విశాఖలో హాట్ సండే : గుళ్లో అమర్నాథ్, ఇంట్లోనే వెలగపూడి

YCP MLA Amarnath in Saibaba temple : విశాఖ (Vishaka) లో ఆదివారం కాస్తా హాట్ సండే అయ్యింది. రాజకీయ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీకి చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు (Velagapudi) ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని అధికారులు ఇటీవల కూల్చివేతకు దిగడంతో మొదలైన వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. విజయసాయిరెడ్డి (YSRCP MP Vijayasaireddy) ట్విట్టర్‌లో రామకృష్ణబాబు భూకబ్జా వ్యవహారంపై ట్వీట్ చేశారు. చంద్రబాబు అండతో టీడీపీ నేతలు వేల కోట్ల విలువైన భూముల్ని అక్రమంగా దోచేశారంటూ ఆరోపించారు.
విజయసాయిరెడ్డి ఆరోపణలపై స్పందించిన వెలగపూడి… పారదర్శకంగా దర్యాప్తు నిర్వహిస్తానని బాండ్ పేపర్‌పై రాసి ఇస్తావా? అని ప్రశ్నించారు. గజం కూడా ఆక్రమించలేదని నిరూపణ అయితే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తావా అని సవాల్ విసిరారు. అయితే దీనికి విశాఖ తూర్పు ఇంచార్జ్ విజయనిర్మల… తాను వస్తానంటూ ప్రతి సవాల్ చేసారు. అంతేకాదు ఏకంగా సాయిబాబా ఫోటోతో వెళ్లి మరింత ఉద్రిక్తత పెంచారు. అయితే తాను రమ్మన్నది విజయసాయిరెడ్డినని… అతను వస్తే ప్రమాణం చేస్తానని MLA వెలగపూడి ట్విస్ట్ ఇచ్చారు. ఎంపీ విజయసాయిరెడ్డి వస్తే… తాను ఎక్కడ ప్రమాణం చేయమన్నా చేస్తానని రామకృష్ణబాబు స్పష్టం చేశారు.
సవాల్ చేసిన ప్రకారం.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ (YCP MLA Gudivada Amarnath Ready) కార్యకర్తలతో 2020, డిసెంబర్ 27వ తేదీ ఆదివారం ర్యాలీగా సాయిబాబా ఆలయం (Sai Baba Temple) వద్దకు వచ్చారు. అంతకుముందు ఆయన భారీ ర్యాలీగా వైఎస్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఈస్ట్ పాయింట్ కాలనీలో సాయిబాబా ఆలయం వద్దకు చేరుకున్నారు అమర్‌నాథ్. మొదట సవాల్ చేసింది టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణేనని, ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే సవాలును స్వీకరించి సాయిబాబా గుడి వద్దకు రావాలని లేదంటే రాజకీయాల నుంచి వైదొలగాలని హెచ్చరించారు. ఆలయంలో వెలగపూడి కోసం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఎదురుచూశారు. అప్పటికి వెలగపుడి రాకపోవడంతో.. సవాల్ చేసినట్టు ఓడిపోయినట్టు ఒప్పుకోవాలన్నారు.. గుడివాడ అమర్‌నాథ్ రెడ్డి.