Tirupati Stampede Incident : తొక్కిసలాట ఘటనపై భక్తులకు క్షమాపణలు చెప్పిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు..
మేము పూర్తిగా అధికారుల మీద వదిలేసి ఉండాలని అనుకోవడం లేదు.

Tirupati Stampede Incident : తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పారు. బోర్డు తప్పిదం లేకపోయినా.. భక్తులందరికీ బోర్డు తరపున సారీ చెబుతున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బోర్డు తరపున ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలో చర్చిస్తామన్నారు. ఇక మీదట ప్రతీ విషయంలోనూ బోర్డు సభ్యులు భాగస్వామ్యం అవ్వాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. తొక్కిసలాట ఘటన కొంతమంది అధికారుల అత్యుత్సాహం వల్లనే జరిగిందన్నారు. దీనిపై చింతిస్తున్నామన్నారు.
‘బోర్డు తప్పిదం లేకపోయినా బోర్డు తరపున భక్తులందరికీ క్షమాపణలు చెబుతున్నాం. ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలి అన్నదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఇకమీదట ప్రతి విషయంలోనూ బోర్డు సభ్యులు ఇన్వాల్వ్ అవ్వాలని అనుకుంటున్నాం. ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి దుర్ఘటనలు జరక్కుండా చూడాలనేది మా ఉద్దేశం. ఆ విధంగా ముందుకెళ్తాం.
జరిగిన దానికి సాయం చేయడం తప్ప మరో దారి లేదు. చనిపోయిన వారిని వెనక్కి తీసుకురాలేము. ఒకటి మాత్రం కచ్చితంగా చెబుతున్నాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటాం. మేము పూర్తిగా అధికారుల మీద వదిలేసి ఉండాలని అనుకోవడం లేదు. మేము కూడా పర్యవేక్షణ చేస్తాం. కొంతమంది అధికారుల అత్యుత్సాహం, వారి నిర్లక్ష్యం వల్ల జరిగిన దుర్ఘటన ఇది.
Also Read : కూటమి పార్టీల వైపు ఫ్యాన్ పార్టీ నేతల చూపు.. చేర్చుకుంటే ఓ ఇబ్బంది, చేర్చుకోకపోతే మరొకటి..
వాళ్లు కూడా కావాలని చేశారని మేము అనటం లేదు. వాళ్ల నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటన ఇది. మేమంతా బోర్డు తరపున క్షమాపణలు చెబుతూ చింతిస్తున్నాం” అని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
‘ఈ దుర్ఘటన జరక్కుండా ఉండాల్సింది. ఒకరిద్దరి చిన్న పొరపాటు వల్ల ఇంత పెద్ద ఘటన జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేశారు. ఆ జ్యుడీషియల్ ఎంక్వైరీ రిపోర్టు వచ్చాక బాధ్యులందరిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని బోర్డు మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నాం.
మృతుల కుటుంబాలలో ఒకరికి కాంట్రాక్ట్ జాబ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. బోర్డు కూడా అదే నిర్ణయం తీసుకుంది. ఒకరిద్దరు యాక్సిడెంటల్ గా చేసిన తప్పు ఇది. వాళ్లు కావాలని చేశారా? అనేది రిపోర్టులో వస్తుంది. అందుకు అనుగుణంగానే చర్యలు ఉంటాయి. ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదు’ అని టీటీడీ ఎమర్జెన్సీ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు పాలకమండలి ఛైర్మన్ బీఆర్ నాయుడు.
Also Read : అందుకే తిరుమల ఘటనను వైసీపీ వాడుకుంటోంది: పంచుమర్తి అనురాధ