జనం ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ భూతం

  • Published By: sreehari ,Published On : November 15, 2020 / 08:19 PM IST
జనం ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ భూతం

online gambling : బెట్టింగ్ భూతం జనం ప్రాణాలు తీస్తూనే ఉంది. ఈ మాయదారి రక్కసిని ఖతం చేసేందుకు ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. చాపకింద నీరులా తన పని కానిస్తూనే ఉంది.

ఎవరు ఏం చేసినా తన ఆకలి తీరదు అనేలా.. అమాయక యువత ప్రాణాలను మింగేస్తోంది. కాయ్ రాజా కాయ్.. అంటూ తన వలలో వేసుకుంటోంది.



ఈ బెట్టింగ్ మోజులో అమాయక యువకులు.. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఇంట్లో తెలియకుండా స్నేహితుల వద్ద అప్పులు చేసి పందేలు కాస్తున్నారు.

తీరా ఓడిపోవడంతో నట్టేట మునుగుతున్నారు. వేల రూపాయల అప్పులు చేసి లక్షల్లో వడ్డీని చెల్లిస్తున్నారు.

ఆదాయం లేక, ఇంట్లో అడగలేక, మళ్లీ అప్పులుచేయలేక.. ఏం చేయాలో అర్థంకాకపోవడంతో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.

ఇంట్లో చెబితే ఏం చేస్తారో అనే భయంతో, అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడితో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.



క్రికెట్ బెట్టింగ్ ఎంతో మంది జీవితాలను నాశనం చేసింది. అనేక కుటుంబాలను రోడ్డున పడేసింది. ఈ బెట్టింగ్‌లో అదృష్టం ఉంటేనే డబ్బులు వస్తాయి. కానీ సీన్ రివర్స్ అయితే మొత్తం పోతుంది.

ఉన్నది, దాచుకున్నది సర్వం స్వాహా అవుతుంది. ఈ క్రమంలో చాలా మంది మరణించగా.. తాజాగా గుంటూరు జిల్లాలో ఇద్దరు యువకులు బెట్టింగ్ భూతానికి బలయ్యారు.

బెట్టింగ్ దందా ఇద్దరి యువకుల బలవన్మరణానికి దారి తీసింది. క్రికెట్‌లో పెట్టిన డబ్బులు పోవడంతో అప్పులు కట్టలేక గుంటూరు జిల్లాలో ఇద్దరు యువకులు మరణించిన ఘటన కలకలం రేపుతోంది.



నాలుగు రోజుల క్రితం బెల్లంకొండలో తాము బెట్టింగ్ అప్పులు కట్టలేక పోతున్నామని ఇద్దరు యువకులు సెల్ఫీ సూసైడ్ వీడియోను పోస్టు చేశారు.

పురుగుల మందు తాగిని ఇద్దరిలో ఒకరు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడువగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

ఈ నెల 9న అన్నదమ్ములైన సురేష్‌, కొమరయ్య బీర్ బాటిల్‌లో అత్యంత విషపూరితమైన ఎలుకల మందు కలుపుకుని తాగారు.

సూసైడ్ వీడియోను వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేయడంతో.. ఇరుగుపొరుగు ద్వారా వీడియో చూసిన యువకుల కుటుంబ సభ్యులు బోరున విలపించారు.



ప్రాణాలతో ఉన్న కొమరయ్యను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయినా పురుగుల మందు ఎఫెక్ట్ బ్రెయిన్, లివర్‌పై తీవ్ర ప్రభావం చూపడంతో మరణించినట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఇద్దరి యువకులు దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ టోర్నీలో మ్యాచ్‌లపై బెట్టింగ్ నిర్వహించారు. క్రికెట్‌ బుకీలు తిరుమలరావు, బాజీలతో సురేశ్‌కు పరిచయం ఏర్పడింది.

క్రికెట్‌ బెట్టింగ్స్‌లో లక్షల సంపాదించొచ్చని ఆశ చూపారు. దీంతో అప్పులు చేసి మరీ బెట్టింగ్‌ కట్టారు.



చేసిన అప్పుల్లో కొంత బుకీలే సమకూర్చారు తీరా బెట్టింగ్‌లో ఓడిపోయిన తర్వాత బుకీల నుంచి ఒత్తిడి ఎక్కువైంది.

డబ్బు ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న హెచ్చరికలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మ హత్యాయత్నం చేశారు. వీరిద్దరి మరణంతో బెల్లంకొండలో విషాదఛాయలు అలుముకున్నాయి.




బెట్టింగ్ చట్ట విరుద్ధం అయినప్పటికీ కొన్ని నగరాల్లో విచ్చలవిడిగా సాగుతోంది. ఈ సంస్కృతి ఈ మధ్యకాలంలో పచ్చని పల్లెలకు పాకి యువతను నాశనం చేస్తోంది.

బెట్టింగ్ కట్టడి కోసం ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటోంది. కూకటి వేళ్లతో సహా తొలగించేందుకు కఠిన చర్యలు చేపట్టింది. అయినా బెట్టింగ్ మాఫియా మాత్రం తన పని కానిస్తూనే ఉంది.