Tirumala Temple Drone Visuals : తిరుమలలో డ్రోన్ అలజడి.. ఆ వీడియోలు తీసిన నిందితుల కోసం పోలీసుల వేట
తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో వీడియో చిత్రీకరించిన నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. నిందితులు హైదరాబాద్ కు చెందిన వారిగా గుర్తించిన తిరుమల పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే కేసుని క్లోజ్ చేసి నిందితులు వీడియో చిత్రీకరణ చేయడానికి గల కారణాలను వెల్లడిస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు.

Tirumala Temple Drone Visuals : తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో వీడియో చిత్రీకరించిన నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. నిందితులు హైదరాబాద్ కు చెందిన వారిగా గుర్తించిన తిరుమల పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే కేసుని క్లోజ్ చేసి నిందితులు వీడియో చిత్రీకరణ చేయడానికి గల కారణాలను వెల్లడిస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
నో ఫ్లై జోన్ లో ఉన్న తిరుమల గిరులపై విమానాలు వెళ్లటం నిషిద్ధం. ఇలాంటి చోట డ్రోన్ కెమెరా వినియోగించి శ్రీవారి ఆనంద నిలయం దృశ్యాలను అతి సమీపం నుంచి చిత్రీకరించడాన్ని నేరపూరిత చర్యగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.
కాగా, ఈ సంఘటనలో భద్రతా సిబ్బంది వైఫల్యాన్ని తప్పుపడుతున్నారు భక్తులు. తిరుమలకు డ్రోన్ తీసుకురావడంపైనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలిపిరి చెక్ గేట్ దాటుకుని కెమెరా తీసుకుని రావడం ఎలా సాధ్యమైందని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో తిరుమలలో బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు తిరుమల దేవస్థానం అధికారులు చేసుకున్న ఒప్పందం వల్లే డ్రోన్ కెమెరాను నిందితులు తిరుమలకు తీసుకుని వచ్చినట్లు చెబుతున్నారు అధికారులు.
Also Read..Tirumala: తిరుమలలో డ్రోన్ దృశ్యాలపై స్పందించిన టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి.. ఏమన్నారంటే?
తిరుమలలో భూగర్భ విద్యుత్ కు ఏర్పాట్లు సర్వే చేయాల్సిందిగా హైదరాబాద్ కు చెందిన ఓ సంస్థకు బాధ్యతలు అప్పగించారు తిరుమల అధికారులు. వీరు డ్రోన్ ద్వారా సర్వే కోసం గతేడాది నవంబర్ 8న అనుమతి పొందారు. కల్యాణ వేదిక, ఆక్టోపస్ నూతన విభాగం, శ్రీవారి సేవా సదన్ ప్రాంతాల్లోనే సర్వే చేయాల్సి ఉండగా.. సంస్థ ప్రతినిధులు అందుకు విరుద్ధంగా రాంభగీచా నుంచి ఆస్థాన మండపం వద్దకు వెళ్లి శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. ఆ ప్రాంతాల్లో డ్రోన్ తో సంచరిస్తున్న వారిని స్థానికులు తమ ఫోన్ లో వీడియోలు తీశారు. నిందితులను స్థానికులు అప్పుడే హెచ్చరించినట్లు చెబుతున్నారు.
సర్వే ముగించుకుని వెళ్లిన నిందితులు హైదరాబాద్ చేరుకున్నాక గృహ శ్రీనివాస, ఐకాన్ ప్యాక్ట్ అకౌంట్ల నుంచి శ్రీవారి ఆలయం వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో కలకలం రేగింది.
గతంలోనూ ఓ సారి తిరుమలలో డ్రోన్ ను వినియోగించడం వివాదాస్పదమైంది. గతంలో అధికార పార్టీకి చెందిన ఓ నేత అన్నమయ్య నడక మార్గంలో తన అనుచరులతో వస్తూ డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారని ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో కొన్నిరోజులు డ్రోన్ అంశంపై వివాదం రేగింది.
సోషల్ మీడియాలో తిరుమల శ్రీవారి ఆలయం డ్రోన్ విజువల్స్ పోస్ట్ చేయడంపై అధికారుల ఫిర్యాదుతో వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కు చెందిన కిరణ్ అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులపై తిరుమల భద్రతా నిబంధనల ఉల్లంఘన, అసాంఘిక శక్తులకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరించినట్లు నేరారోపణలు నమోదు చేశారు పోలీసులు. సెక్షన్ 447 కింద కేసు నమోదు చేశారు.
ఇక శ్రీవారి ఆలయంపై విమానాలు ప్రయాణించకూడదనే నియమం ఆగమ శాస్త్రంలో ఉందని తెలిపారు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు. శ్రీవారి ఆలయంపై విమానాలు, డ్రోన్లు ఎగరకుండా గతంలోనే నిషేధం విధించింది కేంద్రం. తిరుమలలో వేంకటేశ్వర స్వామి కొలువైన ఆలయం మహిమాన్విత శక్తి కలిగినదని ఆగమ శాస్త్రం చెబుతోంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
వైకుంఠంలోని క్రీడాద్రి పర్వతాలే తిరుమల క్షేత్ర పర్వతాలు. ఆలయంలో శ్రీవారు దివ్య శక్తితో ఉంటారు. శ్రీవారి ఆలయంపై విమానాలు, డ్రోన్లు ప్రయాణించడం దోషంగా భావిస్తారు. ఆగమ శాస్త్రంలో కూడా ఆలయం మీదుగా విమానాలు ఎగరకూడదనే నిబంధన చాలా స్పష్టంగా ఉంది. దీనికి అనుగుణంగానే తిరుమలలో విమానాలు తిరగకూడదని నిషేధం విధించింది కేంద్ర ప్రభుత్వం.