సొంత జిల్లాలో బొత్సకు షాక్? వైసీపీకి దూరమవుతున్న ప్రధాన అనుచరులు..!

బొత్స అనుచరులే పార్టీలో ఇమడలేని పరిస్థితులు ఉంటే, ఎలా అంటూ చర్చ జరుగుతోంది. ఓ విధంగా పిళ్లా విజయ్‌కుమార్‌, అవనాపు విజయ్‌ పార్టీని వీడితే సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోలగట్ల కన్నా, మంత్రి బొత్సకే పెద్ద మైనస్‌గా చెబుతున్నారు. అనుచరులను కాపాడుకోలేకపోయారనే అపప్రదను మంత్రి మూటగట్టుకోవాల్సివస్తుందని అంటున్నారు.

సొంత జిల్లాలో బొత్సకు షాక్? వైసీపీకి దూరమవుతున్న ప్రధాన అనుచరులు..!

Botsa Satyanarayana

Botcha Satyanarayana : రాష్ట్ర మంత్రి బొత్సకు సొంత జిల్లాలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయా? వైసీపీలో రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పుతున్న మంత్రి.. జిల్లాలో తన ముఖ్య అనుచరులను కాపాడుకోలేకపోతున్నారా? రెండు దశాబ్దాలుగా మంత్రికి వీరవిధేయులుగా కొనసాగిన వారు.. ఇప్పుడు పార్టీకి గుడ్‌బై చెప్పడానికి కారణమేంటి? మంత్రి పట్టు తగ్గుతుందా? ఆయన ప్రత్యర్థుల బలం పెరుగుతుందా?

కోలగట్ల దెబ్బ తట్టుకోలేక టీడీపీలోకి..
విజయనగరం జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రం విజయనగరం రాజకీయం హాట్‌ హాట్‌గా మారుతుంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర మంత్రి బొత్సకు షాక్‌ తగిలేలా.. విజయనగరం ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల చక్రం తిప్పడం హాట్‌టాపిక్‌ అవుతోంది. కోలగట్ల దెబ్బకు బొత్స అనుచరులు పార్టీలో ఇమడలేక.. టీడీపీ కండువా కప్పుకోడానికి సిద్ధమవడం విజయనగరం రాజకీయాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది.

బొత్స హవాకు బ్రేకులు పడేలా..
విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స కుటుంబానిదే ఆధిపత్యం. రాష్ట్ర స్థాయిలోనూ వైసీపీలో బొత్స మాటలకు ఎదురులేదు. కానీ, ప్రస్తుతం రాజకీయం మారుతున్నట్లు కనిపిస్తోంది. బొత్స హవాకు బ్రేకులు పడేలా.. ఆయన అనుచరులకు చెక్‌ చెప్పేలా పార్టీలో మరో వర్గం బలోపేతమడం ఆసక్తికరంగా మారుతోంది. విజయనగరం పట్టణంలో బొత్స మార్క్‌ లేకుండా చేయడానికి అన్నట్లు.. బొత్స ప్రధాన అనుచరులకు పార్టీ నుంచి పొమ్మని పొగబెట్టడం చూస్తుంటే.. జిల్లాలో బొత్సకు స్పీడ్‌కు బ్రేకులు పడుతున్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : 4 దశాబ్దాల చరిత్రలో తొలిసారి.. రాజ్యసభ ఎన్నికల నుంచి టీడీపీ నిష్క్రమణ..

టీడీపీలోకి బొత్స ప్రధాన అనుచరులు..
విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి బొత్స వర్గంగా చెప్పుకునే పిళ్లా విజయ్‌కుమార్‌, అవనాపు విజయ్‌తోపాటు ఇతర ద్వితీయ శ్రేణి నాయకులు సుమారు 10వేల మంది కార్యకర్తలతో సహా టీడీపీలోకి వెళ్లనున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. విజయనగరం పట్టణంలో పిళ్లా, అవనాపు కుటుంబాలకు భారీ అనుచర గణం ఉంది. బొత్సకు ప్రధాన అనుచరుడిగా పిళ్లా విజయ్‌కుమార్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక అవనాపు విజయ్‌.. వైసీపీ పార్టీ ప్రారంభించిన తర్వాత జిల్లాలో ఆ పార్టీ జెండా పట్టుకున్న తొలి నాయకుడు.

కోలగట్ల ఆధిపత్యం ముందు తేలిపోయారు..
మంత్రి బొత్స, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల కూడా అవనాపు విజయ్‌ తర్వాతే పార్టీలోకి వచ్చారు. తొలి నుంచి విజయనగరం ఎమ్మెల్యే, మేయర్‌ పదవులపై ఆశలు పెట్టుకున్న అవనాపు సోదరులకు.. పార్టీ ఆధికారంలోకి వచ్చాక మింగుడు పడని పరిస్థితులు ఏర్పాడ్డాయి. పిళ్లా విజయ్‌కుమార్‌ కూడా నగరంలో పట్టు కోసం ఎంతగానో ప్రయత్నించారు. కానీ, 2019 ఎన్నికల తర్వాత సీన్‌ మారిపోయింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా కోలగట్ల ఆధిపత్యం ముందు వీరిద్దరూ తేలిపోయారు. కోలగట్ల అధికారం ముందు నిలబడలేని ఈ ఇద్దరు బొత్స అండదండల కోసం ప్రయత్నించినా.. వర్క్‌ అవుట్‌ కాలేదు. పార్టీలో కోలగట్ల మాటే చెల్లుబాటయ్యే పరిస్థితులు ఏర్పడటంతో పిళ్లా విజయ్‌కుమార్‌, అవనాపు విజయ్‌లు మేయర్‌ కాదుకదా, కనీసం కార్పొరేటర్లుగా కూడా ఎన్నిక కాలేకపోయారు.

10వేల మందితో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటన..
మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో స్వంత్రంగా పోటీ చేద్దామని భావించినా, బొత్స హామీతో వెనక్కుతగ్గారు. కానీ, ఆ ఎన్నికల తర్వాత వీరి పరిస్థితి మరింత అధ్వానంగా తయారైందని చెబుతున్నారు. తన మాటను ధిక్కరించారనే కారణంతో కోలగట్ల మరింత ఇబ్బందులకు గురిచేయడంతో అధికార పార్టీలో ఉన్నా, ఎలాంటి గుర్తింపు లేక అసంతృప్తితోనే ఇన్నాళ్లు గడిపారు. ఇక ఎన్నికలు దగ్గరపడటంతో తమ సత్తా ఏంటో చూపుతామంటూ సవాల్‌ చేస్తున్నారు. ఏకంగా నగరంలో తమ ప్రధాన అనుచరులను పోగేసి 50 వార్డుల్లో 10 వేల మందితో టీడీపీలో చేరుతున్నామంటూ అల్టిమేటం జారీ చేశారు.

Also Read : ఏపీని షేక్ చేస్తున్న నెల్లూరు పెద్దారెడ్ల పొలిటికల్ ఇష్యూస్

మంత్రి బొత్సకే పెద్ద మైనస్‌..
పిళ్లా విజయ్‌కుమార్‌, అవనాపు విజయ్‌ వంటివారు ద్వితీయ శ్రేణి నాయకులైనా.. బొత్స ప్రధాన అనుచరులు కావడంతో వారు పార్టీ వీడుతున్నారనే టాక్‌.. జిల్లాలో విస్తృత చర్చకు దారితీసింది. బొత్స అనుచరులే పార్టీలో ఇమడలేని పరిస్థితులు ఉంటే, ఎలా అంటూ చర్చ జరుగుతోంది. ఓ విధంగా పిళ్లా విజయ్‌కుమార్‌, అవనాపు విజయ్‌ పార్టీని వీడితే సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోలగట్ల కన్నా, మంత్రి బొత్సకే పెద్ద మైనస్‌గా చెబుతున్నారు. అనుచరులను కాపాడుకోలేకపోయారనే అపప్రదను మంత్రి మూటగట్టుకోవాల్సివస్తుందని అంటున్నారు.

ఇక ఈ ఎపిసోడ్‌తో జిల్లాలో టీడీపీకి.. సీనియర్‌ నేత అశోక్‌ గజపతికి ఊపు వచ్చినట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో అశోక్‌ కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి మళ్లీ అదితి పోటీ చేయనున్నారు. ఇప్పటికే విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. ఇద్దరూ బలమైన బీసీ నేతలు ఆమెకు చేదోడుగా నిలవనుండటం శుభ సూచకంగా భావిస్తున్నారు టీడీపీ నేతలు.