నేతన్నకు జగన్ భరోసా : చేనేత కుటుంబాలకు రూ.24వేల ఆర్థిక సాయం

అనంతపురం జిల్లాలో పర్యటనలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ నేతన్నలకు భరోసా కల్పించారు. ధర్మవరంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చేనేత మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి రూ.24వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించినట్టు చెప్పారు.
జిల్లాలోని నేతల్లో 27వలే 481 మంది లబ్ధిదారులు ఉన్నారని, వారి కోసం ప్రభుత్వం రూ.196.27 కోట్లను ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 81వేల 783 మంది మగ్గం కార్మికులకు సాయాన్ని అందిస్తామన్నారు. తాను పాదయాత్ర చేసిన సమయంలో ప్రతీ అడుగులోనూ నేతన్నల కష్టాలను చూశానని అన్నారు.
నేతన్నల సమస్యలను ఎవరూ పట్టించుకోలేదన్నారు. ధర్మవరం నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని జగన్ విమర్శించారు. ఆప్కో వ్యవస్థను స్కాం వ్యవస్థగా మార్చేశారని జగన్ మండిపడ్డారు. ఆప్కోపై దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే ఆప్కో వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు.
నేతన్నలలో అర్హుల కోసం రూ.196.27 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. ఉగాది నాటికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్టు చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితులందరికి భరోసా కల్పించినట్టే నేతన్నలకు కూడా భరోసా ఇచ్చారు.