సహజీవనం : అనుమానంతో ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

సహజీవనం : అనుమానంతో ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

Updated On : January 11, 2021 / 6:58 PM IST

woman killed by man, due to illicit relation : అనంతపురంలో దారుణం జరిగింది. ఓ మహిళ హత్యకు గురైంది. అనుమానంతో ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తే హత్య చేశాడు.  అశోక నగర్ లో నివసిస్తున్న యశోద(32) అనే మహిళకు రాణి నగర్ కు చెందిన శంకర్ అనే రాడ్ బెండర్ తో12 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు కుమారులు పుట్టారు.

నాలుగేళ్ల క్రితం భార్యా భర్తల మధ్య మనస్పర్ధలు రావటంతో విడిపోయారు. పిల్లలను తీసుకుని యశోద విడిగా జీవిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు బుక్కరాయ సముద్రం, మసీదు కొట్టాలకు చెందిన ఆటో డ్రైవర్ మల్లికార్జున్ తో పరిచయం ఏర్పడింది. మల్లికార్జున్ కు వివాహం అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ పరిచయంతో వారిద్దరూ సహజీవనం చేయటం ప్రారంభించారు. యశోద పిల్లలిద్దరినీ ఆమె అక్క విజయలక్ష్మి కొ్త్త చెరువు హాస్టల్ లో చేర్పించింది.

ఒంటరిగా ఇంట్లో ఉంటున్న యశోద మరోక వ్యక్తితో చనువుగా ఉంటోందనే అనుమానం మల్లికార్జునకు కలిగింది. ఈవిషయమై ఇటీవల వారిద్దరి మధ్య మటా,మాటా పెరిగి ఘర్షణ జరిగింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగాయి. ఈ క్రమంలో శనివారం జనవరి 9వ తేదీ అర్ధరాత్రి ఇద్దరూ మళ్లీ గొడవ పడ్డారు. ఆ సమయంలో ఆవేశానికి లోనైన మల్లికార్జున్ అక్కడే ఉన్న ఇనుపరాడ్ తీసుకుని యశోద తలపై బలంగా కొట్టాడు.

ఆ దెబ్బకు తీవ్రంగా గాయపడిన యశోద,  కొద్ది సేపటికి అక్కడికక్కడే మరణించింది. ఆమె మరణించటంతో మల్లికార్జున్ అక్కడి నుంచి పరారయ్యాడు. తెల్లారిన తర్వాత ఆదివారం ఉదయం, ఆమె బావ, విజయలక్ష్మిభర్త సంజీవ్ కుమార్ కు ఫోన్ చేసి… మీ మరదల్ని చంపేసా వెళ్లి దాన్ని చూసుకోండి అని ఫోన్ చేసి చెప్పాడు.

వెంటనే సంజీవ్ కుమార్ తన భార్యను తీసుకుని అశోక్ నగర్ లోని యశోద ఇంటికి చేరుకున్నాడు. ఇంటి తలుపులు వేసి ఉండటంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే యశోద మృతి చెంది ఉంది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్నమల్లికార్జున్ కోసం  పోలీసులు గాలిస్తున్నారు.