Pawan Kalyan: జనసేన కార్యకర్తల కోసం త్రిశూల్.. దసరా తర్వాత శ్రీకారం.. ఇక పార్టీ కోసం ప్రతి రోజూ 4 గంటలు- పవన్ కల్యాణ్
మెంబర్ షిప్ టు లీడర్ షిప్ తేవడమే మా లక్ష్యం అని పవన్ స్పష్టం చేశారు. నిబద్ధత గల కార్యకర్తలను గుర్తించి భవిష్యత్ నాయకత్వం చేయడమే జనసేన ధ్యేయం అన్నారు.

Pawan Kalyan: జనసేన క్రియాశీలక సభ్యుల కోసం త్రిశూల్ సిద్ధాంతాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రతీ క్రియాశీలక సభ్యుడికి సెంట్రల్ ఆఫీస్ తో అనుసంధానం చేసే వ్యవస్థను తెస్తామన్నారు. గ్రామం నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకత్వం దిశగా మీకు నాయకత్వం తెస్తాను అని కార్యకర్తలతో చెప్పారాయన. కులం, మతం, ప్రాంతాలతో రాజకీయం ఎంత కాలం చేస్తామని ప్రశ్నించారు పవన్. వేదికపై ఉన్న నాయకులకు మీ విలువ తెలియాలనే ఈ సమావేశాలు పెట్టాను అని వెల్లడించారు. విశాఖలో సేనతో సేనాని సభలో కార్యకర్తలను ఉద్దేశించి పవన్ మాట్లాడారు.
మెంబర్ షిప్ టు లీడర్ షిప్ తేవడమే మా లక్ష్యం అని పవన్ స్పష్టం చేశారు. నిబద్ధత గల కార్యకర్తలను గుర్తించి భవిష్యత్ నాయకత్వం చేయడమే జనసేన ధ్యేయం అన్నారు. పార్టీ కోసం ప్రతీ రోజూ నాలుగు గంటలు కేటాయిస్తాను అని పవన్ చెప్పారు. 2029 నుంచి 2030 కి బలమైన కొత్త నాయకత్వం తేవడమే లక్ష్యం అన్నారు. ఆడపడుచులకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయిస్తామన్నారు.
”క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన కార్యకర్తను నేను గుర్తిస్తా. పార్టీ ముందుకు తీసుకెళుతుంది. కార్యకర్తల భద్రత, గౌరవం, సంక్షేమం కర్తవ్యంగా పార్టీ తీసుకుంటుంది. సామర్థ్య నిర్వహణపై ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తాం. పార్టీలోని అన్ని విభాగాలపై దసరా తర్వాత నుంచి దృష్టి సారిస్తా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపింది జనసేన పార్టీ. రైల్వే జోన్ పై గత ప్రభుత్వం భూమి కూడా ఇవ్వలేదు. మనం తెచ్చాం. పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేసేలా చేస్తున్నాం.
తల్లికి వందనం అమలు చేసి జబ్బలు చరుచుకోలేదు. దీపం పథకం కూడా సమర్థవంతంగా అమలు చేశాం. స్త్రీ శక్తి పథకంతో మహిళకు ఫ్రీ బస్ తెచ్చాం. పల్లె పండుగ, గ్రామసభలు, సీసీ రోడ్లు, మినీ గోకులాలు, లక్ష నీటి కుంటలు పూర్తి చేశాం. మీరు నిలబడితే మీ వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తా. 150 సంవత్సరాల గురజాడ అప్పారావు ఇంటిని పునర్నిర్మాణం, లైబ్రరీని డిజిటలైజ్ చేస్తాం.
దసరాకు ఆయుధ పూజ చేయండి. దేశాన్ని బలోపేతం చేద్దాం. కూటమి బలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. 15 ఏళ్ల సుస్ధిర ప్రభుత్వం కొనసాగాలి. చిన్నపాటి తప్పులు ఉంటే చంద్రబాబుతో కూర్చుని పరిష్కరించే బాధ్యత తీసుకుంటా. చిన్నపాటి కోపాలకి మనం తప్పులు చేస్తే ప్రజలు నష్టపోతారు. మళ్లీ చీకటి రోజులు వస్తాయి, అరాచక శక్తులు వస్తాయి” అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.