New Year Celebrations Representative Image (Image Credit To Original Source)
Visakha Police: వైజాగ్ లో మత్తు పదార్ధాలు గుప్పుమన్నాయి. ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి, డ్రగ్స్ కలకలం రేపాయి. గంజాయి, ఎండీఎంఏ పౌడర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న్యూఇయర్ వేడుకల కోసం డ్రగ్ పెడ్లర్లు మత్తు పదార్ధాలు తెచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. అప్రమత్తమైన పోలీసులు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.
అటు వైజాగ్ లో జరిగే న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తాట తీస్తామని విశాఖ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. న్యూ ఇయర్ ఈవెంట్స్ పైనా పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్ధాల సరఫరా ముఠా కదలికలపై నిఘా పెట్టి డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు.
మరోవైపు వైజాగ్ లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఫ్లై ఓవర్స్, బీఆర్టీఎస్ రోడ్లపై ఇవాళ రాత్రి రాకపోకలను నిషేధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ల కోసం ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. హోటల్స్, పబ్బులు, క్లబ్బులు, రిసార్ట్స్ లో జరిగే ఈవెంట్లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.
విశాఖ న్యూ ఇయర్ ఈవెంట్లకు రెడీ అవుతున్న తరుణంలో మత్తు పదార్ధాలు గుప్పుమన్నాయి. చోడవరం నుంచి ఇద్దరు వ్యక్తులు విశాఖలోని ఒక వ్యక్తికి డ్రగ్స్ అందిస్తున్నారనే పక్కా సమాచారంతో ఎంవీపీ పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వెహికల్ లో తరలిస్తున్న మూటను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అందులో దాదాపు 5 కిలోల గంజాయి, మూడున్నర గ్రాముల ఎండీఎం పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మత్తు పదార్ధాలు ఎవరికి అందజేయడానికి తీసుకొచ్చారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. న్యూఇయర్ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా ఈవెంట్ నిర్వాహకులకు కానీ లేదా వ్యక్తులు ఎవరైనా ఆర్డర్ ఇచ్చారా? ఎప్పటి నుంచి ఈ వ్యవహారం నడిపిస్తున్నారు? అనేదానిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.
అటు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దింపారు. పబ్బులు, ఈవెంట్లు నిర్వహించే ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. నిబంధనలు బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. న్యూ ఇయర్ వేడుకల ముసుగులో మత్తు పదార్ధాలు, విదేశీ మద్యం బాటిళ్లు, గంజాయి ఎక్కువగా వస్తుంటాయి. ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ బృందాలు నిఘా పెంచాయి. నగరం మొత్తం జల్లెడ పడుతున్నాయి.