హైడ్రా కూల్చివేతలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై టీజీ వెంకటేష్ హాట్ కామెంట్స్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్‌పై తీహార్ జైలు నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై టీజీ వెంకటేష్ స్పందించారు.

tg venkatesh hot comments on hyderabad hydra demolitions and kavitha bail
TG Venkatesh on Kaitha Bail: హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మాజీ మంత్రి టీజీ వెంకటేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెరువుల ఆక్రమణలు తొలగిస్తున్నారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు చెరువులను ఎందుకు అభివృధ్ది చేయలేదని కొందరు ప్రశ్నించారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు సమైక్యాంధ్ర పోరాటం జరుగుతోంది. శాటిలైట్ సహాయంతో చెరువులను సర్వే చేయించి కొన్ని ఆక్రమణలు తొలగించాం. చెరువుల్లో ఆక్రమణలను తొలగిస్తే ప్రజలందరూ స్వాగతిస్తారు. ఏపీలో కూడా పలుచోట్ల చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. సీఎం చంద్రబాబు కూడా చెరువులను పరిరక్షించే కార్యక్రమం మొదలు పెట్టాలి. ఆయన ఈ కార్యక్రమం ప్రారంభిస్తారని ఆశిస్తున్నాన”ని అన్నారు.
కవిత మాట్లాడే భాష సరికాదు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్‌పై తీహార్ జైలు నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపైనా టీజీ వెంకటేష్ స్పందించారు. కవిత మాట్లాడే భాష అభ్యంతకరంగా ఉందని, సవాళ్లు విసరడం సరికాదని అన్నారు. కేటీఆర్, హరీష్ రావును కూడా కావాలంటే జైల్లో వేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పార్లమెంట్ కమిటీ చైర్మన్‌గా ఉన్నప్పుడు గతంలో తన మీద హత్యాయత్నం కేసు పెట్టారని.. తనపై పెట్టిన 10 కేసులు కూడా ప్రూవ్ కాలేదన్నారు.
టీటీడీ పదవుల్లో రాయలసీమ వాసులకు పెద్దపీట
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టీజీ వెంకటేష్ సూచించారు. టీటీడీలో మెజార్టీ పరిపాలన పదవులు రాయలసీమ స్థానికులకు ఇవ్వాలని కోరారు. ఏపీని అభివృధ్ది చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారని ప్రశంసించారు. నూటికి నూరుపాళ్లు తన కుమారుడు భరత్ మంత్రిగా ముందుకు వెళ్తారని ఆకాంక్షించారు.