Pawan Kalyan
దాచుకునేదేం లేదు. తప్పు చేయడం లేదు. కప్పిపుచ్చుకునే అవసరం అంతకన్న లేదు. ప్రభుత్వం క్లియర్ కట్‌గా ఉంది. ఓపెన్ మైండ్‌తో పనిచేస్తున్నాం. అధికారులపై ఒత్తిడి కూడా లేదు. అలాంటప్పుడు నేరస్థుల మీద చర్యలకు ఆలస్యమెందుకు. ఇదే జనసేనాని.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహానికి కారణమట.
పిఠాపురం పర్యటనలో ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా ఉన్న.. పవన్ కామెంట్స్ వెనక రీజన్ మాత్రం ఒక్కటేనట. అధికారుల అలసత్వం ఆయనకు కోపం తెప్పించిందట. ఏం జరిగిందో..పోలీసులకు క్లియర్‌గా తెలుసు. అలాంటప్పుడు విచారణ పేరుతో ఆలస్యం చేయడం ఎందుకని ఆయన ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులను ఉద్దేశించే పవన్ కామెంట్స్?
గత ప్రభుత్వంలో మాదిరిగా అలసత్వంతో వ్యవహరించొద్దని పోలీసులకు తేల్చి చెప్పారు పవన్ కల్యాణ్. తన దృష్టికి వచ్చిన విషయాలతో పాటు.. పిఠాపురం ఘటనలో చర్యలు ఆలస్యం అవడంపై ఓపెన్‌గానే స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. పరిస్థితులు దిగజారితే తాను హోంమంత్రిగా బాధ్యతలు తీసుకుంటానని..తాను హోంమంత్రి అయితే సీన్ వేరే ఉంటదని హెచ్చరించారు. కొందరు పోలీస్ అధికారులను ఉద్దేశించే పవన్ ఈ కామెంట్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది.
చిన్నారులు, బాలికలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు స్పీడ్‌గా యాక్షన్ తీసుకోవాల్సిందిపోయి..ఆలస్యం చేయడం..ఏదో కారణాలు చెప్పడం పవన్‌కు నచ్చలేదట. అందుకే తాను హోంమంత్రిగా బాధ్యతలు తీసుకుంటానన్నంత సీరియస్‌గా విషయాన్ని చెప్పేశారు. ప్రతిపక్షాలో, ప్రజాసంఘాలో డిమాండ్ చేస్తే తప్ప యాక్షన్ తీసుకోలేని పరిస్థితి ఉంటే..అధికారులు ఉండేందుకనేది పవన్ అభిప్రాయం. తప్పు జరిగినప్పుడు పోలీస్ వ్యవస్థ నిక్కచ్చిగా తన పని తాను చేసుకుపోవాలంటున్నారు పవన్.
లా అండ్ ఆర్టర్ చాలా కీలకమన్న పవన్ కల్యాణ్..కులంతో సంబంధం లేకుండా నేరస్థులను శిక్షించాలన్నారు. గత ప్రభుత్వంలోలాగా పోలీసులు అలసత్వంతో ఉండొద్దని..తెగేవరకూ లాగకండి అంటూ సూచించారు. వైసీపీ వాళ్లు ఇష్టమొచ్చినట్లు రౌడీల్లా వ్యవహరిస్తుంటే ఏం చేస్తున్నారు.? చర్యలు తీసుకోరా.? ఆడబిడ్డలను బెదిరిస్తూ, అవమానిస్తుంటే అరెస్టు చేయరా.? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఇన్వాల్వ్ అయి ఆదేశాలు ఇస్తే తప్ప చర్యలు తీసుకోరా అని ఇండైరెక్టుగా పోలీస్ అధికారుల తీరుపై మండిపడ్డారు.
పవన్ ఓపీనియన్ ఇదేనా?
పోలీసులే విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదనేది పవన్ ఓపీనియన్‌గా చెబుతున్నారు. తాను ఇప్పుడు హోంశాఖ మంత్రిని కాదంటూనే,. పరిస్థితులు చెయ్యి దాటితే హోంశాఖ తీసుకుంటానని, తాను హోంమంత్రి బాధ్యతలు తీసుకుంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తరహాలో వ్యవరిస్తానంటూ ఓ రేంజ్‌లో ఎవరికి వార్నింగ్ ఇవ్వాలో వారికి క్లారిటీ వచ్చేలా చెప్పేశారు పవన్.
వరుస ఘటనలపై ఆగ్రహంతోనే సేనాని ఈ కామెంట్స్ చేసినా..లేక పోలీసులు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్ కామెంట్స్ అయితే చర్చనీయాంశంగా మారాయి. పరిస్థితులు చేయి దాటితే హోంమంత్రిగా బాధ్యతలు తీసుకుంటానని..తాను చార్జ్ తీసుకుంటే ఎలా ఉంటుందో కూడా క్లారిటీ ఇవ్వడంతో.. ఆయన ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
పవన్ హోం మినిస్టర్ కావాలని కోరుకున్నామని.. కానీ అప్పుడు కుదరలేదంటున్నారు. ఇప్పుడు తమ నేతే హోంమంత్రి అవుతానంటుండటంతో..ఇక ఒక్కొక్కడి తాట తీయడం ఖాయమంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే పవన్ హోంమంత్రి బాధ్యతలు తీసుకుంటారా లేదా అన్నది పక్కన పెడితే.. మహిళలపై అఘాయిత్యాల విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్‌గా ఉందో చెప్పకనే చెప్పినట్లు కనిపిస్తోంది.
పాత టెండర్లు రద్దు చేసి కొత్తగా మళ్లీ పిలుస్తాం- మంత్రి నారాయణ