Cyber Fraud: శ్రీకాకుళం జిల్లాలో భారీ సైబర్ మోసం.. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి నుంచి రూ.కోటి కొట్టేశారు.. మోసం జరిగిందిలా
కాశీబుగ్గలోని రోటరీ నగర్ కు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దువ్వాడ షణ్ముఖరావుకు మార్చి నెలలో ఒక వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది.
Cyber Crime Representative Image (Image Credit To Original Source)
- కాశీబుగ్గలో భారీ సైబర్ మోసం
- రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగికి కుచ్చుటోపీ
- కోటి రూపాయలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- అయినా తీరని ధనదాహం
Cyber Fraud: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వారి మోసాలకు అంతు లేకుండా పోతోంది. మెట్రోపాలిటిన్ సిటీస్ లోనే కాదు మారుమూల పల్లెల్లోనూ మోసాలు చేస్తున్నారు. వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగులే టార్గెట్ గా నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. కాశీబుగ్గకు చెందిన ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగికి సైబర్ క్రిమినల్స్ కుచ్చు టోపీ పెట్టారు. పలు దఫాలుగా ఆయన నుంచి కోటి 31 లక్షల 85వేల రూపాయలు కాజేశారు. ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో మీ ఫోన్ నెంబర్ ఉందంటూ..
కాశీబుగ్గలోని రోటరీ నగర్ కు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దువ్వాడ షణ్ముఖరావుకు మార్చి నెలలో ఒక వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. ఆ కాల్ లో అవతలి వ్యక్తులు తాము పోలీసులమని చెప్పుకున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో మీ ఫోన్ నెంబర్ ఉందని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేయగా, వారి అకౌంట్ నుంచి మీ బ్యాంకు ఖాతాకు డబ్బులు బదిలీ అయినట్లు ఆధారాలు గుర్తించామన్నారు. ఆపై ఆయన బ్యాంక్ పాస్ బుక్ తో పాటు ఆధార్ వివరాలు కావాలని అడిగారు.
సైబర్ నేరగాళ్ల మాటలకు భయపడిపోయిన బాధితుడు తన బ్యాంక్, ఆధార్ కార్డ్ డీటైల్స్ పంపించారు. అనంతరం కాల్ కట్ చేసిన సైబర్ క్రిమినల్స్.. సీబీఐ అధికారులం అంటూ మరుసటి రోజు మళ్లీ కాల్ చేశారు. షణ్ముఖరావును డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం అంటూ ఓ ఫేక్ వారెంట్ చూపించారు. అది చూసి భయపడ్డ ఆయనకు ఏం చేయాలో అర్థం కాలేదు. అది గమనించిన కేటుగాళ్లు వెంటనే తమ ప్లాన్ ని అమలు చేశారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే తాము అడిగినంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు సైబర్ క్రిమినల్స్.
ఎల్ఐసీ బాండ్స్, బంగారు ఆభరణాలు అమ్మేసి..
ఇక ఈ విధంగా సుమారు రెండు నెలల కాలం వ్యవధిలో షణ్ముఖరావు తన ఎల్ఐసీ బాండ్స్, బంగారు ఆభరణాలు అమ్మి కోటి 31 లక్షల 85వేల రూపాయలను సైబర్ నేరగాళ్లకు ట్రాన్స్ ఫర్ చేశారు. ఈ విషయం బయటకు తెలిస్తే తన పరువు పోతుందని భావించిన బాధితుడు ఎవరికీ చెప్పలేదు. కానీ, ఇంత సొమ్ము కాజేసినా ధనదాహం తీరని ఆ తెరచాటు దొంగలు మరోసారి షణ్ముఖరావుకు కాల్ చేశారు.

Kashibugga Police Station Representative Image (Image Credit To Original Source)
ఆయన చెల్లించిన డబ్బుకు ఇన్ కమ్ ట్యాక్స్ కట్టాలని, అందుకు మరికొంత డబ్బు పంపాలని డిమాండ్ చేశారు. అప్పటికే తన దగ్గరున్న దాంతో పాటు తెలిసిన వారి దగ్గర తీసుకుని భారీ మొత్తంలో చెల్లించిన ఆయన ఇకపై ఏం చేయాలో తెలియక బంధువుల దగ్గర తన గోడు వెళ్లబుచ్చుకున్నారు. అదంతా విన్న వారు అదొక సైబర్ మోసంగా భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. బాధితుడి దగ్గరి నుంచి సైబర్ నేరగాళ్లు కాల్ చేసిన ఫోన్ నెంబర్లతో పాటు బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించారు.
తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయొద్దని పోలీసులు సూచించారు. అసలు డిజిటల్ అరెస్ట్ అనేదే లేదన్నారు. ఎవరికైనా ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే తమకు తెలియజేయాలని కాశీబుగ్గ పోలీసులు చెప్పారు.
వీడియో కాల్ చేసి బెదిరింపులు- రామకృష్ణ, కాశీబుగ్గ సీఐ
”ఆయన ఎక్స్ ఆర్మీ పర్సన్. వయసు సుమారుగా 65 సంవత్సరాలు ఉంటుంది. ఆయనకు ఒక వీడియో కాల్ వచ్చింది. మీ ఆధార్ కార్డ్ తో లింక్ అయిన ఫోన్ సిమ్ కార్డ్ నెంబర్ హ్యుమన్ ట్రాఫికింగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉందని చెప్పారు. ఆ ముద్దాయి అరెస్ట్ అయ్యాడని, మీ పేరుని డిస్ క్లోజ్ చేశాడని, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వారెంట్ ఉందని వాళ్లు వీడియో కాల్ లో చూపించారు.
దీంతో భయపడిపోయిన బాధితుడు మార్చి నెల నుంచి మే నెల వరకు రెండు నెలల వ్యవధిలో విషయాన్ని ఎవరికీ చెప్పకుండా డబ్బులు పంపాడు. తన దగ్గర బ్యాంకు అకౌంట్ లో ఉన్న డబ్బుతో పాటు ఎల్ఐసీ లో ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్.. కూతురు, భార్య బంగారం తాకట్టు పెట్టి 31 లక్షలు.. రుణం తీసుకుని మరికొంత నగదు.. ఇలా మొత్తం కోటి 31 లక్షల రూపాయలు వారు చెప్పిన అకౌంట్లకు బదిలీ చేశాడు”.
Also Read: 10టీవీ ఎఫెక్ట్.. వేంకటేశ్వర స్వామి ఆభరణాల మాయంపై దర్యాఫ్తు ప్రారంభం
