తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలు..జనసేన-బీజేపీ మధ్య పొత్తు పొడుస్తోందా..?

Tirupati MP by-elections : తిరుపతి ఉప ఎన్నిక వ్యవహారం రాజకీయంగా కాకపుట్టిస్తోంది. ఇప్పటివరకూ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగితే…ప్రస్తుతం మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ…తమ అభ్యర్థుల విషయంలో ఇప్పటికే ఓ అవగాహనకు రాగా..మూడో పక్షంగా ఉన్న జనసేన- బీజేపీ విషయంలో సందిగ్ధత నెలకొంది. ఇంతకీ బీజేపీ, జనసేన భిన్నవాదనలు దేనికి సంకేతం..? ఆ రెండు పార్టీల మధ్య పొత్తు పొడుస్తోందా..?
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికపై రెండు పార్టీలు రోజుకో మాట చెబుతున్నాయి. కొద్ది రోజుల క్రితం…తిరుపతి సభలో పాల్గొన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థిని గెలిపించాలంటూ పార్టీ నేతలకు పిలుపు నిచ్చారాయన. ఇందుకోసం కార్యకర్తలందరూ కృషి చేయాలని సోము వీర్రాజు అన్నారు.
తిరుపతి ఎన్నికల విషయంలో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలకు జనసేన నాయకుడు కిరణ్ కౌంటర్ ఇచ్చారు. తిరుపతి అభ్యర్ధి ఎవరో సోము వీర్రాజుకే తెలియదన్నారాయన. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి కామెంట్స్ గందరగోళానికి గురిచేస్తున్నాయని అన్నారు. జనసేన పార్టీ బీజేపీ కన్నా బలంగా ఉందని..ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
బీజేపీ-జనసేన కూటమి నుంచి ఎవరు పోటీ చేయాలన్న అంశంపై ఇంకా స్పష్టత రాకముందే సోము వీర్రాజు ప్రకటన చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు తిరుపతిలో పోటీ చేస్తామని ఇప్పటికే జనసేన నేతలు పలుమార్లు ప్రకటించారు. దీంతో బీజేపీ, జనసేన కూటమిలో తిరుపతి నుంచి ఎవరు బరిలో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.