Amit Shah: జగన్‌మోహ‌న్ రెడ్డి ప్యాలెస్‌ల‌పై అమిత్ షా ఆరా.. చంద్రబాబు, లోకేశ్ ఏం చెప్పారంటే..?

విందు సమయంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్యాలెస్ లపై అమిత్ షా, చంద్రబాబు, లోకేశ్ తదితరుల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.

Central Home Minister Amit Shah With CM Chandrababu About Jagan Palace

Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శనివారం రాత్రి గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నారు. ఆయనకు మంత్రులు లోకేశ్, అనితతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం వద్దకు చేరుకున్న అమిత్ షాకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ అమిత్ షాతో ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. అనంతరం చంద్రబాబు ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో అమిత్ షా పాల్గొన్నారు.

Also Read: Polavaram Diaphragm Wall : పోలవరం ప్రాజెక్ట్ లో కీలక పరిణామం.. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభం..

జ‌గ‌న్‌కు ఎన్ని ప్యాలెస్‌లు ఉన్నాయి..?
విందు సమయంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్యాలెస్ లపై అమిత్ షా, చంద్రబాబు, లోకేశ్ తదితరుల మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్లు తెలిసింది. జగన్ కు ఎన్ని ప్యాలెస్ లు ఉన్నాయని అమిత్ షా అడగగా.. బెంగుళూరు, హైదరాబాద్, తాడేపల్లి, ఇడుపులపాయల్లో నాలుగు ప్యాలెస్ లు ఉన్నాయని లోకేశ్ సమాధానం ఇచ్చారు. ఒక్కో ప్యాలెస్ ఎంత విస్తీర్ణంలో ఉందని అమిత్ షా ప్రశ్నించగా.. లోకేశ్ స్పందిస్తూ.. బెంగుళూరు ప్యాలెస్ 30ఎకరాలపైనే ఉందని, మిగిలినవి దాదాపు ఆరు ఎకరాల్లో ఉన్నాయని సమాధానం ఇచ్చారు. అదే సమయంలో విశాఖలో ప్రభుత్వ సొమ్ముతో రూ.500కోట్లతో మరో ప్యాలెస్ నిర్మించుకున్నాడని అమిత్ షా దృష్టికి లోకేశ్ తీసుకెళ్లారు.

విశాఖ ప్యాలెస్ కు ఎన్జీటీ రూ.200కోట్ల ఫైన్ విధించిన విషయాన్ని అమిత్ షాకు వివరించారు. అమిత్ షా స్పందిస్తూ ఎన్జీటీకి ఫైన్ కట్టారా అని ప్రశ్నించగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించుకొని జగన్ కట్టకుండా దిగిపోయాడు.. ఆ భారం ఇప్పుడు ప్రజలపై పడిందని తెలిపారు. ఎన్జీటీకి ఎప్పటికైనా ఫైన్ కట్టాల్సిందేగా.. కట్టకుండా ఎగవేయలేరని అమిత్ షా పేర్కొన్నట్లు తెలిసింది. ఓటమి తరువాత జగన్ తిరుగుతున్నాడా అని అమిత్ షా అడగ్గా.. బెంగళూరులో ఉంటూ వారానికి రెండు సార్లు ఏపీకి వస్తున్నాడని, తిరగట్లేదని కూటమి నేతలు బదులిచ్చారు.

Also Read: Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీస్ దగ్గర డ్రోన్ కలకలం.. అసలేం జరుగుతోంది? ఇది ఎవరి పని?

ఎన్టీఆర్ కు భారతరత్న విషయంపై..
కృష్ణా నదీ జలాలకు సంబంధించిన సమస్యపై అమిత్ షా ఆరా తీశారు. గోదావరి -పెన్నా అనుసంధానంపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోదావరి నదీ జలాలపై ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరాతీశారు. ఇదిలాఉంటే.. ఎన్టీఆర్ కు భారతరత్న పెండింగ్ లో ఉందని పురందేశ్వరి అమిత్ షాకు వివరించారు. చంద్రబాబుసైతం ఎన్టీఆర్ కు భారతరత్న విషయంపై అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఎన్టీఆర్ కు భారతరత్న అంశం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉందని అన్నారు. ఇదిలాఉంటే.. అమిత్ షా, చంద్రబాబు మధ్య సుమారు అరగంటకుపైగా ఏకాంత భేటీ జరిగింది. ఈ భేటీలో రాష్ట్రంలో, దేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.