Ramachandra Rao KVP (Photo : Google)
Ramachandra Rao KVP – YS Sharmila : కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సమాచారం తనకు ఉందన్నారాయన. గన్నవరం విమానాశ్రయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసేందుకు గిడుగు రుద్రరాజు, కేవీపీ, జేడీ శీలం, కొలనుకొండ శివాజీ, నరహరశెట్టి నరసింహారావు వచ్చారు. ఈ క్రమంలో కేవీపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
”వైఎస్ మొదటి నుంచి కాంగ్రెస్ కోసం పని చేశారు. ఆయన బిడ్డ షర్మిల త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సమాచారం నాకు ఉంది. కాంగ్రెస్ వాదిగా, వైఎస్ బిడ్డ రావడాన్ని ఆహ్వానిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణం కోసం కృషి చేస్తున్నాం. ఇటుక ఇటుక పేర్చుకుంటూ మళ్లీ ఎదుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం రాహుల్ గాంధీకి ఇక్కడ పరిస్థితి వివరిస్తాం. ఆయన ఇచ్చే నిర్మాణాత్మక సూచనలను అమలు చేస్తాం.
Also Read..Rajini Vidadala : దమ్ముంటే రండి.. చంద్రబాబు, లోకేశ్‌కు మహిళా మంత్రి ఓపెన్ చాలెంజ్
విభజన హామీల భారాలని మేము మోస్తూనే ఉంటున్నాం. 2018లో తెలంగాణలో చంద్రబాబుతో పొత్తు వల్ల కాంగ్రెస్ నష్టపోయింది. ఇక నుంచి కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి కృషి చేస్తాం. విభజన హామీలను అమలు చేయడంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయి. థ్యాంక్స్ టూ చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి గవర్నెన్స్. వారి అశ్రద్ద వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరిగింది.
మోడీ ప్రభుత్వం ఏపీకి చేసిన అపచారాలను ప్రజలు ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటున్నారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు చేసిన నష్టాన్ని ప్రజలు గుర్తించారు. కాంగ్రెస్ వల్లే ఏపీ అభివృద్ధి సాధ్యం అని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. భవిష్యత్తులో తప్పకుండా కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుంది” అని కేవీపీ ధీమా వ్యక్తం చేశారు.