ఎమ్మెల్సీ వంశీ యాదవ్‌పై విశాఖ ఎంపీ ఫిర్యాదు.. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడిపై పైర్

కాపు నేత వంగవీటి రంగా హత్య కేసులో వెలగపూడి నిందితుడు. రంగాను ఏవిధంగా హత్య చేశారో బయటపెడతా.

visakhapatnam mp mvv satyanarayana complaint against mlc vamsi krishna yadav

MVV Satyanarayana: ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌పై విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎంవీపీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా ఇంటికి వచ్చి కొడతానంటూ వంశీకృష్ణ వ్యాఖ్యానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఎంపీ సత్యనారాయణకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ వంశీకృష్ణ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎంపీ సత్యనారాయణ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. కాగా, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌ ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

స్థాయి మరిచి మాట్లాడుతున్న వంశీ 
తాను ఎప్పుడు ఎవ్వరిపైనా అకారణంగా ఆరోపణలు చేయలేదని.. వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ మారిన తర్వాత తనపై పలు విమర్శలు చేస్తున్నారని ఎంపీ సత్యనారాయణ అన్నారు. తనపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ చేసిన ఆరోపణలకు కౌంటర్ కూడా ఇచ్చారు. ”వంశీ ఖబద్దార్.. స్థాయి మరిచి మాట్లాడుతున్నావ్. ఛాలెంజ్ చేస్తున్నా, నన్ను ఏమైనా చేసుకో. వంశీకృష్ణ చెబితే తూర్పు నియోజకవర్గంలో ఓట్లు వేసే పరిస్థితి లేదు. అతి కష్టం మీద కార్పొరేటర్ గా గెలిచారు. వంశీకృష్ణ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. తూర్పు నియోజకవర్గంలో ఎంతో మందికి వంశీ డబ్బులు ఇవ్వాలి. అతడి నామినేషన్ కు కూడా జనసేన పార్టీ డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి. వంశీకృష్ణ మీద కోపం లేదు, జాలి మాత్రమే ఉంది. 2019లో తనకు ఎమ్మెల్యే టిక్కెట్ రాకుండా నేను అడ్డుకున్నాననే అనుమానం వంశీకు ఉంది.

ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ వెంట్రుకతో సమానం. నేను కల్తీ సారా అమ్మి అభివృద్ధి చెందలేదు. దిగజారుడు రాజకీయం చేయకండి. కాపు నేత వంగవీటి రంగా హత్య కేసులో వెలగపూడి నిందితుడు. రంగాను ఏవిధంగా హత్య చేశారో బయటపెడతా. వెలగపూడి రామకృష్ణకు దమ్ము ఉంటే నాపై చేసిన ఆరోపణలు నిరూపించాలి. సిగ్గు లేకుండా వంశీకృష్ణ ఇంటికి వెళ్ళి నవ్వుతున్నారు. వెలగపూడి యాదవ సామాజిక వర్గాన్ని గుర్తించలేద”ని ఎంపీ సత్యనారాయణ మండిపడ్డారు.

Also Read: సొంత జిల్లాలో బొత్సకు షాక్? వైసీపీకి దూరమవుతున్న ప్రధాన అనుచరులు..!

వైసీపీ వెంటే యాదవులు గొలగాని శ్రీనివాస్
యాదవులకు వైసీపీ సముచిత స్థానం కల్పించిందని విశాఖ మేయర్ భర్త గొలగాని శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో కీలక పదవి యాదవులకు ఇచ్చారని, విశాఖ జిల్లాలో యాదవులు వైసీపీ వైపే ఉన్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో యాదవులు వైసీపీ విజయానికి కృషి చేయనున్నారని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డిపై వంశీకృష్ణ, వెలగపూడి రామకృష్ణబాబు విమర్శలు చేయడం తగదన్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎంవీవీ సత్యనారాయణ విజయానికి కృషి చేస్తామని చెప్పారు.

Also Read: ప్రజలే కాదు నేనూ బాధితుడినే, సైకో పాలనలో అంతా విధ్వంసమే- సీఎం జగన్‌పై చంద్రబాబు నిప్పులు

ట్రెండింగ్ వార్తలు