విశాఖ స్టీల్ పై వెనక్కి తగ్గని కేంద్రం, వంద శాతం ప్రైవేటు

విశాఖ స్టీల్ పై వెనక్కి తగ్గని కేంద్రం, వంద శాతం ప్రైవేటు

Vishaka

Updated On : March 15, 2021 / 3:24 PM IST

Visakha Steel : ఏపీలో ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నా… విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. విశాఖ ఉక్కు కర్మాగారన్ని 100 శాతం ప్రైవేటీకరిస్తామని మరోసారి తేల్చిచెప్పింది కేంద్ర ప్రభుత్వం. ప్రయివేటీకరణపై వైసీసీ ఎంపీ గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్నకు ఉక్కుశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. వందశాతం ప్రైవేటీకరణకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని, స్టీల్‌ ప్లాంట్‌తో పాటు ఇతర అనుబంధ సంస్థలను కూడా కలిపి ప్రైవేటు చేస్తామని స్పష్టంచేశారు. ఇనుప ఖనిజం గనులు కేటాయించాల్సిందిగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఒడిశా, చత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్‌ను కోరిందని, కేంద్ర ఉక్కు శాఖ కూడా గనుల కేటాయింపుకోసం ఒడిశా ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసిందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను వంద శాతం ప్రైవేటీకరిస్తున్నట్టు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే చేసిన ట్వీట్ ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆరు దశాబ్దాలుగా విశాఖ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ఉక్కు పరిశ్రమ మనుగడపై… పాండే ట్వీట్‌తో నీలినీడలు కమ్ముకున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం చేసిన ప్రకటనతో విశాఖ భగ్గుమంటోంది. ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు ఆందోళన చేపడుతున్నారు.

Read:ఉక్కు ఉద్యమం మరింత తీవ్రం.. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మోగిన సమ్మె సైరన్

విశాఖ ఉక్కుఫ్యాక్టరీపై ఉన్న యాజమాన్యం హక్కులను వదులుకుని వంద శాతం ప్రయివేటీకరిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. జనవరి 27న జరిగిన కేంద్ర ఆర్ధిక వ్యవహారాల కమిటీ ఇందుకు ఆమోదముద్ర వేసిందని తుహిన్ కాంత పాండే తెలిపారు. ప్రయివేటీ కరణ ద్వారా విశాఖ ఉక్కు యాజమాన్య హక్కులతో పాటు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వందశాతం షేర్ హోల్డింగ్‌ను ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేంద్రం పూర్తిస్థాయి నిధులతో నిర్మాణమైన ఆ కర్మాగారం…విశాఖ రూపురేఖలను మార్చివేసింది. లక్షలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించింది. స్టీల్ ప్లాంట్ కేంద్రంగా అభివృద్ధి ప్రారంభమై…రాష్ట్రమంతా విస్తరించింది. ప్రజల జీవన ప్రమాణాలను పెంచింది. స్టీల్‌ ప్లాంట్‌ను, విశాఖను విడదీసి చూడలేం. ఉక్కు ఫ్యాక్టరీతో విశాఖ ఉక్కు నగరంగా మారింది. వైజాగ్ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచింది ఫ్యాక్టరీ.