తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు..చేతికొచ్చిన పంట నీళ్లపాలు..పిడుగుపాటుకు 7 మంది మృతి
తెలుగు రాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షాలు రైతులను నిలువునా ముంచాయి. వరి, మొక్కజొన్న, మామిడి, మిర్చి రైతులకు అపారనష్టాన్ని మిగిల్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షాలు రైతులను నిలువునా ముంచాయి. వరి, మొక్కజొన్న, మామిడి, మిర్చి రైతులకు అపారనష్టాన్ని మిగిల్చాయి.
రైతులను ఈ ఏడాది కూడా కష్టాలు వీడడం లేదు. ఇప్పటికే రైతన్నలను కరోనా ముంచింది. ఇప్పుడు వరుణుడు కూడా అన్నదాతను పగబట్టాడు. నిన్న తెలుగు రాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షాలు రైతులను నిలువునా ముంచాయి. వరి, మొక్కజొన్న, మామిడి, మిర్చి రైతులకు అపారనష్టాన్ని మిగిల్చాయి.
అన్నదాతలను చివరికి కరోనా కూడా వదలలేదు. కరోనా విజృంభణతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పంటలు చేతికొచ్చి కోయాల్సిన సమయంలో కూలీలు దొరకడం లేదు. లాక్‌డౌన్‌తో పంటలను కోసేందుకు కూలీలెవరూ ముందుకురావడం లేదు. దీంతో చాలాచోట్ల పంట పొలాల్లోనే ఉండిపోయింది. వరి కోతలు మొదలు కాలేదు. కొన్నిచోట్ల అష్టకష్టాలు పడి పంటను తీసినా… అది ఇంకా కళ్లాల్లోనే ఉంది. ఆ కళ్లాల్లో ఉన్న పంటను వరుణుడు నీటిపాలు చేయడంతో రైతుల కళ్లల్లో సుడులు తిరుగుతున్నాయి.
కరోనాతో ఇప్పటికే చచ్చిబతుకుతున్న రైతులను…. మూలిగే నక్కపై తాటికాయపడిన చందంగా.. ఇప్పుడు అకాల వర్షాలు కూడా వారికి తీరని నష్టాన్ని మిగిల్చాయి. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పలు పంటలు నీటిపాలయ్యాయి. ప్రధానంగా మిర్చి రైతుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.
తూర్పుగోదావరి జిల్లాలో కురసిన వర్షానికి కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. కోతకు వచ్చిన వరిపంట ఈదురుగాలులతో నేలకొరిగింది.ఇక పశ్చిమలో కళ్లాల్లో ఆరబెట్టిన వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో అకాల వర్షాల కారణంగా వరి, మామిడికి తీరని నష్టం వాటిల్లింది. మాడికి కాయలు , పిందెలు రాలిపోయాయి. కళ్లాల్లోని ధాన్యం తడిసిపోయింది.
కడప జిల్లాలో ఉద్యావన పంటలు వేసిన రైతులను అకాల వర్షాలను నిండా ముంచాయి. రాజంపేట మండలంలో ఉద్యానవన పంటలు నేలకొరిగాయి. చంకాయపేట మండలంలో ఈదురుగాలులకు మామిడి పిందెలు భారీగా రాలిపోయాయి.
తెలంగాణలోనూ అకాల వర్షాలు అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలుచోట్ల కురిసిన వర్షాలకు… మొక్కజొన్న, అరటి, వరి, మామిడి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వేల ఎకరాల్లో రైతులకు పంటనష్టం ఏర్పడింది.
ఉమ్మడి వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాలోనూ అకాల వర్షాలతో వేల ఎకరాల్లో రైతులకు అపారనష్టం వాటిల్లింది. ప్రధానంగా వరి, మొక్కజొన్న, అరటి, మామిడి, చెరకు, జామతోపాటు మిర్చికి తీవ్ర నష్టం జరిగింది. నష్టపోయిన రైతులు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరతున్నారు.
నెల్లూరు జిల్లాలో పిడుగులు ప్రాణాలు తీశాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షం కురవడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. జిల్లా వ్యాప్తంగా ఏడుగురు మృతి చెందగా.. కావలి నియోజకవర్గంలో ఐదుగురు, నాయుడుపేటలో ఇద్దరు పిడుగు పాటుకు బలయ్యారు. నాయుడుపేట మండలంలోని కాపులూరులో మరో ఐదుగురికి పిడుగు పాటుతో తీవ్రగాయాలయ్యాయి.
Also Read | ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా…అమెరికాలో 16,454 మంది మృతి