Tdp Senior Leaders : మంత్రివర్గంలో సీనియర్లను పక్కన పెట్టిన చంద్రబాబు.. కారణం అదేనా?

చంద్రబాబు మంత్రివర్గం అంటే ఎప్పుడూ నలుగురైదుగురు పేర్లు గుర్తొచ్చేవి. వారు లేకుండా చంద్రబాబు క్యాబినెట్ కూర్పు అసాధ్యం అన్నట్లు ఉండేది.

Tdp Senior Leaders : మంత్రివర్గంలో సీనియర్లను పక్కన పెట్టిన చంద్రబాబు.. కారణం అదేనా?

Tdp Senior Leaders : మారిన చంద్రబాబును చూస్తారు అన్న టీడీపీ అధినేత మాటలు చేతల్లో కనిపిస్తున్నాయి. చంద్రబాబు 4.O గవర్నమెంట్ లో సీనియర్లకు చెక్ చెప్పడం ద్వారా పాత వాసనలు వద్దన్న సంకేతాలే పంపారు టీడీపీ బాస్. చంద్రబాబు మంత్రివర్గం అంటే ఎప్పుడూ నలుగురైదుగురు పేర్లు గుర్తొచ్చేవి. వారు లేకుండా చంద్రబాబు క్యాబినెట్ కూర్పు అసాధ్యం అన్నట్లు ఉండేది. కానీ, నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు.. తన పాత మిత్రులకు, సీనియర్ సహచరులకు విశ్రాంతి ఇచ్చారు. పార్టీ భవిష్యత్తే ప్రథమం అన్నట్లు యువరక్తాన్ని ప్రోత్సహించారు.

ఏపీ సీఎం చంద్రబాబు క్యాబినెట్ ను చూసిన వారు మారిన చంద్రబాబును చూస్తున్నట్లుందని విశ్లేషిస్తున్నారు. గత ఐదేళ్ల అనుభవంతో తన కొత్త ప్రభుత్వంలో సరైనోళ్లనే మంత్రులుగా ఎంపిక చేశారు చంద్రబాబు. 41ఏళ్ల పాటు టీడీపీనే అంటిపెట్టుకున్న సీనియర్లను, చంద్రబాబుతో పాటు రాజకీయాలు చేసిన సీనియర్లను ఈసారి నిర్మోహమాటంగా తప్పించేశారు.

సీనియర్లకు ఝలక్
టీడీపీ అంటే చంద్రబాబుతో పాటు గుర్తొచ్చే ఫేసులు చాలానే ఉన్నాయి. అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు అలాంటి వారి లిస్ట్ చాలా పెద్దదే ఉంటుంది. కానీ, ఇలాంటి వారిలో 90శాతం మంది గత ఐదేళ్లలో ఎక్కడా కనిపించకపోవడం, పార్టీ గెలుస్తుందనే ఊపు వచ్చిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు హాజరవడాన్ని గమనించిన చంద్రబాబు.. తగిన సమయంలో వారికి ఝలక్ ఇచ్చారు.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా చెందిన కిమిడి కళా వెంకట్రావ్, విశాఖ జిల్లాకు చెందిన అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస రావు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, యనమల రామకృష్ణుడు, నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు తదితర సీనియర్లకు ఈసారి మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదు చంద్రబాబు.

అయితే, అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిని.. కేవలం వృద్ధాప్యం కారణంగానే పక్కన పెట్టినట్లు చెబుతున్నారు. ఈ ఇద్దరు పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు తమ వయసును కూడా లెక్క చేయకుండా పోరాడినా.. పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారికి కేబినెట్ లో అవకాశం ఇవ్వలేకపోయారని అంటున్నారు.

గంటాపై చంద్రబాబు సీరియస్
కానీ, మిగిలిన వారి విషయంలో మాత్రమే చంద్రబాబు కఠినంగానే వ్యవహరించాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా సీనియర్ నేతలుగా చెప్పుకునే కిమిలి కళా వెంకటరావు, గంటా శ్రీనివాసరావుల విషయంలో చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఉత్తరాంధ్రలో సీనియర్ గా చెప్పుకునే కళా కుటుంబానికి చెందిన కొందరు ఎన్నికలకు ముందు వైసీపీలో చేరడం, పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరించారనే ఫిర్యాదులు ఉన్నాయంటున్నారు. తన సొంత కుటుంబసభ్యులను కట్టడి చేయకపోవడమే కళాకు పదవి దక్కకుండా చేసిందనే టాక్ నడుస్తోంది.

ఇక మరో సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు కూడా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం కార్యకర్తలవైపు చూడలేదంటున్నారు. అందుకే, భారీ మెజారిటీతో గెలిచినా ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించారని చెబుతున్నారు. ఇక, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడిని తొలిసారిగా తన మంత్రివర్గంలో చేర్చుకోలేదు చంద్రబాబు. ఇందుకు ఆయన వయసు ఓ కారణం అయితే, అదే సామాజికవర్గానికి చెందిన మరో ఇద్దరు నేతలకు అవకాశం ఇవ్వడం కూడా యనమలకు డోర్స్ క్లోజ్ అయ్యేలా చేసిందంటున్నారు.

పరిటాల కుటుంబానికి నో చాన్స్
కళా, గంటాతో పాటు రాయలసీమకు చెందిన పరిటాల కుటుంబాన్ని పక్కన పెట్టడం కూడా పార్టీలో చర్చనీయాంశం అయ్యింది. రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం మంత్రి పదవులు ఆశించినా వారి స్థానంలో ఆయా జిల్లాల నుంచి కొత్త వారికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు. పరిటాల కుటుంబం పట్టున్న ధర్మవరం నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున గెలిచిన సత్యకుమార్ ను మంత్రిగా తీసుకోవడం పరిటాల ఫ్యామిలీకి అవకాశం లేకుండా చేసిందనే విశ్లేషణలు ఉన్నాయి. ఏదైనా సరే రాయలసీమలో టీడీపీ అంటే గుర్తుకు వచ్చే పరిటాల కుటుంబానికి మంత్రి పదవి ఇవ్వకుండా చంద్రబాబు గట్టి నిర్ణయం తీసుకోవడమే.

మొత్తానికి చంద్రబాబు కొత్త మంత్రివర్గంలో 17మంది కొత్తవారికి అవకాశం ఇవ్వడం, ఇందులో 8మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినా.. వారికి మంత్రి పదవులు ఇవ్వడమే హైలైట్ అంటున్నారు. గతంలో మూడుసార్లు ఏపీ సీఎంగా పని చేసిన చంద్రబాబు.. ఎప్పుడూ ఈ స్థాయిలో కొత్తవారిని ప్రోత్సహించిన దాఖలాలు లేవు. పార్టీ భవిష్యత్ అవసరాల కోసమే కొత్త వారికి సింహం భాగం పదవులు ఇచ్చినట్లు చెబుతున్నారు విశ్లేషకులు.

Also Read : ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎవరు? రేసులో చాలామంది టీడీపీ సీనియర్ నేతలు

ప్రస్తుతం టీడీపీలో ఉన్న చాలా మంది సీనియర్లకు సుమారుగా 70ఏళ్ల వయసు ఉంది. అంత వయసులో పార్టీని ఉషారుగా నడపటం కష్టం అనే ఉద్దేశంతో ఈసారి పూర్తిగా కొత్త వారికి కేబినెట్ లో ఛంద్రబాబు ఛాన్స్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో చంద్రబాబుతో పాటు సీనియర్ నేత ఫరూక్ మాత్రమే 70ఏళ్లు పైబడిన వారే. మిగిలిన వారిలో 90శాతం మంది 50 నుంచి 60ఏళ్ల వయసు వారే ఉన్నారు. వీరికి ఎందుకు అవకాశం ఇచ్చారు అనే విషయమై లోతుగా పరిశీలిస్తే మరో పదేళ్లు పార్టీ పటిష్టంగా ఉండాలనే ఉద్దేశ్యమే కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.

పూర్తి వివరాలు..