Nellore: ఏపీని షేక్ చేస్తున్న నెల్లూరు పెద్దారెడ్ల పొలిటికల్ ఇష్యూస్

ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడటం, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ సీటు దక్కలేదన్న కోపంతో జనసేనాని పవన్‌తో..

Nellore: ఏపీని షేక్ చేస్తున్న నెల్లూరు పెద్దారెడ్ల పొలిటికల్ ఇష్యూస్

Nellore Reddys

ఇగో నా చుట్టూ వైఫైలా ఉంటది. ఇదో సినిమా డైలాగ్‌. కానీ.. నెల్లూరు పెద్దారెడ్ల పరిస్థితీ ఇదే. కొంచెం ఈగో హర్ట్‌ అయినా సరే.. ఎవరైతే నాకేంటి అనే పరిస్థితి. ప్రస్తుతం నెల్లూరు వైసీపీలో అదే పరిస్థితి నడుస్తోందా ? ఇప్పటికే ముగ్గురు రెడ్డి ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పగా.. తాజాగా ఎంపీ వేమిరెడ్డి కూడా అదే బాటలో పయనిస్తున్నారా ? ఎంపీ సీటు ఆఫర్‌ చేసినా.. బైబై జగన్‌ అంటూ ప్రభాకర్‌రెడ్డి దూరమవడానికి కారణమేంటి ?

నెల్లూరు జిల్లా ఫ్యాన్ పార్టీ ఖిల్లా.. 2014, 2019 ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసీపీకి ఎదురే లేకుండా పోయింది. గత ఎన్నికల్లో అయితే ఉమ్మడి జిల్లాలో పదికి పది సీట్లను గెలుచుకొని క్లీన్‌స్వీప్‌ చేసింది. వైసీపీ అధినేత జగన్ కూడా జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. తన సామాజిక వర్గమైన నెల్లూరు పెద్దారెడ్లకు పూర్తి ఆధిపత్యం అప్పగించారు.

బీసీ వర్గానికి చెందిన అనిల్‌కుమార్ యాదవ్‌ను తొలి మంత్రివర్గంలో తీసుకున్నా.. రెండోసారి విస్తరణలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి కోసం అనిల్‌ను తప్పించారు. ఇదంతా గతమై అయినా.. ఇక్కడి నుంచే వైసీపీలో లుకలుకలు మొదలయ్యాయి.

తీవ్ర అసంతృప్తితో ఇప్పటికే..
జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశించిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి వంటి వారు తీవ్ర అసంతృప్తికిలోనై పార్టీకి దూరమయ్యారు. ఇక ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కూడా గత ఏడాది పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఈ ముగ్గురిలో ఇద్దరు తొలి నుంచి సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన వారే. కోటంరెడ్డి, మేకపాటి ఇద్దరూ వైసీపీ స్థాపించిన నుంచి జగన్‌తో నడిచిన వారే. అయితే వీరి రాజీనామాలను సీఎం జగన్ లైట్‌గా తీసుకున్నారు.

ఉంటే ఉండండి.. పోతే పొండి అన్నట్లే వ్యవహరించారు. అలా ముగ్గురు ఎమ్మెల్యేల నుంచి మొదలైన వలసలు ఇప్పడు పార్టీని తీవ్ర కుదుపునకు గురిచేస్తున్నాయి. తాజాగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడా… ఆ ముగ్గురు ఎమ్మెల్యేల బాటలోనే పసుపు కండువా కప్పుకోనున్నట్లు జరుగుతున్న ప్రచారం పొలిటికల్ హీట్ పెంచేస్తుంది.

వాస్తవానికి నెల్లూరు పెద్దారెడ్ల ఆధిపత్యమే జిల్లాలో ఎక్కువగా నడుస్తున్నా.. ఆ వర్గానికి చెందిన పెద్ద రెడ్లే ఎదురు తిరుగుతుండటం హాట్‌టాపిక్‌గా మారుతోంది. పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచిన వేమిరెడ్డికి రాజ్యసభ సభ్యత్వంతోపాటు ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డికి రెండుసార్లు టీటీడీ సభ్యత్వం కల్పించింది పార్టీ. ఇక వేమిరెడ్డి రాజ్యసభ పదవీకాలం ముగుస్తుండటంతో నెల్లూరు నుంచి లోక్‌సభ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.

అయితే పేరుకు తనకు ఎంపీ టికెట్ ఇచ్చినా, తన అభీష్టానికి వ్యతిరేకంగా పార్టీ పనిచేస్తుందనే కారణంతో ఇప్పుడు వేమిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పాలనే నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం సంచలనం రేపుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో వేమిరెడ్డితోపాటు మరో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి భేటీ అయ్యారని విస్తృత ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ ప్రచారంలో సగం మాత్రమే నిజం ఉందని, తాను చంద్రబాబును కలవకపోయినా, ఆ ఇద్దరు పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్లు ఆదాల ప్రభాకర్‌రెడ్డి ప్రకటించడాన్ని బట్టి.. వేమిరెడ్డి పార్టీ మార్పు దాదాపు ఖాయమైనట్లే అంటున్నారు.

లోక్‌సభ ఛాన్స్ ఇచ్చినా..
ఆరేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన వేమిరెడ్డికి లోక్‌సభ ఛాన్స్ ఇచ్చినా.. వైసీపీకి దూరం కావడానికి ఒకే ఒక్క కారణం చెబుతున్నారు. వేమిరెడ్డి భార్య ప్రశాంతిరెడ్డికి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే టికెట్ నిరాకరించడంతోపాటు, తనకు కనీస సమాచారం లేకుండా నెల్లూరు సిటీ అభ్యర్థిగా, డిప్యూటీ మేయర్ ఖలీల్‌ను ఎంపిక చేయడాన్ని వేమిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు.

వేమిరెడ్డి సూచనల మేరకే సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ను తప్పించి.. ఆయనకు సన్నిహతుడైన ఖలీల్‌కే టికెట్ కేటాయించారు. అయితే.. ఆ సమాచారం అరగంట ముందు మాత్రమే తనకు తెలియజేయడంపై తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు వేమిరెడ్డి. సిటీ అభ్యర్థిని ప్రకటించిన నుంచి పార్టీ అగ్ర నాయకత్వానికి అందుబాటులో లేకుండా పోయిన వేమిరెడ్డి… టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్‌లోకి వెళ్లడం పెద్దరెడ్ల పంచాయితీలో హైలైట్‌గా నిలిచింది.

ఎంపీ సీటు ఇచ్చినా… ససేమిరా అంటూ టీడీపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్న వేమిరెడ్డికి ఆ పార్టీలోనూ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. నెల్లూరు ఎంపీ టికెట్ తోపాటు, టీటీడీ చైర్మన్‌గా వేమిరెడ్డికి అవకాశం ఇస్తామని టీడీపీ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

అంతేకాదు.. వేమిరెడ్డి కోరుకున్నట్లు ఆయన భార్య ప్రశాంతిరెడ్డిని అసెంబ్లీకి పంపే బాధ్యత తీసుకున్నట్లు చెబుతున్నారు. కోవూరు నుంచి ప్రశాంతిరెడ్డికి ఎమ్మెల్యే సీటు కేటాయించేందుకు టీడీపీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వేమిరెడ్డికి, చంద్రబాబుకు మధ్య అనుసంధానకర్తగా మాజీ మంత్రి నారాయణ మొత్తం వ్యవహారం చక్కబెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు వేమిరెడ్డిని బుజ్జగించేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఏవీ ఫలించడం లేదంటున్నారు. నేను మోనార్క్ ను… నన్నెవరూ మార్చలేరన్నట్లు వైసీపీ బుజ్జగింపులను లెక్కచేయడం లేదని చెబుతున్నారు. ఢిల్లీలో సీఎం జగన్ పర్యటనకు దూరంగా ఉన్నప్పటి నుంచే వేమిరెడ్డితో పార్టీ పెద్దలు చర్చిస్తున్నా.. ఏవీ సానుకూల ఫలితాలు ఇవ్వలేదు. తాజాగా ఆయన అసంతృప్తితో ఉన్నట్లు సాక్ష్యాత్తూ మరో ఎంపీ ధ్రువీకరించడం చూస్తే నెల్లూరు పెద్దరెడ్ల పంతం నెగ్గించుకోవడానికి ఎంత వరకైనా వెళ్తారని అనిపిస్తోంది.

మొత్తంగా వేమిరెడ్డి ఎపిసోడ్‌తో పాటు జిల్లాలో నెల్లూరు పెద్దారెడ్ల దెబ్బకు వైసీపీలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడటం, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ సీటు దక్కలేదన్న కోపంతో జనసేనాని పవన్‌తో భేటీ కావడం ఒక ఎత్తయితే.. అంతకు మించి వేమిరెడ్డి ఎఫెక్ట్ పడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మంగళగిరి ఇంఛార్జిని మార్చే ఆలోచనలో సీఎం జగన్..?