NV Ramana: తెలుగువాడి గౌరవాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తా!

రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో సిద్దార్ధ ఆడిటోరియంలో సీజేఐ ఎన్‌వీ రమణకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు.

NV Ramana: తెలుగువాడి గౌరవాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తా!

Nv Ramana

Updated On : December 25, 2021 / 9:17 PM IST

NV Ramana: రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో సిద్దార్ధ ఆడిటోరియంలో సీజేఐ ఎన్‌వీ రమణకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొనగా.. ఎన్‌వీ రమణ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సంధర్భంగా ఎన్‌వీ రమణ మాట్లాడుతూ.. ఈ పురస్కారంతో నువ్వు ఇంకా చాలా‌ చేయాలని హెచ్చిరించినట్లు అయ్యిందని అన్నారు.

ఈ పురస్కారంతో నా బాధ్యత మరింత పెరిగిందని, తెలుగువాడిగా గౌరవాన్ని నిలపెట్టడానికి కృషి చేస్తున్నానని అన్నారు. నాకున్న పరిమితుల మేరకు ప్రతీ ఒక్కరికీ న్యాయం అందేలా చూస్తానని అన్నారు. రోటరీ క్లబ్ సభ్యులు నా గుణగణాలను‌ చూసి అవార్డు ఇచ్చినందుకు సంతోషంగా ఉందని, వారి సేవలను కూడా అభినందిస్తున్నాను అని అన్నారు.

ఇదే సమయంలో నేడు తెలుగు రాష్ట్రాల్లో రాజ్యాంగంపై పెద్ద చర్చే జరుగుతుందని, న్యాయవ్యవస్థ, రాజ్యాంగంపై ప్రజలంతా అవగాహన పెంచుకోవాలని అన్నారు. ప్రజలు తమ హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలని అన్నారు. సమాజం ఎంతో అభివృద్ధి చెందుతున్నా.. నిరక్షరాస్యత, అనారోగ్యం, విద్య, మూఢ నమ్మకాలతో బాధ పడుతున్నట్లు సీజేఐ ఎన్వీ రమణ చెప్పారు.

ప్రజలకు రాజ్యాంగం, హక్కుల గురించి తెలియజెప్పాలని, అన్నీ వ్యవస్థల తరహాలో న్యాయవ్యవస్థ కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందని, న్యాయ వ్యవస్థ, న్యాయ విద్య‌ ప్రాధాన్యతను మరచిపోతున్నామని, సమస్య వచ్చినా, హక్కులకు భంగం కలిగినా సామాన్య ప్రజలు న్యాయ స్థానాన్ని ఆశ్రయించాలని, చిన్నవారి నుంచి పెద్దవారు ‌వరకు న్యాయవ్యవస్థపై అవగాహన పెంచుకోవాలన్నారు. నేటికీ సరైన అవగాహన ప్రజల్లో లేదని, కోర్టుకు వస్తే అర్ధం‌కాని భాషతో ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని అన్నారు.