ఏపీలో పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి కేసు ఇంత సంచలనంగా ఎందుకు మారింది? అసలేం జరుగుతోంది?
అదే రోజు అర్ధరాత్రి కొంతమూరు వద్ద రహదారి పైనుంచి కిందకు ప్రమాదవశాత్తు జారి పడ్డారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి చెందిన కేసు సంచలనం సృష్టిస్తోంది. ఆయన మృతిపై అనుమానాలున్నాయని క్రైస్తవ సంఘాల నేతలు అంటున్నారు. రాజమహేంద్రవరం జీజీహెచ్ వద్ద వారు ఆందోళన దిగారు. పాస్టర్ పగడాల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు.
అసలేం జరిగింది?
పాస్టర్ ప్రవీణ్ కుమార్ కొంతమూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని ఇప్పటికే రాజానగరం సీఐ ఎస్ ప్రసన్న వీరయ్య గౌడ్ చెప్పారు. హైదరాబాద్ నుంచి ప్రవీణ్ కుమార్ బుల్లెట్‌పై రెండు రోజుల క్రితం రాజమహేంద్రవరం బయలుదేరారని తెలిపారు.
అదే రోజు అర్ధరాత్రి కొంతమూరు వద్ద రహదారి పైనుంచి కిందకు ప్రమాదవశాత్తు జారి పడ్డారని చెప్పారు. ఆయనపై వాహనం పడడంతో బలమైన గాయాలు అయ్యాయని, నిన్న ఉదయం 9 గంటల వరకు ఆయనను ఎవరూ గమనించలేదని తెలిపారు.
ప్రవీణ్ అనుచరులు ఈ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ శరీరంపై గాయాలు ఉన్నాయని అంటున్నారు. అసలు ప్రవీణ్ ఆ సమయంలో బైకుపై ఎందుకు వెళ్లారని కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: అప్సరను చంపి, డ్రైనేజీలో పూడ్చి, మ్యాన్‌హోల్‌ను మట్టితో నింపిన కేసు.. పూజారికి జీవిత ఖైదు
చంద్రబాబు సహా పలువురి స్పందన
ప్రవీణ్ కుమార్ మృతిపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికే డీజీపీతో మాట్లాడారు. ఈ కేసులో అన్ని కోణాల్లో విచారణ జరపాలన్నారు. హోంమంత్రి అనిత స్పందిస్తూ.. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. పాస్టర్ మరణంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. పాస్టర్ ప్రవీణ్ ప్రమాదం జరిగిన సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించాలని చెప్పారు. క్రైస్తవ సంఘాలు కోరిన మేరకు పోస్టుమార్టం వీడియో రికార్డింగ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.
పాస్టర్ పగడాల ప్రవీణ్ హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారని చెప్పారు. వివిధ సంఘాలు పాస్టర్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేయిస్తామని తెలిపారు.