైకోర్టులోనూ వారికి చుక్కెదురైంది. దీంత వీళ్లంతా తెలంగాణ నుంచి రిలీవ్ అయి.. ఏపీలో రిపోర్ట్ చేశారు.

ఎలాంటి బాధ్యతలు దక్కబోతున్నాయి?
ఐతే ఇప్పుడు ఈ నలుగురికి ఎలాంటి బాధ్యతలు దక్కబోతున్నాయన్నది హాట్‌టాపిక్‌గా మారింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ పోస్టుతో పాటు… మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ, హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా తెలంగాణలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆమ్రపాలికి ఏ పదవి దక్కబోతుందనే చర్చ ఆసక్తి రేపుతోంది.

ఆమ్రపాలికి గ్రేటర్‌ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌ కమిషనర్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం ప్రధానంగా వినిపిస్తోంది. ఒంగోలుకు చెందిన ఆమ్రపాలికి విశాఖతో మంచి అనుబంధం ఉంది. ఆ సిటీపై పట్టు ఉంది. ఆమె తండ్రి కాటా వెంకట్ రెడ్డి.. విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆమ్రపాలి స్కూలింగ్ అంతా విశాఖలోనే జరిగింది. 2010 బ్యాచ్‌కు చెందిన ఆమ్రపాలి.. ఉమ్మడి ఏపీలో విధుల్లో చేరగా.. రాష్ట్ర తర్వాత సర్వీస్ అంతా తెలంగాణలోనే సాగింది.

వికారాబాద్ సబ్‌కలెక్ట్‌గా మొదటి బాధ్యతలు అందుకున్న ఆమె.. ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత పీఎం ఆఫీస్‌లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. అర్బన్ ప్లానింగ్‌లో ఆమ్రపాలి నైపుణ్యం, అనుభవాన్ని లెక్కలోకి తీసుకొని.. ఆమెకు జీవీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించాలని సర్కార్ భావిస్తుందని తెలుస్తోంది. విశాఖలో కబ్జాలు పెరిగాయని ఆరోపిస్తున్న ప్రభుత్వ పెద్దలు.. వాటికి చెక్ పెట్టాలంటే డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఆఫీసర్ కావాలని.. ఆమ్రపాలి బాధ్యతలు తీసుకుంటే.. అభివృద్ధితో పాటు జీవీఎంసీ పాలనను గాడిలో పెడతారని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక అటు ఆమ్రపాలిని పంచాయతీరాజ్ శాఖలో కీలక పదవిలోకి తీసుకోవాలని.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికి కృష్ణతేజలాంటి యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్‌లను ఓఎస్డీలుగా తీసుకున్న పవన్.. మరికొందరు యువ అధికారులను తన పేషీలోకి తీసుకోవాలని భావిస్తున్నారని సమాచారం. ఆమ్రపాలిని తన పేషీలోకి తీసుకొని.. కీలక బాధ్యతలు అప్పగించే అకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.

నలుగురు అధికారులు చాలా పాపులర్
నిజానికి తెలంగాణ నుంచి రిలీవ్ అయిన నలుగురు అధికారులు చాలా పాపులర్. మంచి సమర్దులుగా పేరు సంపాదించుకున్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారిని ఎరికోరి తన ప్రభుత్వంలో కీలకశాఖలు అప్పగించారు. రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యాక కూడా వారికి ప్రాధాన్యం ఇచ్చారు.

వాకాటి కరుణ మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యదర్శిగా, రోనాల్డ్ రాస్ ఇంధనశాఖ కార్యదర్శిగా, వాణీ ప్రసాద్‌ యువజన సర్వీసులు, సాంస్కృతిక, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. అలాంటిది ఇప్పుడు నలుగురు ఏపీకి వెళ్లారు. దీంతో వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు ఏంటి అన్నది ఆసక్తి రేపుతోంది.

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్సెస్ గుత్తా.. నల్గొండ జిల్లాలో నయా వార్