తెలుగు దేశం పార్టీలో చల్లారని అసంతృప్త జ్వాలలు.. టీడీపీ కార్యాలయంపై దాడి

తెలుగు దేశం పార్టీలో టికెట్ల లొల్లి కొనసాగుతూనే ఉంది. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు అధినాయకత్వంపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.

తెలుగు దేశం పార్టీలో చల్లారని అసంతృప్త జ్వాలలు.. టీడీపీ కార్యాలయంపై దాడి

TDP Ticket Fight: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీలో అసంతృప్త జ్వాలలు కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తమ నాయకులకు మద్దతుగా పలు నియోజకవర్గాల్లో టీడీపీ నాయకుల అనుచరులు ఆందోళనతలతో హోరెత్తిస్తున్నారు. పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేసిన వారికి టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రభాకర్ చౌదరికి మద్దతుగా పురుగుల మందు తాగిన జంట
అనంతపురం అర్బన్ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఇంటి వద్ద నిరసనలు తీవ్రమవుతున్నాయి. ఆయనకు టికెట్ కేటాయించలేదన్న బాధతో భార్యాభర్తలు పురుగుల మందు తాగారు. చౌదరి ముందే రూప, రాజు అనే దంపతులు పురుగు మందు తాగారు. హుటాహుటిన వారిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంపై దాడి
అనంతపురం నగరంలోని రుద్రంపేటలో టీడీపీ కార్యాలయంపై ప్రభాకర్ చౌదరి వర్గీయులు దాడి చేశారు. కార్యాలయం అద్దాలు ధ్వంసం చేసి, ఫ్లెక్సీలు ఫోటోలు చించేసి మంటలల్లో వేసి తగల బెట్టారు. ఇప్పటికైనా చంద్రబాబు మనసు మార్చుకొని ప్రభాకర్ చౌదరికి అర్బన్ టికెట్ కేచాయించాలని డిమాండ్ చేశారు. ఆయనకు టికెట్ ఇవ్వకుంటే టీడీపీని ఓడించి తీరతామని హెచ్చరించారు.

చీపురుపల్లి టీడీపీలో చల్లారని అసమ్మతి
విజయనగరం జిల్లా చీపురుపల్లి టీడీపీలోనూ అసమ్మతి చల్లారలేదు. చీపురుపల్లి టికెట్ కళా వెంకటరావుకి ఇవ్వడంపై కిమిడి నాగార్జున మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలతో సమావేశంలో కిమిడి నాగార్జున భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంతవరకు వచ్చిన తర్వాత వెనక్కి తగ్గేది లేదని, రెండు మూడు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన తెలిపారు.

Also Read: బొత్స ఝాన్సీ వర్సెస్ భరత్.. విశాఖ లోక్‌సభ సీటులో ఈసారి గెలిచేది ఎవరు?

జవహర్‌కు మద్దతుగా అనుచరుల నిరసన
మాజీ మంత్రి జవహర్‌కు టికెట్ ఇవ్వాలని కోరుతూ ఆయన అనుచరులు అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. జవహకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ నియోజకవర్గాలలో ఏదైనా సరే ఆయనకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వర్ల రామయ్య, దేవినేని ఉమాను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

కామవరపుకోటలో తారాస్థాయికి వర్గపోరు
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో వర్గ పోరు తారాస్థాయికి చేరింది. కామవరపుకోటలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, కోనేరు సుబ్బారావు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి సోంగా రోషన్ కుమార్ సమక్షంలోనే ఇరు వర్గాలు గొడవకు దిగాయి.

Also Read: అదృష్టమంటే ఈమెదే..! పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి లక్కీచాన్స్‌..!

బండారుకు చంద్రబాబు పిలుపు
విశాఖ జిల్లా పెందుర్తి టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాణమూర్తికి టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి పిలుపువచ్చింది. తనని కలవాలని ఆయనకు చంద్రబాబు కబురు పంపించారు. పొత్తులో భాగంగా పెందుర్తి జనసేనకు కేటాయించిన సంగతి తెలిసిందే.