TTD Tickets Scam: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. దర్శనాల పేరుతో భారీ స్కామ్.. ఈ నంబర్ తో జాగ్రత్త!
తిరుమల టికెట్లు (TTD Tickets Scam)ఇప్పిస్తామంటూ మోసాలకు తెగబడుతున్న సైబర్ కేటుగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.
Ttd issues alert over fake whatsapp business account scam for tirumala tickets
TTD Tickets Scam: తిరుమల శ్రీవారి దర్శనం కోసం తపించే భక్తుల విశ్వాసాన్నే పెట్టుబడిగా మార్చుకుంటూ సైబర్ కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు తెగబడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD Tickets Scam) పేరుతో ఏకంగా వాట్సాప్ బిజినెస్ అకౌంట్లు క్రియేట్ చేసి అమాయక భక్తులను బురిడీ కొట్టించేందుకు యత్నిస్తున్నారు. 72090 03126 అనే నంబర్‌తో వాట్సాప్ ఖాతాను నిర్వహిస్తూ, ధనుర్మాసంలో శ్రీవారి సుప్రభాత సేవ టికెట్లు ఇప్పిస్తామంటూ ప్రచారం చేస్తుండటంతో టీటీడీ అధికారులు తీవ్రంగా స్పందించారు. ఇటువంటి మోసపూరిత వాట్సాప్ సందేశాలు, ఫోన్ కాల్స్ పట్ల భక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని టీటీడీ స్పష్టం చేసింది.
Rahul Gandhi: యూపీలో రాహుల్ గాంధీకి తప్పిన ప్రమాదం.. హైవేపై ఢీకొన్న కాన్వాయ్
పది నిమిషాల్లో టికెట్లు అంటూ మోసం:
సైబర్ నేరగాళ్లు భక్తుల బలహీనతను ఆసరాగా చేసుకుని ఒక్కో సుప్రభాత సేవ టికెట్‌కు రూ.2,000 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. టికెట్లు త్వరగా అయిపోతాయనే ఆందోళన సృష్టించి, కేవలం పది నిమిషాల్లోనే డబ్బులు పంపిస్తేనే బుకింగ్ కన్ఫర్మ్ అవుతుందని నమ్మిస్తూ భక్తుల నుంచి నగదు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే శ్రీవారి దర్శనాలు, ఆర్జిత సేవల టికెట్ల కోసం వచ్చే ఎలాంటి అనధికారిక మెసేజ్‌లను, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను అస్సలు నమ్మవద్దని, ఇటువంటి మోసపూరిత వ్యక్తుల ఖాతాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు పంపవద్దని అధికారులు గట్టిగా విజ్ఞప్తి చేశారు.
సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి ఫిర్యాదు చేయండి:
శ్రీవారి దర్శన, సేవా టికెట్లను కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్, యాప్‌ల ద్వారానే పొందే వెసులుబాటు ఉందని పాలకమండలి పునరుద్ఘాటించింది. అధికారికంగా వివరాలు నిర్ధారించుకోకుండా ఎవరికీ ఆన్లైన్లో డబ్బులు చెల్లించి మోసపోవద్దని హెచ్చరించింది. భక్తులు ఎవరైనా ఇటువంటి సైబర్ మోసాల బారిన పడినా లేదా నకిలీ వాట్సాప్ సందేశాలను గుర్తించినా వెంటనే ఆలస్యం చేయకుండా కేంద్ర ప్రభుత్వ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు గానీ, లేదా సమీపంలోని పోలీసు స్టేషన్లో గానీ ఫిర్యాదు చేయాలని టీటీడీ అధికారులు సూచించారు.
