Tuni: తునిలో సై అంటే సై అంటున్న టీడీపీ, వైసీపీ.. ఈ నేతకు పట్టు చిక్కినట్లే చిక్కి చేజారిపోతోందా?
మరి ఐదోసారి అయినా వైస్ ఛైర్మన్ పీఠంపై ఏదో ఒకటి తేలుతుందా?

ఏపీలోని..మున్సిపాలిటీస్‌లో పవర్ గేమ్ నడుస్తోంది. మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్ పీఠాలపై జెండా పాతుతోంది కూటమి. ఒక్కో మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్‌ను స్వాధీనం చేసుకుంటోంది కూటమి. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు ఏలూరులో రెండు డిప్యూటీ మేయర్ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది.
హిందూపూర్ మున్సిపాలిటీని కూడా టీడీపీ చేజిక్కించుకుంది. తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠాన్ని కూడా టీడీపీ కైవసం చేసుకుంది. అయితే పలుచోట్ల మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎన్నిక హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. అందులో తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మాత్రం పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. అంతా అయిపోయింది. తుని కౌన్సిల్ వైస్ ఛైర్మన్ సీటు కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్తుందని అనుకున్న సమయంలో ఇదో ఒక ట్విస్టు ఎన్నికను వాయిదా వేస్తోంది.
తుని నియోజకవర్గానికి మాజీమంత్రి యనమల రామకృష్ణుడు కూతురు యనమల దివ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. సీనియర్ నేత అయిన యనమల కూతురే ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు మాత్రం నానా పాట్లు పడుతున్నారట. నాలుగు సార్లు ఎన్నిక వాయిదా పడిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని టీడీపీ కార్యకర్తలే గుసగుసలు పెట్టుకుంటున్నారు.
మెజార్టీ కౌన్సిలర్లు టీడీపీలోకి..
తుని మున్సిపాలిటీలో గతంలో టీడీపీకి ఒక్క సీటు రాకుండా దాదాపుగా ఏకగ్రీవం చేసుకుంది వైసీపీ. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఖాళీ అయింది. ఇప్పుడు ఉపఎన్నిక వచ్చింది. మెజార్టీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. తుని మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉంటే అందులో ఒకరు చనిపోగా..మరొకరి రాజీనామా చేశారు. 28 మందిలో పది మంది ఈ మధ్యే టీడీపీ జెండా కప్పుకున్నారు. వైస్ ఛైర్మన్ సభ్యురాలు న్యూట్రల్‌గా ఉంటున్నారు.
మిగిలిన 17మంది వైసీపీకి మద్దతుదారులుగా దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో ఉండిపోయారు. వైస్ ఛైర్మన్ పీఠం సొంతం చేసుకోవాలంటే అధికార పార్టీకి 14 మంది సంఖ్యాబలం కావాలి. ఇప్పటికే 10 మంది సభ్యులు టీడీపీలో చేరిపోవడంతో మరో నలుగురు సభ్యులు మద్దతు పలుకుతారని ఎదురుచూస్తున్నారు సైకిల్ పార్టీ లీడర్లు. ఎక్స్ అఫిషియో కింద ఎమ్మెల్యేకు ఓటు ఉండటంతో 15 ఓట్లతో పీఠాన్ని దక్కించుకోవచ్చని భావిస్తోంది టీడీపీ.
అయితే వైసీపీ పట్టువీడటం లేదు. దాడిశెట్టి రాజా తన వర్గం కౌన్సిలర్లను కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే 15 రోజుల నుంచి నాలుగుసార్లు వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడుతూ వస్తుండటంతో తుని పట్టణంలో టెన్షన్ పరిస్థితులు క్రియేట్ అవుతూ వస్తున్నాయి. టీడీపీ, వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.
నలుగురు కౌన్సిల్ సభ్యులను వైసీపీ నేతలు కిడ్నాప్ చేసి సెల్‌ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి నిర్భంధించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమకే సంఖ్యాబలం ఉంది..కౌన్సిలర్లు అంతా తమ పార్టీ నుంచి గెలిచినవారేనని చెప్తోంది వైసీపీ. తమ సభ్యులను ప్రలోభపెట్టి వైస్ ఛైర్మన్ పదవిని దక్కించుకోవాలని టీడీపీ కుట్ర చేస్తోందని ఫ్యాన్ పార్టీ లీడర్లు మండిపడుతున్నారు. పోలీసుల సాయంతో కావాలనే వైస్ ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.
బలాన్ని చూపించుకునేందుకు ఆరాటం
తుని పట్టణంలో గతంలో టీడీపీ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని మూడుసార్లు సొంతం చేసుకుంది. వైసీపీ, కాంగ్రెస్ ఒక్కోసారి తుని మున్సిపాలిటీ సొంతం చేసుకున్నాయి. అయితే ఈసారి వైస్ చైర్మన్ ఎన్నిక ద్వారా తన బలాన్ని చూపించుకునేందుకు ఇటు యనమల, అటు దాడిశెట్టి రాజా ఎవరి ఎత్తుల్లో వారున్నారు. వైస్ చైర్మన్ గెలిస్తే..మార్చిలో ఛైర్మన్‌పై అవిశ్వాసం పెట్టి ఆ సీటును కూడా తమ ఖాతాలో వేసుకోవాలని పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎవరికి వారు తగ్గకపోవడంతో వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడుతూ వస్తోంది.
వైస్ ఛైర్మన్ ఎన్నిక రోజు టీడీపీలో చేరిన కౌన్సిలర్లు వస్తున్నారు కానీ..వైసీపీ కౌన్సిలర్లు రావడం లేదు. పైగా ఛలో తుని అని పిలుపునిచ్చి వైసీపీ పొలిటికల్ హీట్ క్రియేట్ చేస్తోంది. అయితే అధికారంలో ఉండి కూడా వైసీపీపై అప్పర్ హ్యాండ్ సాధించడంలో యనమల వెనుకబడిపోతున్నారట. దాడిశెట్టి రాజా వ్యూహానికి తగ్గట్లుగా టీడీపీ నేతల కౌంటర్ యాక్షన్ ప్లాన్ ఉండటం లేదన్న మాట సైకిల్ పార్టీ కార్యకర్తల నుంచి వినిపిస్తోంది.
నాలుగోసారి కూడా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడటం చర్చనీయాంశం అవుతోంది. హైడ్రామా మధ్య పెండింగ్‌లో పడుతూ వస్తోంది. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తన కౌన్సిలర్లు చేజారిపోకుండా కాపాడుకోవడంలో సక్సెస్ అవుతున్నారు. ఆయన క్యాంప్ నుంచి కౌన్సిలర్లను బయటకు రప్పించేందుకు యనమల చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదట.
ఇప్పటివరకు మూడుసార్లు వాయిదా పడటంతో నాలుగోసారైనా వైస్ ఛైర్మన్ ఎన్నిక జరుగుతుందని భావించారు. కానీ నాలుగోసారి కూడా వాయిదా పడింది. మరి ఐదోసారి అయినా వైస్ ఛైర్మన్ పీఠంపై ఏదో ఒకటి తేలుతుందా..లేక వాయిదాల ఎపిసోడ్ కంటిన్యూ అవుతుందా అనేది వేచి చూడాలి.